సమూయేలు మొదటి గ్రంథము 20 : 1 (IRVTE)
దావీదు, యోనాతాను తరువాత దావీదు రమాలోని నాయోతు నుండి పారిపోయి యోనాతాను దగ్గరకు వచ్చి “నేనేం చేశాను? నా తప్పు ఏంటి? నా ప్రాణం తీసేందుకు వెతికేలా మీ నాన్న దృష్టిలో నేను ఏం పాపం చేశాను?” అని అడిగాడు,
సమూయేలు మొదటి గ్రంథము 20 : 2 (IRVTE)
యోనాతాను “నువ్వు ఎన్నటికీ అలా అనుకోవద్దు, నువ్వు చనిపోవు. నాకు చెప్పకుండా మా తండ్రి చిన్న పనైనా, పెద్ద పనైనా చెయ్యడు. అతడు ఈ విషయం నాకు చెప్పకుండా ఎందుకు ఉంటాడు?” అన్నాడు.
సమూయేలు మొదటి గ్రంథము 20 : 3 (IRVTE)
దావీదు “నేను నీకు అనుకూలంగా ఉన్న విషయం మీ తండ్రికి బాగా తెలుసు కాబట్టి నీకు బాధ కలిగించడం ఇష్టంలేక నీకు చెప్పడం లేదు. యెహోవా మీద ఒట్టు, నీ మీద ఒట్టు, నిజంగా నాకూ, మరణానికి ఒక్క అడుగు దూరం మాత్రమే ఉంది” అని ప్రమాణపూర్తిగా చెప్పాడు.
సమూయేలు మొదటి గ్రంథము 20 : 4 (IRVTE)
యోనాతాను “నువ్వు ఎలా చేయమంటే నీ తరపున అలా చేస్తాను” అన్నాడు.
సమూయేలు మొదటి గ్రంథము 20 : 5 (IRVTE)
అప్పుడు దావీదు “రేపు అమావాస్య. అప్పుడు నేను తప్పక రాజుతో కలసి కూర్చుని భోజనం చెయ్యాలి. ఎల్లుండి సాయంత్రం వరకూ పొలంలో దాక్కోడానికి నాకు అనుమతి ఇవ్వు.
సమూయేలు మొదటి గ్రంథము 20 : 6 (IRVTE)
నేను లేకపోవడం మీ తండ్రి గమనించినప్పుడు నువ్వు ఈ మాట చెప్పాలి, ‘దావీదు ఇంటివారు ప్రతి ఏడూ బలి చెల్లించడం వారి ఆనవాయితీ. అందువల్ల అతడు బేత్లెహేమనే తన ఊరు వెళ్ళాలని నన్ను బతిమాలి నా దగ్గర అనుమతి తీసుకున్నాడు.’
సమూయేలు మొదటి గ్రంథము 20 : 7 (IRVTE)
మీ తండ్రి అలాగేనని సమ్మతించిన పక్షంలో నీ దాసుడనైన నాకు క్షేమమే. అతడు బాగా కోపగించి మనసులో నాకు కీడు చేయాలని సంకల్పిస్తే నువ్వు తెలుసుకుని
సమూయేలు మొదటి గ్రంథము 20 : 8 (IRVTE)
నీ దాసుడనైన నాకు ఒక మేలు చెయ్యాలి. ఏమిటంటే యెహోవా పేరట నీతో నిబంధన చేయడానికి నువ్వు నీ దాసుడనైన నన్ను రప్పించావు. నాలో ఏమైనా తప్పు ఉంటే మీ నాన్న దగ్గరికి నన్నెందుకు తీసుకువెళ్తావు? నువ్వే నన్ను చంపెయ్యి” అని యోనాతానును కోరాడు.
సమూయేలు మొదటి గ్రంథము 20 : 9 (IRVTE)
సమూయేలు మొదటి గ్రంథము 20 : 10 (IRVTE)
యోనాతాను “అలాంటి మాటలు ఎప్పటికీ అనవద్దు. మా తండ్రి నీకు కీడు చేయడానికి నిర్ణయించుకున్నాడని నాకు తెలిస్తే నీతో చెబుతాను గదా” అన్నాడు. దావీదు “మీ తండ్రి నన్నుగూర్చి నీతో కఠినంగా మాట్లాడినప్పుడు దాన్ని నాకు ఎవరు తెలియచేస్తారు?” అని యోనాతానును అడిగాడు.
సమూయేలు మొదటి గ్రంథము 20 : 11 (IRVTE)
అప్పుడు యోనాతాను “పొలంలోకి వెళ్దాం రా” అంటే, ఇద్దరూ పొలంలోకి వెళ్లారు.
సమూయేలు మొదటి గ్రంథము 20 : 12 (IRVTE)
అప్పుడు యోనాతాను “ఇశ్రాయేలీయులకు దేవుడైన యెహోవాయే సాక్ష్యం. రేపైనా, ఎల్లుండైనా, ఈ రోజైనా మా తండ్రిని అడుగుతాను, అప్పుడు దావీదుకు క్షేమం కలుగుతుందని నేను తెలుసుకొన్నప్పుడు ఆ సమాచారం పంపిస్తాను.
సమూయేలు మొదటి గ్రంథము 20 : 13 (IRVTE)
అయితే నా తండ్రి నీకు కీడు చేయాలని ఉద్దేశిస్తున్నాడని నాకు తెలిస్తే అది నీకు తెలియజేసి నీవు క్షేమంగా వెళ్ళేలా నిన్ను పంపించకపోతే యెహోవా నాకు గొప్ప కీడు కలుగచేస్తాడు గాక. యెహోవా నా తండ్రికి తోడుగా ఉండినట్లు నీకూ తోడుగా ఉంటాడు గాక.
సమూయేలు మొదటి గ్రంథము 20 : 14 (IRVTE)
అయితే నేనింకా బతికి ఉంటే నేను చావకుండా యెహోవా నిబంధన విశ్వాస్యతను నువ్వు నా పట్ల చూపిస్తావు కదా?
సమూయేలు మొదటి గ్రంథము 20 : 15 (IRVTE)
నేను మరణించిన తరువాత యెహోవా దావీదు శత్రువుల్లో ఒక్కడైనా భూమిపై లేకుండా నాశనం చేసిన తరువాత నువ్వు నా సంతతి పట్ల దయ చూపించకపోతే యెహోవా నిన్ను విసర్జిస్తాడు గాక.”
సమూయేలు మొదటి గ్రంథము 20 : 16 (IRVTE)
ఇలా యోనాతాను దావీదు వంశంతో నిబంధన చేశాడు. “ఈ విధంగా యెహోవా దావీదు శత్రువులు లెక్క అప్పగించేలా చేస్తాడు గాక” అని అతడు అన్నాడు.
సమూయేలు మొదటి గ్రంథము 20 : 17 (IRVTE)
యోనాతాను దావీదును తన ప్రాణస్నేహితుడిగా ప్రేమించాడు కాబట్టి ఆ ప్రేమను బట్టి దావీదు చేత తిరిగి ప్రమాణం చేయించాడు.
సమూయేలు మొదటి గ్రంథము 20 : 18 (IRVTE)
యోనాతాను దావీదుతో ఇలా అన్నాడు. “రేపు అమావాస్య. నువ్వుండే స్థలం ఖాళీగా కనబడుతుంది గదా నీవు లేని విషయం తెలిసిపోతుంది.
సమూయేలు మొదటి గ్రంథము 20 : 19 (IRVTE)
నువ్వు మూడు రోజులు ఆగి, ఈ పని జరుగుతుండగా నువ్వు దాక్కొన్న స్థలానికి త్వరగా వెళ్లి ఏసెలు అనే బండ దగ్గర ఉండు.
సమూయేలు మొదటి గ్రంథము 20 : 20 (IRVTE)
గురి చూసి వేసినట్టు నేను మూడు బాణాలు పక్కగా వేసి,
సమూయేలు మొదటి గ్రంథము 20 : 21 (IRVTE)
‘నీవు వెళ్లి బాణాలు వెతుకు’ అని ఒక పనివాడితో చెబుతాను, ‘బాణాలు నీకు ఈ వైపున ఉన్నాయి, వాటిని తీసుకురా’ అని అతనితో చెబితే నువ్వు బయటికి రావచ్చు. యెహోవాపై ఒట్టు, నీకు ఎలాంటి ప్రమాదం జరగదు, క్షేమమే కలుతుంది.
సమూయేలు మొదటి గ్రంథము 20 : 22 (IRVTE)
అయితే, ‘బాణాలు నీకు అవతల వైపు ఉన్నాయి’ అని నేను సేవకునితో చెప్పినప్పుడు పారిపొమ్మని యెహోవా సెలవిస్తున్నాడని గ్రహించి నువ్వు ప్రయాణమైపోవాలి.
సమూయేలు మొదటి గ్రంథము 20 : 23 (IRVTE)
అయితే మనమిద్దరం మాట్లాడుకొన్న విషయాలను జ్ఞాపకం ఉంచుకో. సదాకాలం యెహోవాయే మనకు సాక్షి.”
సమూయేలు మొదటి గ్రంథము 20 : 24 (IRVTE)
అప్పుడు దావీదు పొలంలో దాక్కున్నాడు. అమావాస్యనాడు రాజు భోజనం బల్ల దగ్గర కూర్చున్నప్పుడు
సమూయేలు మొదటి గ్రంథము 20 : 25 (IRVTE)
ఎప్పటిలాగానే రాజు గోడ దగ్గర ఉన్న స్థలం లో తన ఆసనంపై కూర్చుని ఉన్నాడు. యోనాతాను లేచినపుడు అబ్నేరు సౌలు దగ్గర కూర్చున్నాడు. అయితే దావీదు కూర్చునే స్థలం ఖాళీగా ఉంది.
సమూయేలు మొదటి గ్రంథము 20 : 26 (IRVTE)
సమూయేలు మొదటి గ్రంథము 20 : 27 (IRVTE)
“ఏదో జరిగి అతడు మైలబడ్డాడు. అతడు తప్పక అపవిత్రుడై ఉంటాడు” అని సౌలు అనుకున్నాడు. ఆ రోజు అతడు ఏమీ మాట్లాడలేదు. అయితే అమావాస్య తరువాతి రోజు, అంటే రెండవ రోజు దావీదు కూర్చునే స్థలం లో ఎవరూ లేకపోవడం చూసి సౌలు “నిన్న, నేడు యెష్షయి కొడుకు భోజనానికి రాకపోవడానికి కారణం ఏంటి?” అని యోనాతానును అడిగితే,
సమూయేలు మొదటి గ్రంథము 20 : 28 (IRVTE)
యోనాతాను “దావీదు బేత్లెహేముకు వెళ్ళాలని ఆశించి,
సమూయేలు మొదటి గ్రంథము 20 : 29 (IRVTE)
దయచేసి నన్ను వెళ్లనివ్వు, పట్టణంలో మా యింటివారు బలి అర్పించబోతున్నారు, నువ్వు కూడా రావాలని మా అన్న నాకు కబురు పంపాడు. కాబట్టి నాపై దయ చూపించి నేను వెళ్లి నా సోదరులను కలుసుకోనేలా నాకు సెలవిమ్మని బతిమాలుకుని నా దగ్గర సెలవు తీసుకున్నాడు. అందువల్లనే అతడు రాజుగారి భోజనపు బల్ల దగ్గరికి రాలేదు” అని సౌలుతో చెప్పాడు.
సమూయేలు మొదటి గ్రంథము 20 : 30 (IRVTE)
సౌలు యోనాతానుపై తీవ్రంగా కోపగించి “వక్రబుద్ధి గల తిరుగుబోతుదాని కొడుకా, నీకూ నీ తల్లికీ అవమానం కలిగేలా నువ్వు యెష్షయి కుమారుణ్ణి స్నేహితుడిగా ఎంచుకొన్న సంగతి నాకు తెలియదా?
సమూయేలు మొదటి గ్రంథము 20 : 31 (IRVTE)
యెష్షయి కొడుకు భూమిమీద బతికి ఉన్నంత కాలం నువ్వైనా, నీ రాజ్యమైనా స్థిరంగా ఉండవని నీకు తెలుసు గదా. కాబట్టి నువ్వు కబురు పంపి అతణ్ణి నా దగ్గరికి రప్పించు. నిజంగా అతడు చనిపోవలసిందే” అన్నాడు.
సమూయేలు మొదటి గ్రంథము 20 : 32 (IRVTE)
అందుకు యోనాతాను “అతడెందుకు మరణశిక్ష పొందాలి? అతడు ఏమి చేశాడు” అని సౌలును అడగగా,
సమూయేలు మొదటి గ్రంథము 20 : 33 (IRVTE)
సౌలు యోనాతానును పొడవాలని ఈటె విసిరాడు. దీన్నిబట్టి తన తండ్రి దావీదును చంపే ఉద్దేశం కలిగి ఉన్నాడని యోనాతాను తెలుసుకుని,
సమూయేలు మొదటి గ్రంథము 20 : 34 (IRVTE)
అమితమైన కోపం తెచ్చుకుని బల్ల దగ్గర నుండి లేచి, తన తండ్రి దావీదును అవమానపరచినందు వల్ల అతని కోసం దుఃఖపడుతూ అమావాస్య అయిపోయిన మరుసటి రోజు భోజనం మానేశాడు.
సమూయేలు మొదటి గ్రంథము 20 : 35 (IRVTE)
సమూయేలు మొదటి గ్రంథము 20 : 36 (IRVTE)
ఉదయాన్నే యోనాతాను దావీదుతో ముందుగా అనుకొన్న సమయానికి ఒక పనివాణ్ణి పిలుచుకుని పొలంలోకి వెళ్ళాడు. “నువ్వు పరుగెత్తుకొంటూ వెళ్ళి నేను వేసే బాణాలను వెతుకు” అని ఆ పనివాడితో చెప్పినప్పుడు వాడు పరుగెత్తుతుంటే అతడు ఒక బాణం వాడి అవతలి పక్కకు వేశాడు.
సమూయేలు మొదటి గ్రంథము 20 : 37 (IRVTE)
అయితే వాడు యోనాతాను వేసిన బాణం ఉన్నచోటుకు వస్తే యోనాతాను వాని వెనుక నుండి కేక వేసి “బాణం నీ అవతల ఉంది” అని చెప్పి
సమూయేలు మొదటి గ్రంథము 20 : 38 (IRVTE)
“నువ్వు ఆలస్యం చేయకుండా త్వరగా రా” అని కేక వేశాడు. యోనాతాను పనివాడు బాణాలు ఏరుకుని తన యజమాని దగ్గరికి వాటిని తీసుకువచ్చాడు గాని
సమూయేలు మొదటి గ్రంథము 20 : 39 (IRVTE)
సంగతి ఏమిటో అతనికి తెలియలేదు. యోనాతానుకు, దావీదుకు మాత్రమే ఆ సంగతి తెలుసు.
సమూయేలు మొదటి గ్రంథము 20 : 40 (IRVTE)
యోనాతాను తన ఆయుధాలను పనివాడి చేతికి ఇచ్చి “వీటిని పట్టణానికి తీసుకువెళ్ళు” అని చెప్పి అతణ్ణి పంపివేసాడు.
సమూయేలు మొదటి గ్రంథము 20 : 41 (IRVTE)
పనివాడు వెళ్లిపోగానే దావీదు దక్షిణపు దిక్కు నుండి బయటికి వచ్చి మూడుసార్లు సాష్టాంగ నమస్కారం చేసిన తరవాత వారు ఒకరినొకరు ముద్దు పెట్టుకొంటూ ఏడ్చారు. అయితే దావీదు మాత్రం మరింత గట్టిగా ఏడ్చాడు.
సమూయేలు మొదటి గ్రంథము 20 : 42 (IRVTE)
అప్పుడు యోనాతాను “యెహోవా నీకూ నాకూ, నీ సంతానానికీ నా సంతానానికీ మధ్య ఎల్లవేళలా సాక్షిగా ఉంటాడు గాక. మనమిద్దరం యెహోవా నామాన్ని బట్టి ఒట్టు పెట్టుకున్నాము కాబట్టి మనసులో నెమ్మది పొంది వెళ్ళు” అని దావీదుతో చెబితే దావీదు లేచి వెళ్లిపోగా, యోనాతాను తిరిగి పట్టణానికి వచ్చాడు.
❮
❯