ఎజ్రా 5 : 1 (IRVTE)
దర్యావేషుకు తత్తెనై లేఖ హగ్గయి ప్రవక్త, ఇద్దో కొడుకూ ప్రవక్తా అయిన జెకర్యా, యూదా దేశంలో, యెరూషలేములో ఉంటున్న యూదులకు ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా పేరట ప్రకటించారు.
ఎజ్రా 5 : 2 (IRVTE)
షయల్తీయేలు కొడుకు జెరుబ్బాబెలు, యోజాదాకు కొడుకు యేషూవ ఇద్దరూ బయలుదేరి యెరూషలేములోని దేవుని మందిరాన్ని కట్టడం ప్రారంభించారు. దేవుని ప్రవక్తలు వారితో ఉండి వారికి సహాయం చేస్తూ వచ్చారు.
ఎజ్రా 5 : 3 (IRVTE)
అప్పుడు నది ఇవతల అధికారులుగా ఉన్న తత్తెనై, షెతర్బోజ్నయి, వారితోబాటు మరికొందరు, యూదుల దగ్గరికి వచ్చారు. వారు “ఈ మందిరం కట్టడానికి, గోడలు నిలబెట్టడానికి, మీకు ఎవరు అనుమతి ఇచ్చారు?” అని ప్రశ్నించారు.
ఎజ్రా 5 : 4 (IRVTE)
దాన్ని నిర్మిస్తున్న వారి పేర్లు, ఇతర విషయాలు కూడా వాళ్ళు అడిగారు.
ఎజ్రా 5 : 5 (IRVTE)
అయితే యూదుల దేవుడు వారిపై తన కాపుదల ఉంచడం వలన ఈ విషయంలో చక్రవర్తి దర్యావేషు నుండి అనుమతి వచ్చేవరకూ అధికారులు కట్టడం పని జరగకుండా అడ్డుకోలేదు.
ఎజ్రా 5 : 6 (IRVTE)
నది ఇవతల అధికారులైన తత్తెనై, షెతర్బోజ్నయి, వారితో ఉన్న ఇతర అధికారులు చక్రవర్తి దర్యావేషుకు పంపిన ఉత్తరం నకలు ప్రతి ఇది.
ఎజ్రా 5 : 7 (IRVTE)
“రాజైన దర్యావేషుకు సమస్త క్షేమ సుఖాలు కలుగు గాక.
ఎజ్రా 5 : 8 (IRVTE)
రాజువైన మీకు తెలియాల్సిన విషయాలు ఏమిటంటే, మేము మహా దేవుని మందిరం ఉన్న యూదుల ప్రాంతానికి వెళ్ళాం. దాన్ని పెద్ద పెద్ద రాళ్లతో కడుతూ ఉన్నారు. గోడల మధ్యలో స్థంభాలు వేస్తున్నారు. ఈ పని త్వరత్వరగా కొనసాగుతూ పూర్తి కావస్తున్నది.
ఎజ్రా 5 : 9 (IRVTE)
‘ఈ మందిరం కట్టడానికి, గోడలు నిలబెట్టడానికి మీకు ఎవరు అనుమతి ఇచ్చారు?’ అని అక్కడున్న పెద్దలను మేము అడిగాం.
ఎజ్రా 5 : 10 (IRVTE)
మీకు తెలియజేయడం కోసం అజమాయిషీ చేస్తున్న అధికారుల పేర్లు వ్రాసి ఇమ్మని కూడా అడిగాం.
ఎజ్రా 5 : 11 (IRVTE)
దానికి వారు ఇలా జవాబిచ్చారు, భూమి, ఆకాశాలకు దేవుడైన వాడికి సేవకులం. చాలా సంవత్సరాల క్రితం ఇశ్రాయేలీయుల్లో ఒక గొప్ప రాజు కట్టించి పూర్తి చేసిన మందిరాన్ని మేము తిరిగి కడుతున్నాం.
ఎజ్రా 5 : 12 (IRVTE)
మా పూర్వీకులు ఆకాశంలో నివాసముండే దేవునికి కోపం పుట్టించినందువల్ల ఆయన వారిని కల్దీయుడైన బబులోను రాజు నెబుకద్నెజరు చేతికి అప్పగించాడు. అతడు ఈ మందిరాన్ని నాశనం చేసి ప్రజలను బబులోను దేశానికి బందీలుగా తీసుకువెళ్ళాడు.
ఎజ్రా 5 : 13 (IRVTE)
అయితే బబులోను రాజు కోరెషు తన పాలన మొదటి సంవత్సరంలో దేవుని మందిరం తిరిగి కట్టుకోవడానికి అనుమతి ఇచ్చాడు.
ఎజ్రా 5 : 14 (IRVTE)
అంతే కాక నెబుకద్నెజరు యెరూషలేములోని దేవాలయం నుండి తీసుకువెళ్ళి బబులోను గుడిలో ఉంచిన వెండి బంగారు సామగ్రిని రాజైన కోరెషు ఆ గుడిలో నుండి తెప్పించాడు.
ఎజ్రా 5 : 15 (IRVTE)
షేష్బజ్జరును గవర్నరుగా నియమించి దేవుని మందిరాన్ని అది ఉన్న స్థలం లో కట్టించి, ఆ సామగ్రిని తీసుకువెళ్ళి యెరూషలేము పట్టణంలోని దేవాలయంలో ఉంచే బాధ్యతలు అతనికి అప్పగించాడు.
ఎజ్రా 5 : 16 (IRVTE)
కాబట్టి షేష్బజ్జరు వచ్చి యెరూషలేములోని దేవుని మందిరం పునాది వేయించాడు. అప్పటినుండి నేటివరకూ దాన్ని కడుతూ ఉన్నాము. పని ఇంకా పూర్తి కాలేదు.
ఎజ్రా 5 : 17 (IRVTE)
కాబట్టి చక్రవర్తికి ఇష్టమైతే బబులోను పట్టణంలో ఉన్న రాజుకు చెందిన ఖజానాలో వెతికించి, యెరూషలేములో ఉన్న దేవుని మందిరాన్ని కట్టించాలని కోరెషు రాజు నిర్ణయించాడో లేదో తెలుసుకోవచ్చు. అప్పుడు చక్రవర్తి ఈ విషయంలో తన నిర్ణయం తెలియజేయాలని కోరుకొంటున్నాం.”
❮
❯
1
2
3
4
5
6
7
8
9
10
11
12
13
14
15
16
17