ఎస్తేరు 6 : 1 (IRVTE)
మొర్దెకైకు సత్కరం ఆ రాత్రి రాజుకు నిద్ర పట్టలేదు. అతడు తన పరిపాలన విశేషాలు రాసి ఉండే గ్రంథం తీసుకు రమ్మని ఆజ్ఞ ఇచ్చాడు. వారు తెచ్చి దాన్ని రాజుకు చదివి వినిపించారు.
ఎస్తేరు 6 : 2 (IRVTE)
ద్వారపాలకులు బిగ్తాను, తెరెషు అనే ఇద్దరు నపుంసకులు రాజైన అహష్వేరోషును చంపడానికి కుట్ర పన్నిన సంగతి మొర్దెకై బయట పెట్టి తెలియజేసినట్టు అందులో రాసి ఉంది.
ఎస్తేరు 6 : 3 (IRVTE)
రాజు ఆ సంగతి విని “మరి దీని కోసం మొర్దెకైకి సన్మానంగా, గుర్తింపుగా ఏదైనా చేశామా?” అని అడిగాడు. రాజు సేవకులు “అతనికేమీ చేయలేదు” అని జవాబిచ్చారు.
ఎస్తేరు 6 : 4 (IRVTE)
అప్పుడు “ఆవరణంలో ఉన్నది ఎవరు?” అని రాజు అడిగాడు. అప్పటికి హామాను తాను చేయించిన ఉరి కొయ్య మీద మొర్దెకైని ఉరి తీయించడానికి రాజు అనుమతి అడగడానికి రాజ భవంతి ఆవరణంలోకి వచ్చి ఉన్నాడు.
ఎస్తేరు 6 : 5 (IRVTE)
రాజ సేవకులు “అయ్యా, హామాను ఆవరణంలో నిలబడి ఉన్నాడు” అని రాజుతో చెప్పారు. రాజు “అతన్ని రానియ్యండి” అన్నాడు. హామాను లోపలికి వచ్చాడు.
ఎస్తేరు 6 : 6 (IRVTE)
“రాజు ఎవరినైనా గొప్ప చేసి సత్కరించాలనుకుంటే ఏమి చేయాలి?” అని రాజు అతన్ని అడిగాడు. హామాను “నన్ను గాక రాజు మరి ఇంకెవరిని గొప్ప చేయాలనుకుంటాడు?” అని తనలో తాను అనుకుని రాజుతో ఇలా అన్నాడు,
ఎస్తేరు 6 : 7 (IRVTE)
“రాజు సత్కరించాలని కోరిన వాడికి ఇలా చెయ్యాలి.
ఎస్తేరు 6 : 8 (IRVTE)
రాజు ధరించుకునే రాజవస్త్రాలను, రాజు ఎక్కే గుర్రాన్ని, రాజు తన తలపై పెట్టుకునే రాజకిరీటాన్ని తేవాలి.
ఎస్తేరు 6 : 9 (IRVTE)
ఆ వస్త్రాలనూ ఆ గుర్రాన్నీరాజు ఉన్నతాధికారుల్లో ఒకడికి అప్పగించాలి. రాజు గొప్ప చేయాలని కోరుకున్న వ్యక్తికి ఆ వస్త్రాలు తొడిగి ఆ గుర్రం మీద అతణ్ణి ఎక్కించి రాజవీధిలో ఊరేగిస్తూ ‘రాజు గొప్ప చేయాలని కోరిన వాడికి ఈ విధంగా చేస్తారు’ అని అతని ముందు నడుస్తూ చాటించాలి.”
ఎస్తేరు 6 : 10 (IRVTE)
వెంటనే రాజు “అయితే తొందరగా వెళ్లి నువ్వు చెప్పినట్టే ఆ వస్త్రాలనూ ఆ గుర్రాన్నీ తీసుకుని రాజ ద్వారం దగ్గర కూర్చుని ఉన్న యూదుడైన మొర్దెకైకి ఆ విధంగా చెయ్యి. నువ్వు చెప్పిన వాటిలో ఏదీ తక్కువ కానియ్యకుండా అంతా చెయ్యి” అని హామానుకు ఆజ్ఞాపించాడు.
ఎస్తేరు 6 : 11 (IRVTE)
హామాను ఆ వస్త్రాలను, గుర్రాన్నీ తెచ్చి మొర్దెకైకి ఆ బట్టలు తొడిగి ఆ గుర్రం మీద అతన్ని కూర్చోబెట్టి రాజ వీధిలో నడిపిస్తూ “రాజు గొప్ప చేయాలని కోరే వాడికి ఇలా జరుగుతుంది” అని అతని ముందర నడుస్తూ చాటించాడు.
ఎస్తేరు 6 : 12 (IRVTE)
తరువాత మొర్దెకై రాజు ద్వారం దగ్గరికి తిరిగి వచ్చాడు. హామాను మాత్రం తలపై గుడ్డ కప్పుకుని హతాశుడై గబగబా ఇంటికి వెళ్లి పోయాడు.
ఎస్తేరు 6 : 13 (IRVTE)
హామాను తనకు పట్టిన గతి తన భార్య జెరెషుకు, తన స్నేహితులందరికీ చెప్పాడు. అతని దగ్గర ఉన్న జ్ఞానులు, అతని భార్య జెరెషు “ఎవరి ఎదుట నీవు పడిపోవడం మొదలయిందో ఆ మొర్దెకై యూదు జాతివాడైతే గనక అతన్ని నీవు ఓడించలేవు. అతని చేతుల్లో నీకు పతనం తప్పదు” అని అతనితో అన్నారు.
ఎస్తేరు 6 : 14 (IRVTE)
వారు ఇంకా మాట్లాడుతూ ఉండగానే రాజుగారి ఉద్యోగులు వచ్చి ఎస్తేరు ఏర్పాటు చేసిన విందుకు రమ్మని హామానును తొందర పెట్టారు.
❮
❯
1
2
3
4
5
6
7
8
9
10
11
12
13
14