నిర్గమకాండము 2 : 1 (IRVTE)
మోషే పుట్టుక లేవి వంశానికి చెందిన ఒక వ్యక్తి వెళ్లి లేవి స్త్రీలలో ఒకామెను పెళ్లి చేసుకున్నాడు.
నిర్గమకాండము 2 : 2 (IRVTE)
ఆమె గర్భం ధరించి ఒక కొడుకును కన్నది. వాడు ఎంతో అందంగా ఉండడం వల్ల అతణ్ణి మూడు నెలల పాటు దాచిపెట్టింది.
నిర్గమకాండము 2 : 3 (IRVTE)
ఇక అతణ్ణి దాచి ఉంచలేక జమ్ముతో ఒక పెట్టె చేయించి, దానికి జిగురు, కీలు పూసి, అందులో ఆ పిల్లవాణ్ణి పెట్టి, నది ఒడ్డున జమ్ము గడ్డిలో ఉంచింది.
నిర్గమకాండము 2 : 4 (IRVTE)
పిల్లవాడికి ఏమైనా జరుగుతుందేమోనని వాడి అక్క దూరంగా నిలబడి చూస్తూ ఉంది.
నిర్గమకాండము 2 : 5 (IRVTE)
ఫరో చక్రవర్తి కూతురు స్నానం చేయడానికి నది దగ్గరికి వచ్చింది. ఆమె దాసీలు నది ఒడ్డున విహరిస్తూ ఉన్నారు. ఆమె రెల్లు గడ్డిలో ఉన్న ఆ పెట్టెను చూసి, తన దాసిని పంపి దాన్ని తెప్పించింది.
నిర్గమకాండము 2 : 6 (IRVTE)
పెట్టె తెరిచినప్పుడు ఏడుస్తూ ఉన్న పిల్లవాడు కనిపించాడు. ఆమె వాడిపై జాలిపడింది. “వీడు హెబ్రీయుల పిల్లవాడు” అంది.
నిర్గమకాండము 2 : 7 (IRVTE)
అప్పుడు దూరంగా నిలబడి ఉన్న పిల్లవాడి అక్క వచ్చి ఫరో కూతురితో “నీ కోసం ఈ పిల్లవాణ్ణి పెంచడానికి నేను వెళ్లి హెబ్రీ స్త్రీలలో ఒక ఆయాని తీసుకు రమ్మంటారా?” అని అడిగింది.
నిర్గమకాండము 2 : 8 (IRVTE)
ఫరో కూతురు “వెళ్లి తీసుకు రా” అంది. ఆ బాలిక వెళ్లి ఆ బిడ్డ తల్లిని తీసుకు వచ్చింది.
నిర్గమకాండము 2 : 9 (IRVTE)
ఫరో కూతురు ఆమెతో “ఈ పిల్లవాణ్ణి తీసుకు పోయి నా కోసం పాలిచ్చి పెంచు. నేను నీకు జీతం ఇస్తాను” అని చెప్పింది. ఆమె పిల్లవాణ్ణి తీసుకు పోయి పాలిచ్చి పెంచింది.
నిర్గమకాండము 2 : 10 (IRVTE)
నిర్గమకాండము 2 : 11 (IRVTE)
ఆ పిల్లవాడు పెద్దవాడైన తరువాత ఆమె అతణ్ణి ఫరో కూతురి దగ్గరికి తీసుకు వచ్చింది. అతడు ఆమెకు కొడుకు అయ్యాడు. ఆమె “నీళ్ళలో నుండి నేను ఇతన్ని బయటకు తీశాను, కాబట్టి ఇతని పేరు * నీటిలో నుండి తీసిన. మోషే” అని చెప్పింది. మోషే మిద్యాను పలాయనం మోషే పెద్దవాడైన తరువాత తన ప్రజల దగ్గరికి వెళ్ళాడు. వారు పడుతున్న కష్టాలు, ఇబ్బందులు చూశాడు. ఆ సమయంలో తన సొంత జాతి వాడైన హెబ్రీయుల్లో ఒకణ్ణి ఒక ఐగుప్తీయుడు కొట్టడం చూశాడు.
నిర్గమకాండము 2 : 12 (IRVTE)
అటూ ఇటూ చూసి అక్కడ ఎవ్వరూ లేకపోవడంతో ఆ ఐగుప్తీయుణ్ణి కొట్టి చంపి ఇసుకలో పాతిపెట్టాడు.
నిర్గమకాండము 2 : 13 (IRVTE)
తరువాతి రోజు మోషే అటుగా వెళ్తుంటే అక్కడ ఇద్దరు హెబ్రీయులు గొడవ పడుతున్నారు.
నిర్గమకాండము 2 : 14 (IRVTE)
అప్పుడు మోషే తప్పు చేసిన వ్యక్తితో “నువ్వెందుకు నీ సోదరుణ్ణి కొడుతున్నావు?” అని అడిగాడు. అందుకు అతడు “మా మీద నిన్ను అధికారిగా, తీర్పు తీర్చేవాడిగా ఎవరు నియమించారు? నువ్వు ఆ ఐగుప్తీయుణ్ణి చంపినట్టు నన్ను కూడా చంపుదామనుకుంటున్నావా?” అన్నాడు. ఈ విషయం అందరికీ తెలిసిపోయిందని మోషే భయపడ్డాడు.
నిర్గమకాండము 2 : 15 (IRVTE)
ఆ సంగతి విన్న ఫరో మోషేను చంపించాలని చూశాడు. మోషే ఫరో దగ్గరనుండి నుండి మిద్యాను దేశానికి పారిపోయాడు. అక్కడ ఒక బావి దగ్గర కూర్చున్నాడు.
నిర్గమకాండము 2 : 16 (IRVTE)
మిద్యాను దేశంలో ఉన్న యాజకునికి ఏడుగురు కూతుళ్ళు. వాళ్ళు తమ తండ్రి మందలకు నీళ్లు తోడి నీళ్ళ తొట్టెలు నింపుతున్నారు.
నిర్గమకాండము 2 : 17 (IRVTE)
అప్పుడు వేరే మంద కాపరులు వచ్చి వాళ్ళను అక్కడి నుండి తోలివేశారు. మోషే లేచి ఆ అమ్మాయిలకు సహాయం చేసి, వాళ్ళ మందకు నీళ్లు తోడిపెట్టాడు.
నిర్గమకాండము 2 : 18 (IRVTE)
వాళ్ళు తిరిగి తమ ఇంటికి తిరిగి వచ్చాక వారి తండ్రి రగూయేలు “మీరు ఇంత త్వరగా ఎలా వచ్చారు?” అని అడిగాడు.
నిర్గమకాండము 2 : 19 (IRVTE)
అందుకు వాళ్ళు “ఒక ఐగుప్తీయుడు మంద కాపరుల చేతిలో నుండి మమ్మల్ని కాపాడి, నీళ్లు తోడి మన మందకు పోశాడు” అన్నారు.
నిర్గమకాండము 2 : 20 (IRVTE)
అతడు తన కూతుళ్ళతో “అతడు ఏడీ? ఎందుకు విడిచిపెట్టి వచ్చారు? అతణ్ణి భోజనానికి పిలుచుకు రండి” అని చెప్పాడు.
నిర్గమకాండము 2 : 21 (IRVTE)
మోషే ఆ కుటుంబంతో కలిసి నివసించడానికి అంగీకరించాడు. రగూయేలు తన కూతురు సిప్పోరాను మోషేకిచ్చి పెళ్లి చేశాడు.
నిర్గమకాండము 2 : 22 (IRVTE)
వాళ్లకు ఒక కొడుకు పుట్టాడు. అప్పుడు మోషే “నేను పరాయి దేశంలో పరాయి వ్యక్తిగా ఉన్నాను” అనుకుని తన కొడుక్కి “గెర్షోము” అని పేరు పెట్టాడు.
నిర్గమకాండము 2 : 23 (IRVTE)
ఈ విధంగా చాలా రోజులు గడచిపోయిన తరువాత ఐగుప్తు రాజు చనిపోయాడు. ఇశ్రాయేలు ప్రజలు ఇంకా బానిసత్వంలోనే ఉండి, నిట్టూర్పులు విడుస్తూ మొర పెడుతూ ఉన్నారు. తమ వెట్టిచాకిరీ మూలంగా వారు పెట్టిన మొరలు దేవుని సన్నిధికి చేరాయి.
నిర్గమకాండము 2 : 24 (IRVTE)
దేవుడు వారి నిట్టూర్పులు, మూలుగులు విన్నాడు. అబ్రాహాము, ఇస్సాకు, యాకోబులతో తాను చేసిన నిబంధన జ్ఞాపకం చేసుకున్నాడు.
నిర్గమకాండము 2 : 25 (IRVTE)
దేవుడు ఇశ్రాయేలు ప్రజలను చూశాడు, వారిని పట్టించుకున్నాడు.
❮
❯