యెషయా గ్రంథము 54 : 1 (IRVTE)
సేవకుని ద్వారా దీవెనలు “గొడ్రాలా, పిల్లలు కననిదానా, పాటలు పాడు. ఎన్నడూ ప్రసవవేదన పడనిదానా, సంతోషంతో గట్టిగా గానం చెయ్యి. పెళ్ళయిన స్త్రీ పిల్లలకంటే భర్త వదిలేసిన స్త్రీకి పుట్టే పిల్లలు ఎక్కువమంది” అని యెహోవా చెబుతున్నాడు.
యెషయా గ్రంథము 54 : 2 (IRVTE)
నీ డేరా పెద్దదిగా చెయ్యి. నీ డేరా తెరలను ఇంకా పొడిగించు. నీ తాళ్ళు పొడుగు చెయ్యి. నీ మేకులు దిగ్గొట్టు.
యెషయా గ్రంథము 54 : 3 (IRVTE)
ఎందుకంటే నువ్వు కుడివైపుకూ ఎడమవైపుకూ వ్యాపిస్తావు. నీ సంతానం రాజ్యాలను స్వాధీనం చేసుకుంటుంది. పాడైన పట్టణాలను నివాస స్థలాలుగా చేస్తారు.
యెషయా గ్రంథము 54 : 4 (IRVTE)
భయపడవద్దు. నువ్వు సిగ్గు పడనక్కరలేదు. నీకు అవమానం కలగదు. అధైర్య పడవద్దు. చిన్నతనంలోని నీ అవమానాన్నీ సిగ్గునూ మరచిపోతావు. నీ వైధవ్యపు నిందను ఇకమీదట జ్ఞాపకం చేసుకోవు.
యెషయా గ్రంథము 54 : 5 (IRVTE)
నిన్ను సృష్టించినవాడు నీకు భర్త. ఆయన పేరు సేనల ప్రభువు యెహోవా. ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుడు నీకు విమోచకుడు. లోమంతటికీ దేవుడు అని ఆయన్ని పిలుస్తారు.
యెషయా గ్రంథము 54 : 6 (IRVTE)
భర్త వదిలి వేయగా ఎంతో విచారంతో ఉన్న భార్యను భర్త తిరిగి రప్పించినట్టు, పడుచుతనంలో పెళ్ళిచేసుకుని తృణీకారానికి గురి అయిన భార్యను తిరిగి రప్పించినట్టుగా యెహోవా నిన్ను తిరిగి రప్పించాడని, నీ దేవుడు చెబుతున్నాడు.
యెషయా గ్రంథము 54 : 7 (IRVTE)
కొంతసేపే నేను నిన్ను వదిలేశాను. అయితే ఎంతో జాలితో నేను నిన్ను చేరదీస్తాను.
యెషయా గ్రంథము 54 : 8 (IRVTE)
కాసేపే నీమీద కోపంతో నా ముఖం దాచాను. నీ మీద జాలి చూపిస్తాను. నిన్నెప్పటికీ నమ్మకంగా ప్రేమిస్తానని నిన్ను విమోచించే యెహోవా చెబుతున్నాడు.
యెషయా గ్రంథము 54 : 9 (IRVTE)
“ఇది నాకు నోవహు రోజుల్లోని జలప్రళయంలాగా ఉంది. భూమి మీదికి ఇంకెప్పుడూ జలప్రళయం రాదని నేను ప్రమాణం చేశాను. అలాగే, నీ మీద కోపంగా ఉండననీ నిన్ను గద్దించననీ ప్రమాణం చేశాను.
యెషయా గ్రంథము 54 : 10 (IRVTE)
పర్వతాలు కూలిపోయినా కొండలు కదిలినా నా కృప నీనుంచి తొలగిపోదు. నా శాంతి ఒడంబడిక, నిన్ను విడిచిపోదు” అని నీ మీద జాలిపడే యెహోవా చెబుతున్నాడు.
యెషయా గ్రంథము 54 : 11 (IRVTE)
బాధపడుతున్న దానా! తుఫాను బాధితురాలా, ఆదరణలేనిదానా! నేను నీ కాలిబాట వైడూర్యాలతో చేస్తాను. నీలమణులతో నీ పునాదులు వేస్తాను.
యెషయా గ్రంథము 54 : 12 (IRVTE)
కెంపులతో నీ కోట బురుజులను, మెరిసే రాళ్ళతో నీ గుమ్మాలను, విలువైన రత్నాలతో నీ గోడలను నిర్మిస్తాను.
యెషయా గ్రంథము 54 : 13 (IRVTE)
యెహోవా నీ పిల్లలందరికీ బోధిస్తాడు. నీ పిల్లలకు పరిపూర్ణమైన నెమ్మది ఉంటుంది.
యెషయా గ్రంథము 54 : 14 (IRVTE)
నీతితో నిన్ను తిరిగి స్థాపిస్తాను. నువ్వు ఇంకెన్నటికీ హింస అనుభవించవు. నువ్వు భయపడనక్కరలేదు. నిన్ను భయపెట్టేది నీ దగ్గరికి రాదు.
యెషయా గ్రంథము 54 : 15 (IRVTE)
ఎవరైనా చిక్కు తెస్తే, అది నా వలన కాదు. చిక్కు తెచ్చే వారెవరైనా ఓడిపోతారు.
యెషయా గ్రంథము 54 : 16 (IRVTE)
ఇదిగో విను! నిప్పులు ఊదే కమ్మరిని నేనే చేశాను. అతడు అక్కడ ఆయుధాలను చేస్తాడు. నాశనం చేయడానికి నాశనం చేసేవాణ్ణి చేసింది నేనే.
యెషయా గ్రంథము 54 : 17 (IRVTE)
నీకు విరోధంగా తయారైన ఎలాంటి ఆయుధమూ గెలవదు. నీ మీద నేరారోపణ చేసే వారందరినీ నువ్వు శిక్షిస్తావు. యెహోవా సేవకులకు ఈ హక్కు ఉంటుంది. వారిని నిర్దోషులని నిరూపించడం నా వల్ల అవుతుంది. యెహోవా ప్రకటించేది ఇదే.

1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17