1 యోహాను 3 : 1 (IRVTE)
మనం దేవుని పిల్లలం అని పిలిపించుకోవాలని తండ్రి మనకు ఎలాటి ప్రేమను కట్టబెట్టాడో చూడండి! మనం దేవుని పిల్లలమే. ఆ కారణం చేత లోకం మనలను గుర్తించదు, ఎందుకంటే అది దేవుణ్ణి ఎరగదు.
1 యోహాను 3 : 2 (IRVTE)
ప్రియులారా, ఇప్పుడు మనం దేవుని పిల్లలం. ఇక ముందు మనం ఎలా ఉండబోతున్నామో మనకు ఇంకా వెల్లడి కాలేదు. కాని క్రీస్తు ప్రత్యక్షం అయినప్పుడు మనం ఆయనను ఉన్నవాడు ఉన్నట్టుగానే చూస్తామనీ ఆయనలాగా ఉంటామనీ మనకు తెలుసు.
1 యోహాను 3 : 3 (IRVTE)
ఆయన మీద ఇలాంటి ఆశాభావం నిలిపిన ప్రతి ఒక్కడూ, ఆయన పవిత్రుడై ఉన్న విధంగా తనను తాను పవిత్రం చేసుకుంటాడు.
1 యోహాను 3 : 4 (IRVTE)
పాపం చేసే ప్రతివాడూ అక్రమంగా ప్రవర్తిస్తున్నాడు. పాపమంటే అక్రమమే.
1 యోహాను 3 : 5 (IRVTE)
మన పాపాలు తీసివేయడానికి క్రీస్తు మన కోసం వచ్చాడు. ఆయనలో ఏ పాపమూ లేదు.
1 యోహాను 3 : 6 (IRVTE)
ఆయనలో నిలిచి ఉన్నవారెవరూ పాపం చేస్తూ ఉండరు. పాపం చేస్తూ ఉన్నవాడు, ఆయన ఎవరో తెలుసుకోలేదు, ఆయనను ఎన్నడూ చూడలేదు.
1 యోహాను 3 : 7 (IRVTE)
పిల్లలూ, మిమ్మల్ని ఎవ్వరూ తప్పు దారి పట్టించకుండా జాగ్రత్త పడండి. క్రీస్తు నీతిమంతుడై ఉన్నట్టుగా, నీతిని జరిగించే ప్రతి వాడూ నీతిపరుడు.
1 యోహాను 3 : 8 (IRVTE)
పాపం చేస్తూ ఉండేవాడు సైతాను సంబంధి. ఎందుకంటే ఆరంభం నుండీ సైతాను పాపం చేస్తూనే ఉన్నాడు. సైతాను పనులను నాశనం చేయడానికి దేవుని కుమారుడు ప్రత్యక్షం అయ్యాడు.
1 యోహాను 3 : 9 (IRVTE)
దేవుని ద్వారా జన్మించిన వాడు పాపం చెయ్యడు. దేవుని ద్వారా జన్మించిన వాడిలో దేవుని విత్తనం ఉంటుంది కాబట్టి అతడు పాపం చెయ్యలేడు.
1 యోహాను 3 : 10 (IRVTE)
నీతిని జరిగించని వారు దేవుని పిల్లలు కాదు. తమ సోదరుణ్ణి ప్రేమించనివారు దేవుని పిల్లలు కాదు. దీన్ని బట్టి దేవుని పిల్లలెవరో, సైతాను పిల్లలెవరో తెలిసిపోతుంది.
1 యోహాను 3 : 11 (IRVTE)
చిన్నపిల్లలు కలిసి నివసించాలి మనం ఒకరిని ఒకరు ప్రేమించుకోవాలన్న సందేశం మీరు ఆరంభం నుండి వింటూనే ఉన్నారు.
1 యోహాను 3 : 12 (IRVTE)
సైతాను సంబంధి అయిన కయీను తన తమ్ముణ్ణి చంపాడు. మీరు అతనిలా ఉండవద్దు. కయీను తన తమ్ముణ్ణి ఎందుకు చంపాడు? అతని క్రియలు దుర్మార్గమైనవి. అతని తమ్ముని క్రియలు నీతిగలవి.
1 యోహాను 3 : 13 (IRVTE)
నా సోదరులారా, ఈ లోకం మిమ్మల్ని ద్వేషిస్తే ఆశ్చర్యపడకండి.
1 యోహాను 3 : 14 (IRVTE)
మనం మన సోదరులను ప్రేమిస్తున్నాం కాబట్టి మనం మరణంలో నుండి జీవంలోకి దాటిపోయామని మనకు తెలుసు. ప్రేమించనివాడు మరణంలోనే ఉండిపోతాడు.
1 యోహాను 3 : 15 (IRVTE)
తన సోదరుణ్ణి ద్వేషించే ప్రతివాడూ హంతకుడే. ఏ హంతకునిలోనూ శాశ్వత జీవం నిలిచి ఉండదని మీకు తెలుసు.
1 యోహాను 3 : 16 (IRVTE)
యేసు క్రీస్తు మన కోసం తన ప్రాణం అర్పించాడు. ప్రేమంటే ఇదే. మనం కూడా మన సోదరుల కోసం మన ప్రాణం అర్పించాలి.
1 యోహాను 3 : 17 (IRVTE)
ఈ లోకంలో అన్నీ ఉన్నవాడు, అవసరంలో ఉన్న తన సోదరుణ్ణి చూసి, అతనిపట్ల కనికరం చూపకపోతే, దేవుని ప్రేమ అతనిలో ఎలా ఉంటుంది?
1 యోహాను 3 : 18 (IRVTE)
నా ప్రియమైన పిల్లలూ, నాలుకతో మాటలతో ప్రేమిస్తున్నామని చెప్పడం కాదు, చేతలతో సత్యంతో ప్రేమిద్దాం.
1 యోహాను 3 : 19 (IRVTE)
దీనివలన మనం సత్య సంబంధులమని తెలుస్తుంది. అప్పుడు మన హృదయాలు ఆయన ఎదుట నిబ్బరంగా ఉంటాయి.
1 యోహాను 3 : 20 (IRVTE)
మన హృదయం మనపై నింద మోపితే, దేవుడు మన హృదయం కన్నా గొప్పవాడు, ఆయనకు అన్నీ తెలుసు.
1 యోహాను 3 : 21 (IRVTE)
ప్రియులారా, మన హృదయం మనపై నింద మోపకపోతే, దేవుని దగ్గర ధైర్యంగా ఉంటాం.
1 యోహాను 3 : 22 (IRVTE)
అప్పుడు, ఆయన ఆజ్ఞలు పాటిస్తూ, ఆయన దృష్టికి ఇష్టమైనవి చేస్తూ ఉండడం వల్ల, మనం ఏది అడిగినా, అది ఆయన దగ్గర నుండి పొందుతాం.
1 యోహాను 3 : 23 (IRVTE)
ఇదే ఆయన ఆజ్ఞ: ఆయన కుమారుడు యేసు క్రీస్తు నామంలో విశ్వాసం ఉంచాలి. ఆయన ఆజ్ఞ ప్రకారం ఒకరిని ఒకరు ప్రేమించుకోవాలి.
1 యోహాను 3 : 24 (IRVTE)
దేవుని ఆజ్ఞలు పాటించే వాడు ఆయనలో నిలిచి ఉంటాడు. దేవుడు అతనిలో నిలిచి ఉంటాడు. ఆయన మనకిచ్చిన ఆత్మ ద్వారా ఆయన మనలో నిలిచి ఉన్నాడని మనకు తెలుసు.

1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24