ద్వితీయోపదేశకాండమ 3 : 1 (IRVTE)
బాషాను రాజు ఓగు ఓటమి మనం తిరిగి బాషాను దారిలో వెళ్తుండగా బాషాను రాజు ఓగు, అతని ప్రజలంతా ఎద్రెయీలో మనతో యుద్ధం చేయడానికి ఎదురుగా వచ్చారు.
ద్వితీయోపదేశకాండమ 3 : 2 (IRVTE)
యెహోవా నాతో ఇలా అన్నాడు. “అతనికి భయపడ వద్దు. అతన్నీ అతని ప్రజలనూ అతని దేశాన్నీ నీ చేతికి అప్పగించాను. హెష్బోనులో అమోరీయుల రాజు సీహోనుకు చేసినట్టే ఇతనికి కూడా చేయాలి.”
ద్వితీయోపదేశకాండమ 3 : 3 (IRVTE)
ఆ విధంగా మన దేవుడు యెహోవా బాషాను రాజు ఓగును, అతని ప్రజలందరినీ మన చేతికి అప్పగించాడు. అతనికి ఎవ్వరూ మిగలకుండా అందరినీ హతం చేశాం.
ద్వితీయోపదేశకాండమ 3 : 4 (IRVTE)
ఆ కాలంలో అతని పట్టణాలన్నీ స్వాధీనం చేసుకున్నాం. మన స్వాధీనంలోకి రాని పట్టణం ఒక్కటీ లేదు. బాషానులో ఓగు రాజ్యం అర్గోబు ప్రాంతంలో ఉన్న 60 పట్టణాలు ఆక్రమించుకున్నాం.
ద్వితీయోపదేశకాండమ 3 : 5 (IRVTE)
ఆ పట్టణాలన్నీ గొప్ప ప్రాకారాలు, ద్వారాలు, గడియలతో ఉన్న దుర్గాలు. అవిగాక ప్రాకారాలు లేని ఇంకా చాలా పట్టణాలు స్వాధీనం చేసుకున్నాం.
ద్వితీయోపదేశకాండమ 3 : 6 (IRVTE)
మనం హెష్బోను రాజు సీహోనుకు చేసినట్టు వాటిని నిర్మూలం చేశాం. ప్రతి పట్టణంలోని స్త్రీ పురుషులనూ పిల్లలనూ నాశనం చేశాం.
ద్వితీయోపదేశకాండమ 3 : 7 (IRVTE)
వారి పశువులనూ ఆ పట్టణాల ఆస్తినీ దోచుకున్నాం.
ద్వితీయోపదేశకాండమ 3 : 8 (IRVTE)
ఆ కాలంలో అర్నోను లోయ నుండి హెర్మోను కొండ వరకూ, యొర్దాను అవతల ఉన్న దేశాన్ని ఇద్దరు అమోరీయుల రాజుల దగ్గర నుండి స్వాధీనం చేసుకున్నాం.
ద్వితీయోపదేశకాండమ 3 : 9 (IRVTE)
సీదోనీయులు హెర్మోనును “షిర్యోను” అనేవారు. అమోరీయులు దాన్ని “శెనీరు” అనేవారు.
ద్వితీయోపదేశకాండమ 3 : 10 (IRVTE)
మైదానంలోని పట్టాణాలన్నిటిని, బాషానులోని ఓగు రాజ్య పట్టణాలైన సల్కా, ఎద్రెయీ అనేవాటి వరకూ గిలాదు అంతటినీ బాషానునూ ఆక్రమించాం.
ద్వితీయోపదేశకాండమ 3 : 11 (IRVTE)
రెఫాయీయులలో బాషాను రాజు ఓగు మాత్రం మిగిలాడు. అతనిది ఇనుప మంచం. అది అమ్మోనీయుల రబ్బాలో ఉంది గదా? దాని పొడవు తొమ్మిది మూరలు, వెడల్పు నాలుగు మూరలు.
ద్వితీయోపదేశకాండమ 3 : 12 (IRVTE)
భూమి విభజన అర్నోను లోయలో ఉన్న అరోయేరు పట్టణం * ఉత్తర దిశ నుండి నుండి గిలాదు కొండ ప్రాంతంలో సగమూ మనం అప్పుడు స్వాధీనం చేసుకొన్న దేశమూ దాని పట్టణాలూ రూబేనీయులకు, గాదీయులకు ఇచ్చాను.
ద్వితీయోపదేశకాండమ 3 : 13 (IRVTE)
ఓగు రాజుకు చెందిన బాషాను అంతటినీ, గిలాదులో మిగిలిన రెఫాయీయుల దేశమని పిలిచే బాషానునూ, అర్గోబు ప్రాంతమంతా మనష్షే అర్థ గోత్రానికి ఇచ్చాను.
ద్వితీయోపదేశకాండమ 3 : 14 (IRVTE)
మనష్షే కొడుకు యాయీరు గెషూరీయుల, మాయాకాతీయుల సరిహద్దుల వరకూ అర్గోబు ప్రాంతాన్ని పట్టుకుని, తన పేరును బట్టి వాటికి యాయీరు బాషాను గ్రామాలు అని పేరు పెట్టాడు. ఈ రోజు వరకూ వాటి పేరు అదే.
ద్వితీయోపదేశకాండమ 3 : 15 (IRVTE)
మాకీరీయులకు గిలాదును ఇచ్చాను.
ద్వితీయోపదేశకాండమ 3 : 16 (IRVTE)
గిలాదు నుండి అర్నోను లోయ మధ్య వరకూ, యబ్బోకు నది వరకూ, అమ్మోనీయుల పడమటి సరిహద్దు వరకూ రూబేనీయులకూ గాదీయులకూ ఇచ్చాను.
ద్వితీయోపదేశకాండమ 3 : 17 (IRVTE)
ఇవి కాక, కిన్నెరెతు నుండి తూర్పున పిస్గా కొండ వాలుల కింద, ఉప్పు సముద్రం అని పిలిచే అరాబా సముద్రం దాకా వ్యాపించిన అరాబా ప్రాంతాన్ని, యొర్దాను లోయ మధ్యభూమిని, రూబేనీయులకూ గాదీయులకూ ఇచ్చాను.
ద్వితీయోపదేశకాండమ 3 : 18 (IRVTE)
అప్పుడు నేను మీతో “మీరు స్వాధీనం చేసుకోడానికి మీ దేవుడు యెహోవా ఈ దేశాన్ని మీకిచ్చాడు. మీలో యుద్ధవీరులంతా సిద్ధపడి మీ సోదరులైన ఇశ్రాయేలు ప్రజలతో కలిసి నది దాటి రావాలి.
ద్వితీయోపదేశకాండమ 3 : 19 (IRVTE)
యెహోవా మీకు విశ్రాంతినిచ్చినట్టు మీ సోదరులకు కూడా విశ్రాంతినిచ్చే వరకూ నేను మీకిచ్చిన పట్టణాల్లో నివసించాలి.
ద్వితీయోపదేశకాండమ 3 : 20 (IRVTE)
అంటే మీ యెహోవా దేవుడు యొర్దాను అవతల వారికి ఇస్తున్న దేశాన్ని వారు స్వాధీనం చేసుకునే వరకూ, మీ భార్యలు, మీ పిల్లలు, మీ మందలు నేను మీకిచ్చిన పట్టణాల్లో నివసించాలి. ఆ తరువాత మీరు మీ స్వాస్థ్యాలకు తిరిగి రావాలి అని మీకు ఆజ్ఞాపించాను. మీ మందలు చాలా ఎక్కువని నాకు తెలుసు” అన్నాను.
ద్వితీయోపదేశకాండమ 3 : 21 (IRVTE)
యొర్దాను నది దాటడానికి మోషే నిషేధించబడుట్ట ఆ సమయంలో నేను యెహోషువకు ఇలా ఆజ్ఞాపించాను. “మీ యెహోవా దేవుడు ఈ ఇద్దరు రాజులకు చేసినదంతా నువ్వు కళ్ళారా చూశావు గదా. నువ్వు వెళ్తున్న రాజ్యాలన్నిటికీ యెహోవా అదే విధంగా చేస్తాడు.
ద్వితీయోపదేశకాండమ 3 : 22 (IRVTE)
మీ యెహోవా దేవుడు మీ పక్షంగా యుద్ధం చేస్తాడు కాబట్టి వారికి భయపడ వద్దు.”
ద్వితీయోపదేశకాండమ 3 : 23 (IRVTE)
ఆ రోజుల్లో నేను “యెహోవా, ప్రభూ, నీ మహిమనూ, నీ బాహుబలాన్నీ నీ దాసునికి చూపించడం ప్రారంభించావు.
ద్వితీయోపదేశకాండమ 3 : 24 (IRVTE)
ఆకాశంలో గాని, భూమిపై గాని నువ్వు చేసే పనులు చేయగల దేవుడెవడు? నీ అంత పరాక్రమం చూపగల దేవుడెవడు?
ద్వితీయోపదేశకాండమ 3 : 25 (IRVTE)
నేను అవతలికి వెళ్లి యొర్దాను అవతల ఉన్న ఈ మంచి దేశాన్ని, ఆ మంచి కొండ ప్రాంతాన్ని, ఆ లెబానోనును చూసేలా అనుగ్రహించు” అని యెహోవాను బతిమాలుకున్నాను.
ద్వితీయోపదేశకాండమ 3 : 26 (IRVTE)
యెహోవా మీ కారణంగా నా మీద కోపపడి నా మనవి వినలేదు. ఆయన నాతో ఇలా అన్నాడు. “చాలు. ఇంక ఈ సంగతిని గూర్చి నాతో మాట్లాడవద్దు.
ద్వితీయోపదేశకాండమ 3 : 27 (IRVTE)
నువ్వు ఈ యొర్దాను దాటకూడదు. అయితే, పిస్గా కొండ ఎక్కి పడమటి వైపు, ఉత్తరం వైపు, దక్షిణం వైపు, తూర్పు వైపు తేరి చూడు.
ద్వితీయోపదేశకాండమ 3 : 28 (IRVTE)
నీకు బదులుగా యెహోషువకు ఆజ్ఞాపించి, అతణ్ణి ప్రోత్సహించి, బలపరచు. అతడు ఈ ప్రజలను నడిపించి, నది దాటి, నువ్వు చూడబోయే దేశాన్ని వారు స్వాధీనపరచుకొనేలా చేస్తాడు.”
ద్వితీయోపదేశకాండమ 3 : 29 (IRVTE)
ఆ సమయంలో మనం బేత్పయోరు ఎదుట ఉన్న లోయలో ఉన్నాం.

1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29