సమూయేలు రెండవ గ్రంథము 14 : 1 (IRVTE)
అబ్షాలోము యెరూషలేముకు తిరిగి రావడం రాజు తన మనస్సు అబ్షాలోము పైనే పెట్టుకుని ఉన్నాడని సెరూయా కుమారుడు యోవాబు గ్రహించాడు.
సమూయేలు రెండవ గ్రంథము 14 : 2 (IRVTE)
తెకోవ పట్టణం నుండి ఒక తెలివిగల స్త్రీని పిలిపించాడు. ఆమెతో “చాలాకాలం నుండి ఏడుస్తూ ఉన్నట్టు నటించు, విలాప దుస్తులు వేసుకో. నూనె రాసుకోకుండా ఎంతోకాలంగా విచారంగా ఉన్నట్టు నటిస్తూ
సమూయేలు రెండవ గ్రంథము 14 : 3 (IRVTE)
నీవు రాజు దగ్గరికి వెళ్ళి నేను చెప్పిన విధంగా రాజును వేడుకో” అని చెప్పాడు.
సమూయేలు రెండవ గ్రంథము 14 : 4 (IRVTE)
అప్పుడు ఆ తెకోవ స్త్రీ రాజు దగ్గరికి వచ్చింది. రాజుకు సాగిలపడి సమస్కారం చేసి “రాజా, నన్ను కాపాడు” అంది.
సమూయేలు రెండవ గ్రంథము 14 : 5 (IRVTE)
రాజు “నీకేం ఇబ్బంది కలిగింది?” అని అడిగాడు. ఆమె “నా భర్త చనిపోయాడు. విధవరాలిని.
సమూయేలు రెండవ గ్రంథము 14 : 6 (IRVTE)
నీ దాసిని, నాకు ఇద్దరు కొడుకులు ఉన్నారు. వారు పొలంలో వాదులాడుకుని కొట్టుకున్నారు. వారిని విడదీసేవారు ఎవ్వరూ లేకపోవడంతో వారిలో ఒకడు రెండవవాణ్ణి కొట్టి చంపాడు.
సమూయేలు రెండవ గ్రంథము 14 : 7 (IRVTE)
నా రక్త సంబంధులందరూ నీ దాసిని నామీదికి వచ్చి, ‘తన సోదరుణ్ణి చంపినవాణ్ణి అప్పగించు. వాడు తన సోదరుని ప్రాణం తీసినందుకు మేము వాణ్ణి చంపి వాడికి హక్కు లేకుండా చేస్తాము’ అంటున్నారు. ఈ విధంగా వారు నా భర్త పేరట భూమిపై ఉన్న హక్కును, కుటుంబ వారసత్వాన్ని లేకుండా చేయబోతున్నారు” అని రాజుతో చెప్పింది.
సమూయేలు రెండవ గ్రంథము 14 : 8 (IRVTE)
సమూయేలు రెండవ గ్రంథము 14 : 9 (IRVTE)
అప్పుడు రాజు “నువ్వు నీ ఇంటికి వెళ్ళు. నీ గురించి ఆజ్ఞ జారీ చేస్తాను” అని చెప్పాడు. అప్పుడు ఆ తెకోవ స్త్రీ “నా యజమానివైన రాజా, ఈ విషయంలో రాజుకు, రాజు సింహాసనానికి ఎలాంటి దోషం తగలకూడదు, అది నామీదా, నా కుటుంబం మీదా ఉండుగాక” అని రాజుతో అన్నది. అప్పుడు
సమూయేలు రెండవ గ్రంథము 14 : 10 (IRVTE)
రాజు “ఎవడైనా ఈ విషయంలో నీకేమైనా ఇబ్బంది కలిగిస్తే వాణ్ణి నా దగ్గరికి తీసుకురా. ఇక వాడు నీకు అడ్డు రాడు” అని ఆమెతో చెప్పాడు.
సమూయేలు రెండవ గ్రంథము 14 : 11 (IRVTE)
అప్పుడు ఆమె “హత్యకు ప్రతిగా హత్య చేసేవాడు నా కుమారుడికి ఏ హానీ తలపెట్టకుండా ఉండేలా రాజవైన నువ్వు నీ దేవుడైన యెహోవాను ప్రార్థించు” అని మనవి చేసింది. అప్పుడు రాజు “యెహోవా మీద ఒట్టు, నీ కొడుకు తలవెంట్రుకల్లో ఒక్కటి కూడా నేలపై పడదు” అని చెప్పాడు.
సమూయేలు రెండవ గ్రంథము 14 : 12 (IRVTE)
అప్పుడు ఆ స్త్రీ “నా యజమానివైన నీతో ఇంకొక మాట చెప్పుకోడానికి నీ దాసిని, నాకు దయచేసి అనుమతి ఇవ్వండి” అంది. రాజు “ఏమిటో చెప్పు” అన్నప్పుడు.
సమూయేలు రెండవ గ్రంథము 14 : 13 (IRVTE)
ఆ స్త్రీ “రాజు తాను చెప్పిన మాట ప్రకారం తన సొంతమనిషినే తిరిగి రానివ్వకుండా దోషం చేసిన వాడవుతున్నాడు. దేవుని ప్రజలైన వారికి వ్యతిరేకంగా నువ్వు ఎందుకు ఇలా చేస్తున్నావు?
సమూయేలు రెండవ గ్రంథము 14 : 14 (IRVTE)
మనమంతా చనిపోతాం, మనం నేలపై ఒలికిపోయి తిరిగి ఎత్తలేని నీళ్లలాగా ఉన్నాం. దేవుడు ప్రాణాలు తీయడు. వెళ్ళగొట్టిన వారు తనకు దూరంగా కాకుండా ఉండేలా ఆయన మార్గం చూపుతాడు.
సమూయేలు రెండవ గ్రంథము 14 : 15 (IRVTE)
మావాళ్ళు నన్ను భయపెట్టారు కాబట్టి నేను దీన్ని గురించి నా ఏలికవైన నీతో మాట్లాడాలని వచ్చాను. రాజు తన దాసిని, నా విన్నపం ఆలకించి,
సమూయేలు రెండవ గ్రంథము 14 : 16 (IRVTE)
దేవుని స్వాస్థ్యం అనుభవించకుండా నన్నూ, నా కొడుకునీ అంతం చేయాలని చూసేవారి చేతిలో నుండి నన్ను కాపాడతాడని అనుకొన్నాను.
సమూయేలు రెండవ గ్రంథము 14 : 17 (IRVTE)
నా ఏలికవైన నువ్వు చెప్పిన మాట నీ దాసినైన నాకు సమాధానకరంగా ఉంటుందని భావిస్తున్నాను. ఏలినవాడవైన నీకు నీ దేవుడైన యెహోవా తోడుగా ఉన్నాడు కనుక నువ్వు దేవదూత లాగా మంచి చెడులను వివేచించగలవు” అంది.
సమూయేలు రెండవ గ్రంథము 14 : 18 (IRVTE)
అప్పుడు రాజు “నేను నిన్ను అడిగే విషయం ఎంతమాత్రం దాచిపెట్టకుండా నాకు చెప్పు” అని ఆ స్త్రీతో అన్నాడు. ఆమె “నా యజమానివైన రాజా, ఏమిటో అడుగు” అంది.
సమూయేలు రెండవ గ్రంథము 14 : 19 (IRVTE)
రాజు “ఇదంతా యోవాబు నీకు చెప్పి పంపాడా?” అని అడిగాడు. అప్పుడు ఆమె ఇలా చెప్పింది “నా ఏలికవైన రాజా, నీ మీద ఒట్టు, చెప్పినదంతా తప్పకుండా గ్రహించడానికి నా యజమానివైన నీలాంటి రాజు తప్ప ఇంకెవ్వరూ లేరు. నీ సేవకుడు యోవాబు ఈ మాటలన్నిటినీ నీ దాసినైన నాకు నేర్పించాడు.
సమూయేలు రెండవ గ్రంథము 14 : 20 (IRVTE)
జరుగుతున్న పరిస్థితులను మార్చడానికి నీ సేవకుడు యోవాబు ఇలా చేశాడు. ఈ లోకంలో సమస్తాన్నీ గ్రహించడానికి నా రాజువైన నువ్వు దేవదూతలకుండే జ్ఞానం ఉన్నవాడవు.”
సమూయేలు రెండవ గ్రంథము 14 : 21 (IRVTE)
అప్పుడు రాజు యోవాబును పిలిచి “విను, నువ్వు చెప్పినది నేను అంగీకరించాను” అని చెప్పి,
సమూయేలు రెండవ గ్రంథము 14 : 22 (IRVTE)
“యువకుడైన అబ్షాలోమును రప్పించండి” అని ఆజ్ఞ ఇచ్చాడు. అప్పుడు యోవాబు సాష్టాంగపడి నమస్కారం చేసి రాజును కీర్తించాడు. “రాజువైన నువ్వు నీ దాసుడనైన నా మనవి అంగీకరించినందుకు నా ఏలికవైన నీ ద్వారా నేను అనుగ్రహం పొందానని నాకు తెలిసింది” అని చెప్పి, గెషూరుకు వెళ్లి
సమూయేలు రెండవ గ్రంథము 14 : 23 (IRVTE)
అబ్షాలోమును యెరూషలేముకు వెంటబెట్టుకుని వచ్చాడు.
సమూయేలు రెండవ గ్రంథము 14 : 24 (IRVTE)
అయితే రాజు “అతడు నాకు ఎదుట పడక తన ఇంటికి వెళ్ళిపోవాలి” అని చెప్పాడు. అబ్షాలోము రాజుకు తన ముఖం చూపించకుండా తన ఇంటికి వెళ్ళిపోయాడు.
సమూయేలు రెండవ గ్రంథము 14 : 25 (IRVTE)
ఇశ్రాయేలీయులందరిలో అబ్షాలోము అంతటి అందమైనవాడు ఎవ్వరూ లేరు. అరికాలు మొదలు నడినెత్తి వరకూ అతనిలో ఎలాంటి లోపమూ లేదు.
సమూయేలు రెండవ గ్రంథము 14 : 26 (IRVTE)
అతడు ఏడాదికొకసారి తన తలవెంట్రుకలు కత్తిరిస్తూ ఉంటాడు. ఆ వెంట్రుకల బరువు ఆనాటి కొలతను బట్టి దాదాపు రెండు కిలోగ్రాముల బరువు ఉండేది.
సమూయేలు రెండవ గ్రంథము 14 : 27 (IRVTE)
అబ్షాలోముకు ముగ్గురు కొడుకులు, ఒక కూతురు ఉన్నారు. అతని కూతురి పేరు తామారు. ఆమె అత్యంత సౌందర్యవతి.
సమూయేలు రెండవ గ్రంథము 14 : 28 (IRVTE)
అబ్షాలోము రాజును చూడకుండా పూర్తిగా రెండేళ్ళు యెరూషలేములోనే ఉండిపోయాడు.
సమూయేలు రెండవ గ్రంథము 14 : 29 (IRVTE)
రాజు దగ్గరికి యోవాబును పంపించడానికి అబ్షాలోము అతనికి కబురు పంపాడు. అయితే యోవాబు రాలేదు. రెండవసారి అతణ్ణి పిలిపించినప్పటికీ అతడు రాలేదు. అబ్షాలోముకు కోపం వచ్చింది.
సమూయేలు రెండవ గ్రంథము 14 : 30 (IRVTE)
తన పనివారిని పిలిచి “యోవాబు పొలం నా పొలం దగ్గరే ఉన్నది గదా. అతని పొలంలో యవల పంట కోతకు వచ్చి ఉంది. మీరు వెళ్లి ఆ పంటను తగలబెట్టండి” అని చెప్పాడు. అబ్షాలోము పనివాళ్ళు ఆ పంటలు తగలబెట్టారు.
సమూయేలు రెండవ గ్రంథము 14 : 31 (IRVTE)
ఇది తెలిసిన యోవాబు అబ్షాలోము ఇంటికి వచ్చి “నీ పనివాళ్ళు నా పంటలు ఎందుకు తగలబెట్టారు?” అని అడిగాడు.
సమూయేలు రెండవ గ్రంథము 14 : 32 (IRVTE)
అబ్షాలోము యోవాబుతో ఇలా అన్నాడు “గెషూరు నుండి నేను రావడంవల్ల ఉపయోగం ఏమిటి? నేను అక్కడే ఉండడం మంచిదని నీ ద్వారా రాజుకు చెప్పించడానికి నీకు కబురు పంపాను. నేను రాజును కలుసుకోవాలి. నాలో ఏమైనా నేరం కనిపిస్తే రాజు నాకు మరణశిక్ష విధించవచ్చు” అన్నాడు.
సమూయేలు రెండవ గ్రంథము 14 : 33 (IRVTE)
అప్పుడు యోవాబు రాజు దగ్గరికి వచ్చి ఆ విషయం రాజుకు చెప్పినప్పుడు, రాజు అబ్షాలోమును పిలిపించాడు. అతడు రాజు దగ్గరికి వచ్చి రాజు ముందు సాష్టాంగపడి నమస్కారం చేశాడు. రాజు అబ్షాలోమును దగ్గరికి తీసుకుని ముద్దు పెట్టుకున్నాడు.
❮
❯