యెహెజ్కేలు 26 : 1 (IRVTE)
తూరూ గూర్చి ప్రవచనం బబులోను చెరలో ఉన్న కాలంలో, పదకొండో సంవత్సరం నెలలో మొదటి రోజు యెహోవా నాకీ విషయం మళ్ళీ తెలియచేశాడు.
యెహెజ్కేలు 26 : 2 (IRVTE)
“నరపుత్రుడా, తూరు యెరూషలేము గురించి ‘ఆహా’ అంటూ ‘ప్రజల ప్రాకారాలు పడిపోయాయి, ఆమె నావైపు తిరిగింది. ఆమె పాడైపోయినందువలన మేము వర్దిల్లుతాం’ అని చెప్పాడు.”
యెహెజ్కేలు 26 : 3 (IRVTE)
కాబట్టి యెహోవా ప్రభువు తెలియజేసేది ఏమిటంటే “తూరూ, నేను నీకు విరోధిని. సముద్రం దాని అలలను పైకి తెచ్చే విధంగా నేను అనేక ప్రజలను నీ మీదికి రప్పిస్తాను.
యెహెజ్కేలు 26 : 4 (IRVTE)
వారు వచ్చి తూరు ప్రాకారాలను కూల్చి దాని కోటలను పడగొడతారు. నేను దాని శిథిలాలను తుడిచివేస్తాను. వట్టి బండ మాత్రమే మిగులుతుంది.
యెహెజ్కేలు 26 : 5 (IRVTE)
ఆమె సముద్రం ఒడ్డున వలలు ఆరబెట్టుకునే చోటవుతుంది. ఈ విషయం చెప్పింది నేనే.” ఇదే యెహోవా ప్రభువు సందేశం. “ఆమె ఇతర రాజ్యాలకు దోపిడీ అవుతుంది.
యెహెజ్కేలు 26 : 6 (IRVTE)
బయటి పొలాల్లో ఉన్న దాని కూతుళ్ళు కత్తి పాలవుతారు. అప్పుడు నేనే యెహోవానని వాళ్ళు తెలుసుకుంటారు.”
యెహెజ్కేలు 26 : 7 (IRVTE)
యెహోవా ప్రభువు తెలియజేసేది ఏమిటంటే “అత్యంత శక్తివంతుడైన బబులోనురాజు నెబుకద్నెజరును నేను తూరు పట్టణం మీదికి రప్పిస్తున్నాను. అతడు గుర్రాలతో రథాలతో రౌతులతో మహా సైన్యంతో వస్తున్నాడు.
యెహెజ్కేలు 26 : 8 (IRVTE)
అతడు బయటి పొలాల్లోని నీ కూతుళ్ళను కత్తి పాలు చేస్తాడు. నీ కెదురుగా బురుజులు కట్టించి మట్టి దిబ్బలు వేయించి నీ కెదురుగా డాళ్ళను ఎత్తుతాడు.
యెహెజ్కేలు 26 : 9 (IRVTE)
అతడు నీ ప్రాకారాలను పడగొట్టడానికి యంత్రాలు వాడతాడు. అతని ఆయుధాలు నీ కోటలను కూలుస్తాయి.
యెహెజ్కేలు 26 : 10 (IRVTE)
అతనికి ఉన్న అనేక గుర్రాలు రేపిన దుమ్ము నిన్ను కప్పేస్తుంది! కూలిపోయిన పట్టణ గోడల గుండా ద్వారాల గుండా అతడు వచ్చినప్పుడు గుర్రాలు, రథ చక్రాల శబ్దాలకు నీ ప్రాకారాలు కంపిస్తాయి.
యెహెజ్కేలు 26 : 11 (IRVTE)
అతడు తన గుర్రాల డెక్కలతో నీ వీధులన్నీ అణగదొక్కేస్తాడు. నీ ప్రజలను కత్తితో నరికేస్తాడు. నీ బలమైన స్తంభాలు నేల కూలుతాయి.
యెహెజ్కేలు 26 : 12 (IRVTE)
ఈ విధంగా వాళ్ళు నీ ఐశ్వర్యాన్ని దోచుకుంటారు. నీ వ్యాపార సరుకులను కొల్లగొట్టుకుపోతారు. నీ గోడలు కూలుస్తారు. నీ విలాస భవనాలను పాడు చేస్తారు. నీ రాళ్లనూ నీ కలపనూ మట్టినీ నీళ్లలో ముంచివేస్తారు.
యెహెజ్కేలు 26 : 13 (IRVTE)
నేను నీ సంగీతాలను మాన్పిస్తాను. నీ సితారా నాదం ఇక వినబడదు.
యెహెజ్కేలు 26 : 14 (IRVTE)
నిన్ను వట్టి బండగా చేస్తాను. నీవు వలలు ఆరబెట్టే చోటు అవుతావు. నిన్ను మళ్ళీ కట్టడం ఎన్నటికీ జరగదు. ఈ విషయం చెప్పింది నేనే.” ఇదే యెహోవా ప్రభువు సందేశం!
యెహెజ్కేలు 26 : 15 (IRVTE)
తూరు గురించి యెహోవా ప్రభువు తెలియజేసేది ఏమిటంటే “నువ్వు పతనమయ్యేటప్పుడు, నీ మధ్య జరిగే భయంకరమైన హత్యల్లో గాయపడ్డ వాళ్ళ కేకల శబ్దానికి ద్వీపాలు వణికిపోవా?
యెహెజ్కేలు 26 : 16 (IRVTE)
సముద్రపు అధిపతులంతా తమ సింహాసనాల మీద నుంచి దిగి, తమ రాజ వస్త్రాలనూ రంగురంగుల బట్టలనూ తీసి వేస్తారు. వాళ్ళు భయాన్ని కప్పుకుంటారు. వాళ్ళు నేల మీద కూర్చుని గడగడ వణకుతూ నీ గురించి భయాందోళన చెందుతారు.
యెహెజ్కేలు 26 : 17 (IRVTE)
వారు నీ గురించి శోకగీతం ఎత్తి ఇలా అంటారు. నావికులు నివసిస్తున్న నువ్వు ఎలా నాశనమయ్యావు! పేరుగాంచిన ఎంతో గొప్ప పట్టణం-ఇప్పుడు సముద్రం పాలయింది. నువ్వూ, నీ పురవాసులూ సముద్రంలో బలవంతులు. నువ్వంటే సముద్ర నివాసులందరికీ భయం.
యెహెజ్కేలు 26 : 18 (IRVTE)
ఇప్పుడు నువ్వు కూలిన ఈ దినాన తీరప్రాంతాలు వణుకుతున్నాయి. నువ్వు మునిగిపోవడం బట్టి తీర ప్రాంతాలు భయంతో కంపించిపోయాయి.
యెహెజ్కేలు 26 : 19 (IRVTE)
యెహోవా ప్రభువు తెలియజేసేది ఏమిటంటే, నేను నిన్ను పాడుచేసి నిర్జనమైన పట్టణంగా చేసేటప్పుడు మహా సముద్రం నిన్ను ముంచివేసేలా నీ మీదికి అగాధ జలాన్ని రప్పిస్తాను.
యెహెజ్కేలు 26 : 20 (IRVTE)
పురాతన దినాల్లో మృత్యులోకంలోకి దిగిపోయినవారి దగ్గర నువ్వుండేలా చేస్తాను. పూర్వకాలంలో పాడైన స్థలాల్లో భూమి కిందున్న భాగాల్లో, అగాధంలోకి దిగిపోయిన వారితో పాటు నువ్వుండేలా చేస్తాను. దీనంతటి బట్టి సజీవులు నివసించే చోటికి నువ్వు తిరిగి రావు.
యెహెజ్కేలు 26 : 21 (IRVTE)
నీ మీదికి విపత్తు తెస్తాను. నువ్వు లేకుండా పోతావు. ఎంత వెతికినా నీవెన్నటికీ కనిపించవు.” ఇదే యెహోవా ప్రభువు సందేశం.

1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21