2 పేతురు 3 : 1 (IRVTE)
ప్రభువు రాక, ప్రభువు దినం ప్రియులారా, ఇది నేను మీకు రాస్తున్న రెండవ ఉత్తరం. యథార్ధమైన మీ మనసును పురికొల్పడానికి జ్ఞాపకం చేస్తూ వీటిని రాస్తున్నాను.
2 పేతురు 3 : 2 (IRVTE)
పవిత్ర ప్రవక్తలు పూర్వకాలంలో చెప్పిన మాటలనూ, మన ప్రభువు, రక్షకుడు అయిన యేసు క్రీస్తు మీ అపొస్తలుల ద్వారా ఇచ్చిన ఆజ్ఞనూ మీరు గుర్తు చేసుకోవాలని ఈ ఉత్తరం రాస్తున్నాను.
2 పేతురు 3 : 3 (IRVTE)
ప్రభువు రెండవ రాకను చాలామంది నమ్మడం లేదు ముందుగా ఇది తెలుసుకోండి, చివరి రోజుల్లో తమ దురాశలను అనుసరించి నడిచే కొందరు బయలుదేరతారు.
2 పేతురు 3 : 4 (IRVTE)
“ఆయన మళ్ళీ వస్తాడన్న వాగ్దానం ఏమయ్యింది? మా పూర్వీకులు చనిపోయారు, కాని సృష్టి ఆరంభం నుండి అన్ని విషయాలూ ఏమీ మార్పు లేకుండానే జరిగిపోతున్నాయి” అంటూ మిమ్మల్ని ఎగతాళి చేస్తారు.
2 పేతురు 3 : 5 (IRVTE)
చాలాకాలం కిందట, ఆకాశాన్నీ భూమినీ దేవుడు తన వాక్కు ద్వారా నీళ్ళలో నుండి, నీళ్ళ ద్వారా స్థిరపరిచాడనీ,
2 పేతురు 3 : 6 (IRVTE)
ఆయన వాక్కును బట్టే, ఆ రోజుల్లో ఉన్న లోకం వరద నీటిలో మునిగి నాశనం అయ్యిందనీ,
2 పేతురు 3 : 7 (IRVTE)
అదే వాక్కును బట్టి ఇప్పటి ఆకాశం, భూమి భక్తిహీనులకు జరిగే తీర్పు రోజు వరకు, మంటల్లో నాశనం కావడానికి సిద్ధంగా ఉన్నదనీ వారు ఉద్దేశ పూర్వకంగా మరచిపోతారు.
2 పేతురు 3 : 8 (IRVTE)
కాని ప్రియులారా, ఈ విషయం మరచిపోకండి. ప్రభువు దృష్టికి ఒక్క రోజు వెయ్యి సంవత్సరాలుగా, వెయ్యి సంవత్సరాలు ఒక్క రోజుగా ఉంటాయి.
2 పేతురు 3 : 9 (IRVTE)
కొంతమంది అనుకుంటున్నట్టు ప్రభువు తాను చేసిన వాగ్దానాల విషయంలో ఆలస్యం చేసేవాడు కాదు గానీ అందరూ మారిన మనసుతో తిరిగి రావాలనీ, ఎవ్వరూ నశించ కూడదనీ కోరుతూ మీ పట్ల చాలా ఓర్పుతో ఉన్నాడు.
2 పేతురు 3 : 10 (IRVTE)
ప్రభువు దినం అయితే, ప్రభువుదినం ఎవరికీ తెలియని విధంగా దొంగ వచ్చినట్టు ఉంటుంది. అప్పుడు ఆకాశాలు మహా ఘోషతో గతించిపోతాయి. పంచభూతాలు మంటల్లో కాలిపోతాయి. భూమి, దానిలో ఉన్నవన్నీ తీర్పుకు గురౌతాయి.
2 పేతురు 3 : 11 (IRVTE)
ఇవన్నీ ఈ విధంగా నాశనం అయిపోతాయి గనుక మీరు పవిత్ర జీవనం, దైవభక్తి సంబంధమైన విషయాల్లో ఏ విధంగా జీవించాలి?
2 పేతురు 3 : 12 (IRVTE)
దేవుడు వచ్చే రోజు కోసం మీరు ఎదురు చూస్తున్నారు గనుక ఆ రోజు త్వరగా రావాలని ఆశించండి. ఆ దినాన పంచభూతాలు తీవ్రమైన సెగతో కరిగిపోతాయి. ఆకాశంలో ఉన్నవన్నీ మంటల్లో కాలిపోతాయి
2 పేతురు 3 : 13 (IRVTE)
అయినా, ఆయన చేసిన వాగ్దానం కారణంగా కొత్త ఆకాశం, కొత్త భూమి కోసం మనం ఎదురు చూస్తున్నాం. దానిలో నీతిపరులు నివాసం చేస్తారు.
2 పేతురు 3 : 14 (IRVTE)
కాబట్టి, ప్రియులారా, మీరు వీటి కోసం ఎదురు చూస్తున్నారు గనక ప్రశాంతంగా, ఆయన దృష్టిలో ఏ మచ్చా, కళంకం లేని వారిగా ఉండండి.
2 పేతురు 3 : 15 (IRVTE)
మన ప్రభువు చూపించే సహనం మన రక్షణ కోసమే అని గ్రహించండి. ఆ విధంగానే మన ప్రియ సోదరుడు పౌలు కూడా దేవుడు తనకు ఇచ్చిన జ్ఞానంతో రాశాడు.
2 పేతురు 3 : 16 (IRVTE)
అతడు ఈ సంగతులను గురించి తన లేఖలన్నిటిలో మాట్లాడుతున్నాడు. అయితే వాటిలో కొన్నిటిని అర్థం చేసుకోవడం కష్టం. పామరులు, నిలకడ లేని కొందరు అనేక ఇతర లేఖనాలను చేసినట్టే వీటిని కూడా వక్రీకరించి, వారి నాశనం వారే తెచ్చుకుంటారు.
2 పేతురు 3 : 17 (IRVTE)
కాబట్టి ప్రియులారా, ఈ విషయాలు మీకు తెలుసు కాబట్టి అక్రమకారుల మోసం మిమ్మల్ని తప్పు దారి పట్టించి మీ స్థిరత్వం పాడు చేయకుండా జాగ్రత్తపడండి.
2 పేతురు 3 : 18 (IRVTE)
మన ప్రభువు, రక్షకుడు అయిన యేసు క్రీస్తు కృపలో అభివృద్ధి పొందండి. ఆయనకే ఇప్పుడూ, శాశ్వతంగా మహిమ కలుగు గాక! ఆమేన్.

1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18