1. దేవుడు లేచును గాక ఆయన శత్రువులు చెదరిపోవుదురు గాక ఆయనను ద్వేషించువారు ఆయన సన్నిధినుండి పారి పోవుదురు గాక.
2. పొగ చెదరగొట్టబడునట్లు నీవు వారిని చెదరగొట్టుము అగ్నికి మైనము కరుగునట్లు భక్తిహీనులు దేవుని సన్నిధికి కరగి నశించుదురు గాక.
3. నీతిమంతులు సంతోషించుదురు గాక వారు దేవుని సన్నిధిని ఉల్లసించుదురు గాక వారు మహదానందము పొందుదురు గాక
4. దేవునిగూర్చిపాడుడి ఆయన నామమునుబట్టి స్తోత్ర గానము చేయుడి వాహనమెక్కి అరణ్యములలో ప్రయాణముచేయు దేవునికొరకు ఒక రాజమార్గము చేయుడి యెహోవా అను ఆయన నామమునుబట్టి ఆయన సన్నిధిని ప్రహర్షించుడి.
5. తన పరిశుద్ధాలయమందుండు దేవుడు, తండ్రి లేని వారికి తండ్రియు విధవరాండ్రకు న్యాయకర్తయునై యున్నాడు
6. దేవుడు ఏకాంగులను సంసారులుగా చేయువాడు. ఆయన బంధింపబడినవారిని విడిపించి వారిని వర్ధిల్ల జేయువాడు విశ్వాసఘాతకులు నిర్జలదేశమందు నివసించుదురు.
7. దేవా, నీవు నీ ప్రజలముందర బయలుదేరినప్పుడు అరణ్యములో నీవు ప్రయాణము చేసినప్పుడు (సెలా.)
8. భూమి వణకెను దేవుని సన్నిధిని అంతరిక్షము దిగ జారెను ఇశ్రాయేలు దేవుడగు దేవుని సన్నిధిని ఆవలి సీనాయి కంపించెను.
9. దేవా, నీ స్వాస్థ్యముమీద నీవు వర్షము సమృద్ధిగా కురిపించితివి అది అలసియుండగా నీవు దానిని బలపరచితివి.
10. నీ సమూహము దానిలో నివసించును దేవా, నీ అనుగ్రహముచేత దీనులకు సదుపాయము కలుగజేసితివి.
11. ప్రభువు మాట సెలవిచ్చుచున్నాడు దానిని ప్రకటించు స్త్రీలు గొప్ప సైన్యముగా ఉన్నారు.
12. సేనల రాజులు పారిపోయెదరు పారిపోయెదరు ఇంట నిలిచినది దోపుడుసొమ్ము పంచుకొనును.
13. గొఱ్ఱల దొడ్లమధ్యను మీరు పండుకొనగా గువ్వల రెక్కలు వెండితో కప్పబడినట్లున్నది వాటి యీకెల రెక్కలు పచ్చని బంగారుతో కప్ప బడినట్టున్నది.
14. సర్వశక్తుడు అక్కడ రాజులను చెదరగొట్టినప్పుడు సల్మోనుమీద హిమము కురిసినట్లాయెను.
15. బాషాను పర్వతము దేవపర్వతము బాషాను పర్వతము శిఖరములుగల పర్వతము.
16. శిఖరములుగల పర్వతములారా, దేవుడు నివాసముగా కోరుకొన్న కొండను మీరేల ఓరచూపులు చూచుచున్నారు? యెహోవా నిత్యము అందులోనే నివసించును.
17. దేవుని రథములు సహస్రములు సహస్రసహస్రములు ప్రభువు వాటిలో నున్నాడు సీనాయి పరిశుద్ధమైనట్టు ఆ కొండ పరిశుద్ధమాయెను.
18. నీవు ఆరోహణమైతివి పట్టబడినవారిని చెరపట్టుకొని పోతివి మనుష్యులచేత నీవు కానుకలు తీసికొనియున్నావు. యెహోవా అను దేవుడు అక్కడ నివసించునట్లు విశ్వాసఘాతకులచేత సహితము నీవు కానుకలు తీసి కొని యున్నావు.
19. ప్రభువు స్తుతినొందును గాక అనుదినము ఆయన మా భారము భరించుచున్నాడు దేవుడే మాకు రక్షణకర్తయై యున్నాడు.
20. దేవుడు మా పక్షమున పూర్ణరక్షణ కలుగజేయు దేవుడై యున్నాడు మరణము తప్పించుట ప్రభువైన యెహోవా వశము.
21. దేవుడు నిశ్చయముగా తన శత్రువుల తలలు పగుల గొట్టును. మానక దోషములు చేయువారి వెండ్రుకలుగల నడి నెత్తిని ఆయన పగులగొట్టును.
22. ప్రభువు సెలవిచ్చినదేమనగానేను బాషానులోనుండి వారిని రప్పించెదను అగాధ సముద్రములలోనుండి వారిని రప్పించెదను.
23. వారి రక్తములో నీవు నీ పాదము ముంచుదువు నీ శత్రువులు నీ కుక్కల నాలుకలకు భాగమగుదురు.
24. దేవా, నీ గమనమును పరిశుద్ధ స్థలమునకు పోవు నా రాజగు దేవుని గమనమును వారు చూచి యున్నారు. చుట్టును కన్యకలు తంబురలు వాయించుచుండగా
25. కీర్తనలు పాడువారు ముందర నడచిరి. తంతివాద్యములు వాయించువారు వెనుక వచ్చెదరు.
26. సమాజములలో దేవుని స్తుతించుడి ఇశ్రాయేలులోనుండి ఉద్భవించినవారలారా, ప్రభు వును స్తుతించుడి.
27. కనిష్ఠుడగు బెన్యామీను అను, వారి యేలిక అచ్చట నున్నాడు. యూదా అధిపతుల పరివారమచ్చట నున్నది జెబూలూను అధిపతులును నఫ్తాలి అధిపతులును ఉన్నారు.
28. నీ దేవుడు నీకు బలము కలుగ నియమించియున్నాడు. దేవా, నీవు మాకొరకు చేసినదానిని బలపరచుము
29. యెరూషలేములోని నీ ఆలయమునుబట్టి రాజులు నీ యొద్దకు కానుకలు తెచ్చెదరు.
30. రెల్లులోని మృగమును ఆబోతుల గుంపును దూడలవంటి జనములును లొంగి, వెండి కడ్డీలను తెచ్చునట్లుగా వాటిని గద్దింపుము కలహప్రియులను ఆయన చెదరగొట్టియున్నాడు.
31. ఐగుప్తులోనుండి ప్రధానులు వచ్చెదరు కూషీయులు దేవునితట్టు తమ చేతులు చాచుకొని పరుగెత్తివచ్చెదరు.
32. భూరాజ్యములారా, దేవునిగూర్చి పాడుడి ప్రభువును కీర్తించుడి.(సెలా.)
33. అనాదిగానున్న ఆకాశాకాశవాహన మెక్కువానిని కీర్తించుడి ఆయన తన స్వరము వినబడజేయును అది బలమైన స్వరము.
34. దేవునికి బలాతిశయము నారోపించుడి మహిమోన్నతుడై ఆయన ఇశ్రాయేలుమీద ఏలు చున్నాడు అంతరిక్షమున ఆయన బలాతిశయమున్నది
35. తన పరిశుద్ధ స్థలములలో దేవుడు భీకరుడు ఇశ్రాయేలు దేవుడే తన ప్రజలకు బలపరాక్రమ ముల ననుగ్రహించుచున్నాడు దేవుడు స్తుతినొందును గాక.