ఆదికాండము 18 : 1 (IRVTE)
మమ్రే అనే ప్రాంతంలో సింధూర చెట్ల దగ్గర ఒక మధ్యాహ్నం వేళ అబ్రాహాము తన గుడారం వాకిట్లో కూర్చుని ఉన్నాడు. అప్పుడు యెహోవా అతనికి ప్రత్యక్షమయ్యాడు.
ఆదికాండము 18 : 2 (IRVTE)
అతడు తలెత్తి చూసినప్పుడు ముగ్గురు మనుషులు అతని ముందు నిలబడి ఉన్నారు. అతడు వారిని చూసి తన గుడారం వదిలి వారిని కలుసుకోవడానికి పరుగెత్తుకుంటూ వెళ్ళాడు. వారి ఎదుట నేల వరకూ వంగి ఇలా అన్నాడు.
ఆదికాండము 18 : 3 (IRVTE)
“ప్రభూ, నీ దాసుడనైన నాపై దయ చూపి నన్ను దాటి వెళ్ళకండి. నాతో రండి.
ఆదికాండము 18 : 4 (IRVTE)
నేను నీళ్ళు తెప్పిస్తాను. వాటితో మీ కాళ్ళు కడుక్కోండి. చెట్టు కింద విశ్రాంతి తీసుకోండి.
ఆదికాండము 18 : 5 (IRVTE)
మీ దాసుడినైన నా దగ్గరికి వచ్చారు కదా, కొంచెం ఆహారం తీసుకు వస్తాను. దాన్ని తిని సేద దీర్చుకోండి. ఆ తరువాత మీ దారిన మీరు వెళ్ళవచ్చు.” అందుకు వారు “నువ్వు చెప్పినట్టే చెయ్యి” అన్నారు.
ఆదికాండము 18 : 6 (IRVTE)
అప్పుడు అబ్రాహాము వెంటనే గుడారంలో ఉన్న శారా దగ్గరికి వెళ్ళి “నువ్వు త్వరగా [* పాత అనువాదంలో మూడు మానికలు అని ఉంది.] 21 కిలోల మెత్తటి పిండి తెచ్చి కలిపి రొట్టెలు చెయ్యి” అన్నాడు.
ఆదికాండము 18 : 7 (IRVTE)
తరువాత అబ్రాహాము పశువుల మంద దగ్గరికి పరుగెత్తి ఒక మంచి లేగ దూడను పట్టుకు వచ్చి ఒక పనివాడికి ఇచ్చాడు. వాడు త్వరత్వరగా దాన్నివధించి వండి సిద్ధం చేశాడు.
ఆదికాండము 18 : 8 (IRVTE)
తరువాత అతడు పెరుగూ, పాలూ వాటితోపాటు తాను వండించి సిద్ధం చేయించిన దూడ మాంసాన్ని తెచ్చి వాళ్ళ ముందు పెట్టాడు. వాళ్ళు భోజనం చేస్తుంటే అక్కడే ఆ చెట్టు కిందే నిలబడ్డాడు.
ఆదికాండము 18 : 9 (IRVTE)
వారు అతణ్ణి “నీ భార్య ఎక్కడ?” అని అడిగారు. అతడు “అదిగో, గుడారంలో ఉంది” అన్నాడు.
ఆదికాండము 18 : 10 (IRVTE)
అప్పుడు [† యెహోవా] ఆయన “తిరిగి వసంతకాలంలో నేను మళ్ళీ నీ దగ్గరికి తప్పకుండా వస్తాను. విను, అప్పటికి నీ భార్య శారాకు ఒక కొడుకు ఉంటాడు” అన్నాడు. శారా ఆయన వెనుక ఉన్న గుడారం ద్వారం దగ్గర ఉండి ఈ మాటలు వింటూ ఉంది.
ఆదికాండము 18 : 11 (IRVTE)
అప్పటికి అబ్రాహాము శారాలు వయసు ఉడిగిపోయి ముసలివాళ్ళయ్యారు. శారాకు పిల్లలను కనే వయసు దాటిపోయింది.
ఆదికాండము 18 : 12 (IRVTE)
శారా “నా బలమంతా పోయింది. ఈ సుఖం నాకెలా కలుగుతుంది? నా యజమాని అయిన నా భర్త కూడా ముసలివాడయ్యాడు కదా” అనుకుని తనలో తాను నవ్వుకుంది.
ఆదికాండము 18 : 13 (IRVTE)
అప్పుడు యెహోవా అబ్రాహాముతో “శారా ‘ముసలిదాన్ని అయిన నేను నిజంగా బిడ్డను కనగలనా’ అనుకుని ఎందుకు నవ్వింది?
ఆదికాండము 18 : 14 (IRVTE)
యెహోవాకు సాధ్యం కానిది ఏమైనా ఉందా? నేను నిర్ణయించిన కాలంలో మళ్ళీ నీ దగ్గరికి వస్తాను. వచ్చే సంవత్సరం ఇదే సమయానికి శారాకు ఒక కొడుకు ఉంటాడు” అన్నాడు.
ఆదికాండము 18 : 15 (IRVTE)
అప్పుడు శారా భయపడి “నేను నవ్వలేదండీ” అంది. దానికి ఆయన “అలా అనకు, నువ్వు నవ్వావు” అని జవాబిచ్చాడు.
ఆదికాండము 18 : 16 (IRVTE)
అప్పుడు ఆ మనుషులు అక్కడనుండి వెళ్ళడానికి లేచారు. లేచి సొదొమ పట్టణం వైపు చూసారు. వారిని సాగనంపడానికి అబ్రాహాము వారితో కలిసి వెళ్ళాడు.
ఆదికాండము 18 : 17 (IRVTE)
కానీ యెహోవా ఇలా అనుకున్నాడు. “అబ్రాహాము కచ్చితంగా ఒక బలమైన గొప్ప జాతి అవుతాడు.
ఆదికాండము 18 : 18 (IRVTE)
అతని మూలంగా భూమిపై అన్ని జాతులూ ఆశీర్వాదం పొందుతాయి. నేను చేయబోతున్న పనులను అబ్రాహాముకు తెలియకుండా ఎలా దాచగలను?
ఆదికాండము 18 : 19 (IRVTE)
అతని తరువాత అతని వారసులు నీతి న్యాయాలను జరిగించేలా వారికి యెహోవా మార్గాన్ని బోధించడానికీ తద్వారా అబ్రాహాముకు ఆయన చెప్పిన విషయాలన్నీ జరిగించడానికీ నేను అబ్రాహామును ఎన్నుకున్నాను.”
ఆదికాండము 18 : 20 (IRVTE)
అప్పుడు యెహోవా ఇలా అన్నాడు. “సొదొమ గొమొర్రాలను గూర్చిన విన్నపాలు కుప్పలు తెప్పలుగా ఉన్నాయి. అలాగే వాటి పాపం కూడా చాలా ఘోరం. కనుక
ఆదికాండము 18 : 21 (IRVTE)
నేను దిగి వెళ్ళి నాకు చేరిన ఆ విన్నపం ప్రకారం వాళ్ళు అంత దుర్మార్గులా కాదా అన్నది చూస్తాను. లేకపోతే నాకు తెలుస్తుంది.”
ఆదికాండము 18 : 22 (IRVTE)
{అబ్రాహాము సొదొమకోసం విన్నపం చెయ్యడం} [PS] ఆ మనుషులు అక్కడనుండి వెళ్ళడానికి తిరిగి సొదొమ వైపుగా వెళ్ళారు. కానీ అబ్రాహాము ఇంకా యెహోవా సముఖంలోనే నిలబడి ఉన్నాడు.
ఆదికాండము 18 : 23 (IRVTE)
అప్పడు అబ్రాహాము వారిని సమీపించి ఇలా అడిగాడు. “దుర్మార్గులతో పాటు నీతిమంతులను కూడా నాశనం చేస్తావా?
ఆదికాండము 18 : 24 (IRVTE)
ఆ పట్టణంలో ఒకవేళ యాభైమంది నీతిమంతులు ఉంటే ఆ యాభైమంది నీతిమంతుల కోసం పట్టణాన్ని నాశనం చేయకుండా రక్షించలేవా?
ఆదికాండము 18 : 25 (IRVTE)
నీతిమంతులకూ దుర్మార్గులకూ ఒకే రకంగా తీర్పు తీర్చడం నీకు దూరమౌతుంది గాక. అలాగే దుర్మార్గులతో పాటుగా నీతిమంతులను నాశనం చేయడం నీకు దూరమౌతుంది గాక! సర్వలోకానికీ తీర్పు తీర్చేవాడు న్యాయం చెయ్యడా?”
ఆదికాండము 18 : 26 (IRVTE)
దానికి యెహోవా “సొదొమ పట్టణంలో యాభైమంది నీతిమంతులు నాకు కనిపిస్తే వాళ్ళ కోసం ఆ ప్రదేశాన్నంతా కాపాడతాను” అన్నాడు.
ఆదికాండము 18 : 27 (IRVTE)
అందుకు అబ్రాహాము “అయ్యా చూడు, నేను దుమ్ముతో, బూడిదతో సమానం. అయినా నేను ప్రభువుతో మాట్లాడే సాహసం చేస్తున్నాను.
ఆదికాండము 18 : 28 (IRVTE)
యాభై మంది నీతిమంతుల్లో ఒకవేళ ఐదుగురు తక్కువయ్యారనుకోండి. ఐదుగురు తక్కువయ్యారని ఆ పట్టణమంతటినీ నాశనం చేస్తావా?” అని మళ్ళీ అడిగాడు. అందుకాయన “అక్కడ నలభై ఐదుగురు కనిపిస్తే నాశనం చేయను” అన్నాడు.
ఆదికాండము 18 : 29 (IRVTE)
అతడు మళ్ళీ ఆయనతో మాట్లాడుతూ “ఒకవేళ అక్కడ నలభై మందే కనిపిస్తారేమో” అన్నాడు. దానికి ఆయన “ఆ నలభై మంది కోసం నాశనం చేయను” అని చెప్పాడు.
ఆదికాండము 18 : 30 (IRVTE)
అతడు మళ్ళీ “ప్రభూ, నాపై కోప్పడనంటే నేను మాట్లాడతాను. ఒకవేళ ముప్ఫై మందే అక్కడ కనిపిస్తారేమో” అన్నాడు. అప్పుడాయన “ముప్ఫై మంది కనిపించినా నేను పట్టణాన్ని నాశనం చేయను” అన్నాడు.
ఆదికాండము 18 : 31 (IRVTE)
అందుకు అతడు “నా ప్రభువుతో మాట్లాడే సాహసం చేస్తున్నాను. ఒకవేళ ఇరవైమందే ఉంటారేమో” అన్నాడు. అప్పుడు ప్రభువు “ఆ ఇరవైమంది కోసం నాశనం చేయను” అన్నాడు.
ఆదికాండము 18 : 32 (IRVTE)
చివరిగా అతడు “ప్రభూ, నాపై కోపగించకు. నేనింకా ఒక్కసారే మాట్లాడతాను. ఒకవేళ పదిమందే అక్కడ ఉన్నారేమో” అన్నాడు. అప్పుడు ప్రభువు “పదిమంది కోసం నేను ఆ పట్టణాన్ని నాశనం చేయను” అన్నాడు.
ఆదికాండము 18 : 33 (IRVTE)
అబ్రాహాముతో మాటలు ముగిసిన వెంటనే యెహోవా వెళ్ళిపోయాడు. అబ్రాహాము తన ఇంటికి తిరిగి వెళ్ళాడు. [PE]

1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33

BG:

Opacity:

Color:


Size:


Font: