ఎస్తేరు 5 : 1 (IRVTE)
రాజుకు ఎస్తేరు విన్నపం మూడో రోజున ఎస్తేరు రాణివస్త్రాలు ధరించుకుని రాజభవనం ఆవరణంలో రాజు సన్నిధికి వెళ్లి నిలబడింది. రాజనగరు ద్వారానికి ఎదురుగా ఉన్న ఆవరణంలో రాజు తన సింహాసనం మీద కూర్చుని ఉన్నాడు.
ఎస్తేరు 5 : 2 (IRVTE)
ఎస్తేరురాణి ఆవరణంలో నిలబడి ఉండడం రాజు చూశాడు. అతనికి ఆమెపై ఇష్టం పుట్టింది. రాజు తన చేతిలోని బంగారపు రాజ దండాన్ని ఎస్తేరు వైపు చాపాడు. ఎస్తేరు దగ్గరికి వచ్చి దండం కొనను తాకింది.
ఎస్తేరు 5 : 3 (IRVTE)
రాజు “రాణివైన ఎస్తేరూ, నీకేమి కావాలి? నీ మనవి ఏమిటి? అర్థ రాజ్యం కోరినా సరే, నీకు ఇచ్చేస్తాను” అన్నాడు.
ఎస్తేరు 5 : 4 (IRVTE)
అప్పుడు ఎస్తేరు “రాజుకు సమంజసం అనిపిస్తే నేను రాజు కోసం ఏర్పాటు చేయించిన విందుకు రాజైన మీరూ హామానూ ఈ రోజు రావాలని నా కోరిక” అంది.
ఎస్తేరు 5 : 5 (IRVTE)
అప్పుడు రాజు “ఎస్తేరు అడిగిన ప్రకారం జరిగేలా హామానును కూడా త్వరగా తెండి” అని ఆజ్ఞ ఇచ్చాడు. రాజు, హామాను ఎస్తేరు చేయించిన విందుకు వచ్చారు.
ఎస్తేరు 5 : 6 (IRVTE)
విందులో ద్రాక్షారసం పోస్తుండగా రాజు ఎస్తేరుతో “నీ కోరిక ఏమిటి? దాన్ని తీరుస్తాను. నీ మనవి ఏమిటి? అర్థ రాజ్యమైనా సరే, నీకు ఇస్తాను” అని చెప్పాడు.
ఎస్తేరు 5 : 7 (IRVTE)
ఎస్తేరు ఇలా బదులు ఇచ్చింది “రాజైన మీకు నాపై అనుగ్రహం కలిగితే, నా మనవి ప్రకారం చేయడం రాజైన మీకు అనుకూలమైతే,
ఎస్తేరు 5 : 8 (IRVTE)
రాజైన మీరూ హామానూ రేపు కూడా మీ కోసం నేను చేయించబోయే విందుకు రావాలి. మీ ప్రశ్నకు జవాబు అప్పుడు ఇస్తాను.”
ఎస్తేరు 5 : 9 (IRVTE)
మొర్దెకైను చంపించడానికి హామాను ఏర్పాటు ఆ రోజు హామాను సంతోషంగా ఉల్లాసంగా బయలుదేరాడు. రాజు భవన ద్వారం దగ్గర ఉన్న మొర్దెకై తనను చూసి లేచి నిలబడక పోవడం, అసలు ఎలాటి భయం చూపకపోవడం చూసి మొర్దెకై మీద మండిపడ్డాడు.
ఎస్తేరు 5 : 10 (IRVTE)
అయితే అతడు కోపం అణచుకుని ఇంటికి పోయి తన స్నేహితులను తన భార్య జెరెషును పిలిపించాడు.
ఎస్తేరు 5 : 11 (IRVTE)
తన ఐశ్వర్య వైభవాల గురించి, తనకున్న చాలామంది కొడుకుల గురించి, రాజు తనని రాజోద్యోగులందరి కంటే, రాజసేవకులందరి కంటే ఎలా ఉన్నత స్థాయిలో ఉంచాడో వారికి వివరించాడు.
ఎస్తేరు 5 : 12 (IRVTE)
ఇంకా అతడు “ఎస్తేరు రాణి తాను చేయించిన విందుకు రాజును నన్ను తప్ప మరి ఎవరినీ పిలవ లేదు. రేపు కూడా రాజుతో కలిసి విందుకు రమ్మని నాకు ఆహ్వానం అందింది” అని చెప్పాడు.
ఎస్తేరు 5 : 13 (IRVTE)
“అయితే యూదుడైన మొర్దెకై రాజభవన ద్వారం దగ్గర కూర్చుని ఉండడం నేను చూస్తున్నంత కాలం ఈ పదవి అంతటి వలనా నాకు ప్రయోజనమేముంది?” అని అతడు అన్నాడు.
ఎస్తేరు 5 : 14 (IRVTE)
అతని భార్య జెరెషు, అతని స్నేహితులందరూ “50 మూరల ఎత్తున్న ఉరికొయ్య ఒకటి చేయించు. దాని మీద మొర్దెకైని ఉరి తీసేలా రేపు రాజుకు మనవి చెయ్యి. ఆపైన సంతోషంగా రాజుతో కలిసి విందుకు పోవచ్చు” అని అతనితో చెప్పారు. ఈ సంగతి హామానుకు సముచితంగా తోచింది. అతడు ఉరికొయ్య ఒకటి సిద్ధం చేయించాడు.
❮
❯
1
2
3
4
5
6
7
8
9
10
11
12
13
14