యాకోబు 4 : 1 (IRVTE)
లోకరీతి ప్రవర్తనకు మందలింపు మీలో తగాదాలూ, అభిప్రాయభేదాలూ ఎక్కడ నుండి వస్తున్నాయి? మీ సాటి విశ్వాసుల్లో వివాదాలకు కారణమైన మీ శరీర సంబంధమైన కోరికల నుంచే కదా?
యాకోబు 4 : 2 (IRVTE)
మీకు లేని వాటిని కోరుకుంటారు. మీరు పొందలేని దాని వెనకాల పరుగులు పెడుతున్నారు. హత్యలు చేస్తున్నారు. పోరాటం చేస్తున్నారు, తగాదాలాడుతున్నారు కానీ దేవుణ్ణి అడగరు కాబట్టి మీరేదీ పొందరు.
యాకోబు 4 : 3 (IRVTE)
మీరడిగినా మీకేమీ దొరకదు. ఎందుకంటే మీ సుఖభోగాల కోసం ఖర్చు చేసేందుకు చెడ్డ వాటిని అడుగుతారు.
యాకోబు 4 : 4 (IRVTE)
కులటలారా, లోకంతో స్నేహం చేయడం అంటే దేవునితో శత్రుత్వమని మీకు తెలియదా? దాన్ని బట్టి ఈ లోకంతో స్నేహం చేయాలనుకునేవాడు దేవునికి శత్రువు అవుతాడు.
యాకోబు 4 : 5 (IRVTE)
ఆయన మనలో ఉంచిన ఆత్మ మనలను తీవ్రమైన ఆసక్తితో కోరుకుంటాడు అని లేఖనం చెబుతున్నది. ఆ లేఖనం వ్యర్థం అనుకుంటున్నారా?
యాకోబు 4 : 6 (IRVTE)
కాదు, ఆయన అధికంగా కృప దయ చేస్తాడు. అందుకనే “దేవుడు గర్విష్టులను అడ్డుకుంటాడు. దీనులకు కృపను అనుగ్రహిస్తాడు” అని లేఖనం చెబుతున్నది.
యాకోబు 4 : 7 (IRVTE)
కాబట్టి దేవునికి లోబడి ఉండండి. సాతానును ఎదిరించండి. వాడు మీ దగ్గరనుంచి పారిపోతాడు.
యాకోబు 4 : 8 (IRVTE)
దేవునికి సమీపంగా రండి. ఆయన మీకు దగ్గరగా వస్తాడు. పాపులారా, మీ చేతులను పరిశుభ్రం చేసుకోండి. చపలచిత్తులారా, మీ హృదయాలను పవిత్రం చేసుకోండి.
యాకోబు 4 : 9 (IRVTE)
చపలచిత్తులారా విలపించండి. మీ నవ్వును విచారానికీ, మీ ఆనందాన్ని చింతకూ మార్చుకోండి.
యాకోబు 4 : 10 (IRVTE)
ప్రభువు ఎదుట మిమ్మల్ని మీరు తగ్గించుకోండి. అప్పుడు ఆయన మిమ్మల్ని హెచ్చిస్తాడు.
యాకోబు 4 : 11 (IRVTE)
సోదరులారా, మీలో ఒకరికొకరు వ్యతిరేకంగా మాట్లాడకండి. తన సోదరుడికి వ్యతిరేకంగా మాట్లాడేవాడు లేక తీర్పు తీర్చేవాడు ధర్మశాస్త్రానికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నాడు. ధర్మశాస్త్రానికే తీర్పు తీరుస్తున్నాడు. ధర్మశాస్త్రానికి తీర్పు తీరుస్తున్నావంటే ధర్మశాస్త్రానికి నువ్వు లోబడడం లేదని అర్థం. ధర్మశాస్త్రానికే న్యాయాధిపతిగా వ్యవహరిస్తున్నావని అర్థం.
యాకోబు 4 : 12 (IRVTE)
ధర్మశాస్త్రాన్ని ఇచ్చిందీ తీర్పు తీర్చేదీ ఒక్కరే. దేవుడే! ఆయనే రక్షించడానికీ నాశనం చేయడానికీ సమర్ధుడు. ఇతరులకి తీర్పు తీర్చడానికి నువ్వెవరు?
యాకోబు 4 : 13 (IRVTE)
“నేడో రేపో ఫలానా పట్టణానికి వెళ్ళి అక్కడ ఒక సంవత్సరం ఉండి వ్యాపారం చేసి డబ్బు సంపాదించుకుందాం” అనుకునే వారికి ఒక మాట.
యాకోబు 4 : 14 (IRVTE)
రేపేం జరుగుతుందో ఎవరికీ తెలుసు? అసలు నీ జీవితం ఏపాటిది? కాసేపు కనిపించి మాయమై పోయే ఆవిరిలాంటిది.
యాకోబు 4 : 15 (IRVTE)
కాబట్టి మీరు, “ప్రభువుకు ఇష్టమైతే ఈ రోజు మనం జీవించి ఇది చేద్దాం, అది చేద్దాం” అనుకోవాలి.
యాకోబు 4 : 16 (IRVTE)
ఇప్పుడైతే మీరు దురహంకారంగా ఉన్నారు. ఈ గర్వం చెడ్డది.
యాకోబు 4 : 17 (IRVTE)
మంచి విషయాలు చేయాలని తెలిసీ చేయని వాడికి అది పాపంగా పరిణమిస్తుంది.

1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17