ఎస్తేరు 1 : 1 (IRVTE)
వష్తి రాణి పతనం ఇండియా నుండి ఇతియోపియా* ఇతియోపియా ఆ రోజులో కూషు దేశం వరకూ గల 127 సంస్థానాలను పరిపాలించిన అహష్వేరోషు కాలంలో జరిగిన విషయాలు ఇవి.
ఎస్తేరు 1 : 2 (IRVTE)
ఆ కాలంలో అహష్వేరోషు రాజు షూషను కోటలో నుండి పరిపాలన సాగిస్తున్నాడు.
ఎస్తేరు 1 : 3 (IRVTE)
తన పరిపాలన మూడో సంవత్సరంలో అతడు తన అధిపతులకు, సేవకులకు విందు చేశాడు. పర్షియా, మాదీయ శూరులూ రాజవంశికులూ సంస్థానాల అధిపతులూ అతని సముఖంలో ఉన్నారు.
ఎస్తేరు 1 : 4 (IRVTE)
అతడు తన మహిమగల రాజ్య వైభవ ఐశ్వర్యాలనూ, తన విశిష్టత తాలూకు ఘనత ప్రతిష్టలనూ చాలా రోజులపాటు, అంటే 180 రోజులపాటు వారి ఎదుట ప్రదర్శించాడు.
ఎస్తేరు 1 : 5 (IRVTE)
ఆ రోజులు గడిచిన తరువాత రాజు ఏడు రోజుల పాటు విందు ఏర్పాటు చేయించాడు. అది షూషను కోటలో ఉన్న వారందరికీ, అంటే గొప్పవారు మొదలుకుని కొద్ది వారి వరకూ అందరికీ. అది రాజభవనం ఆవరణంలోని ఉద్యానవనంలో జరిగింది.
ఎస్తేరు 1 : 6 (IRVTE)
ఆ ఉద్యానవనం ఆవరణలో పాలరాతి స్తంభాలకు ఉన్న వెండి రింగులకు ముదురు కెంపు రంగు నార తాళ్ళు ఉన్నాయి. ఆ తాళ్లకు తెలుపు, నేరేడు వర్ణాల తెరలు వేలాడుతున్నాయి. వేరు వేరు రంగుల పాల రాయి పరచిన నేల మీద జలతారు కప్పి ఉన్న వెండి బంగారు తల్పాలు ఉన్నాయి.
ఎస్తేరు 1 : 7 (IRVTE)
అతిథులకు బంగారు పాత్రల్లో తాగేందుకు పోశారు. ప్రతి పాత్రా దేనికదే వేరుగా ఉంది. రాజు ఇష్టంగా ద్రాక్షారసాన్ని ధారాళంగా పోయించాడు.
ఎస్తేరు 1 : 8 (IRVTE)
ఆ విందు పానం “ఎవరికీ ఎలాంటి నిర్బంధమూ లేదు” అన్న రాజాజ్ఞ ప్రకారం జరిగింది. ఏ అతిథి కోరినట్టు అతనికి చెయ్యాలని రాజు ముందుగానే తన అంతఃపుర సేవకులకు ఆజ్ఞ ఇచ్చాడు.
ఎస్తేరు 1 : 9 (IRVTE)
వష్తి రాణి కూడా అహష్వేరోషు రాజ భవనంలో స్త్రీలకు విందు చేసింది.
ఎస్తేరు 1 : 10 (IRVTE)
ఏడో రోజున రాజు ద్రాక్షారసం సేవించి ఉల్లాసంగా మత్తెక్కి ఉన్న సమయంలో తన ముందు సేవాధర్మం జరిగించే మెహూమాను, బిజ్తా, హర్బోనా, బిగ్తా, అబగ్తా, జేతరు, కర్కసు అనే ఏడుగురు నపుంసకులకు ఒక ఆజ్ఞ ఇచ్చాడు.
ఎస్తేరు 1 : 11 (IRVTE)
అక్కడ సమావేశమైన ప్రజానీకానికి, అధిపతులకు వష్తి రాణి తన అందాన్ని ప్రదర్శించాలని, ఆమె రాజ కిరీటం ధరించుకుని తన సన్నిధికి రావాలని చెప్పి పంపాడు. ఆమె అసమాన సౌందర్య రాశి.
ఎస్తేరు 1 : 12 (IRVTE)
వష్తి రాణి నపుంసకులు వినిపించిన రాజాజ్ఞ ప్రకారం రావడానికి ఒప్పుకోలేదు. రాజుకు చాలా కోపం వచ్చింది. ఆగ్రహంతో రగిలి పోయాడు.
ఎస్తేరు 1 : 13 (IRVTE)
కాబట్టి జ్ఞానులుగా పేరు పొందిన వారితో కాలం పోకడలను ఎరిగిన వారితో అతడు సంప్రదించాడు. చట్టం, రాజ్యధర్మం తెలిసిన వారి సలహా తీసుకోవడం రాజుకు వాడుక.
ఎస్తేరు 1 : 14 (IRVTE)
కర్షెనా, షెతారు, అద్మాతా, తర్షీషు, మెరెను, మర్సెనా, మెమూకాను అనే ఏడుగురు అతనికి సన్నిహితంగా ఉండిన వారు. వీరికి రాజు ఎప్పుడూ అందుబాటులో ఉంటాడు. రాజ్యంలో అత్యున్నత అధికార స్థానాల్లో ఉన్న పారసీకుల, మాదీయుల ఏడుగురు ప్రధానులు వీరే.
ఎస్తేరు 1 : 15 (IRVTE)
రాజు “రాజైన అహష్వేరోషు అనే నేను నపుంసకుల ద్వారా పంపిన ఆజ్ఞకు వష్తి రాణి లోబడ లేదు కాబట్టి చట్ట పరిధిలో ఆమెను ఏమి చేయాలి?” అని వారిని అడిగాడు.
ఎస్తేరు 1 : 16 (IRVTE)
మెమూకాను రాజు ఎదుటా ప్రధానుల ఎదుటా ఇలా జవాబిచ్చాడు. “వష్తి రాణి రాజుకు వ్యతిరేకంగా మాత్రమే కాదు, రాజైన అహష్వేరోషు పాలనలోని సంస్థానాలన్నిటిలోని అధిపతులందరికీ, ప్రజలందరికీ వ్యతిరేకంగా తప్పు చేసింది.
ఎస్తేరు 1 : 17 (IRVTE)
స్త్రీలందరికీ ఈ విషయం తెలుస్తుంది. వారంతా తమ పురుషులను చులకన చేస్తారు. ఎలాగంటే, ‘అహష్వేరోషు రాజు తన రాణి వష్తిని తన సన్నిధికి పిలుచుకు రావాలని ఆజ్ఞాపిస్తే ఆమె రాలేదు’ అంటారు.
ఎస్తేరు 1 : 18 (IRVTE)
పారసీక, మాదీయ అధిపతుల భార్యలు రాణి చేసినది విని, రాణి పలికినట్టే ఈ రోజు రాజు అధిపతులందరితో పలుకుతారు. దీని వలన చాలా తిరస్కారం, కోపం కలుగుతాయి.
ఎస్తేరు 1 : 19 (IRVTE)
రాజుగారికి అంగీకారం అయితే రాజైన అహష్వేరోషు సమక్షంలోకి వష్తి రాణి ఇక ఎన్నడూ రాకూడదని మీరు ఆజ్ఞ ఇవ్వాలి. ఈ శాసనం స్థానంలో మరొకటి ఎన్నటికీ రాకుండేలా పారసీకుల, మాదీయుల చట్ట ప్రకారం దాన్ని రాయాలి. రాజు వష్తి కంటే యోగ్యురాలికి రాణి పదవి ఇవ్వాలి.
ఎస్తేరు 1 : 20 (IRVTE)
రాజు చేసే నిర్ణయం విశాలమైన మీ రాజ్యమంతటా ప్రకటించినట్టయితే, ఘనురాలు గానీ అల్పురాలు గానీ స్త్రీలందరూ తమ పురుషులను గౌరవిస్తారు.”
ఎస్తేరు 1 : 21 (IRVTE)
ఈ సలహా రాజుకీ అధికారులకీ నచ్చింది. కాబట్టి అతడు మెమూకాను మాట ప్రకారం చేశాడు.
ఎస్తేరు 1 : 22 (IRVTE)
ప్రతి మగ వాడు తన ఇంట్లో అధికారిగా ఉండాలని శాసించాడు. ప్రతి రాజ సంస్థానానికి దాని రాత లిపి ప్రకారం, ప్రతి జాతికీ దాని భాష ప్రకారం ఆదేశాలు వెళ్ళాయి. ఈ శాసనం సామ్రాజ్యం అంతటా రాజు వివిధ ప్రజల భాషల్లో రాసి పంపించాడు.

1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22