యెషయా గ్రంథము 18 : 1 (IRVTE)
ఇతియోపియా గురించి ప్రకటన అయ్యో! ఇతియోపియా నదుల అవతల టపటపా కొట్టుకునే రెక్కలున్న దేశానికి దుఃఖం!
యెషయా గ్రంథము 18 : 2 (IRVTE)
అది సముద్రంపై నీళ్ళ మీద జమ్ము పడవల్లో రాయబారులను పంపిస్తూ ఉంది. వేగిరపడే వార్తాహరులారా! వెళ్ళండి. నున్నని చర్మం కలిగి పొడుగ్గా ఉండే ప్రజల దగ్గరికి వెళ్ళండి! చుట్టూ ఉన్న వాళ్ళనీ, దూరంగా ఉండే వాళ్ళనీ భయకంపితులను చేస్తూ, అణచివేసే ఆ బలమైన జనాల దగ్గరకూ, నదులు విభజించే వాళ్ళ దేశానికీ వెళ్ళండి!
యెషయా గ్రంథము 18 : 3 (IRVTE)
ప్రపంచంలో నివసించే మీరు, భూమిపైన జీవించే మీరు పర్వతాల పైన సంకేతంగా జెండా ఎత్తినప్పుడు చూడండి! బాకా ఊదినప్పుడు వినండి!
యెషయా గ్రంథము 18 : 4 (IRVTE)
యెహోవా నాకు చెప్పిన మాట ఇదే. “వేసవిలో ఉడుకెత్తే వేడిలా, కోతకాలంలో ఏర్పడే పొగమంచు మబ్బులా నేను నిశ్శబ్దంగా నా నివాస స్థలం నుండి గమనిస్తూ ఉంటాను.”
యెషయా గ్రంథము 18 : 5 (IRVTE)
కోతకాలం రాకముందు పువ్వు వికసించే దశ ముగిసిన తర్వాత, పువ్వు ద్రాక్షగా మారుతున్న దశలో ఆయన పోటకత్తులతో ద్రాక్షకాయలను కత్తిరిస్తాడు. వ్యాపిస్తున్న ద్రాక్ష కొమ్మలను నరికి అవతల పారవేస్తాడు.
యెషయా గ్రంథము 18 : 6 (IRVTE)
వాటిని పర్వతాల్లోని పక్షులకూ, భూమి మీద ఉన్న మృగాలకూ వదిలివేస్తాడు. వేసవికాలంలో పక్షులూ, చలికాలంలో భూమి మీద మృగాలూ వాటిని తింటాయి.
యెషయా గ్రంథము 18 : 7 (IRVTE)
ఆ రోజుల్లో నున్నని చర్మం కలిగి పొడుగ్గా ఉండే ప్రజలు, చుట్టూ ఉన్న వాళ్ళనీ, దూరంగా ఉండే వాళ్ళనీ భయకంపితులను చేస్తూ, అణచివేస్తూ ఆ బలమైన జనాలు, నదులతో నిండి ఉన్న వాళ్ళ దేశం నుండి సేనల ప్రభువు అయిన యెహోవాకు కానుకలు తీసుకుని వస్తారు. సేనల ప్రభువు అయిన యెహోవా నామాన్ని ధరించిన సీయోను పర్వతానికి తీసుకు వస్తారు.

1 2 3 4 5 6 7