యిర్మీయా 36 : 1 (IRVTE)
యిర్మీయా వ్రాతపత్రాలను యెహోయాకీము కాల్చివేశాడు యూదా రాజు యోషీయా కొడుకు యెహోయాకీము పాలించిన నాలుగో సంవత్సరంలో యెహోవా వాక్కు యిర్మీయాతో ఇలా చెప్పాడు.
యిర్మీయా 36 : 2 (IRVTE)
“నువ్వు ఒక పుస్తకం తీసుకుని నేను నీతో మాట్లాడిన రోజు మొదలుకుని, అంటే, యోషీయా కాలం మొదలుకుని ఈ రోజు వరకు ఇశ్రాయేలు, యూదా ప్రజల గురించీ, అన్ని జాతుల గురించీ నీతో పలికిన మాటలన్నీ దానిలో రాయి.
యిర్మీయా 36 : 3 (IRVTE)
నేను యూదా ప్రజలకు చెయ్యాలని ఉద్దేశించిన కీడంతటి గురించి వాళ్ళు విని, నేను వాళ్ళ దోషం, వాళ్ళ పాపం క్షమించేలా తమ దుర్మార్గత విడిచి పశ్చాత్తాప పడతారేమో.”
యిర్మీయా 36 : 4 (IRVTE)
యిర్మీయా నేరీయా కొడుకు బారూకును పిలిపించాడు. యెహోవా యిర్మీయాతో చెప్పిన మాటలన్నీ యిర్మీయా చెప్తూ ఉండగా అతడు ఆ పుస్తకంలో రాశాడు.
యిర్మీయా 36 : 5 (IRVTE)
తరువాత యిర్మీయా బారూకుకు ఇలా ఆజ్ఞ ఇచ్చాడు. “నేను చెరసాలలో ఉన్నాను కాబట్టి యెహోవా మందిరానికి రాలేను.
యిర్మీయా 36 : 6 (IRVTE)
కాబట్టి నువ్వు వెళ్లి, ఉపవాసదినాన యెహోవా మందిరంలో ప్రజలకు వినిపించేలా, నేను చెప్తూ ఉండగా నువ్వు పుస్తకంలో రాసిన యెహోవా మాటలు ప్రకటించు. తమ పట్టణాలనుంచి వచ్చే యూదా ప్రజలందరికీ వినిపించేలా వాటిని ప్రకటించు.
యిర్మీయా 36 : 7 (IRVTE)
దయ చూపించమని వాళ్ళు చేసే అభ్యర్ధనలు ఒకవేళ యెహోవా దృష్టికి ఆమోదం అవుతాయేమో, ఒకవేళ వాళ్ళు తమ చెడుమార్గం విడిచిపెడతారేమో, ఎందుకంటే ఈ ప్రజల మీద యెహోవా ప్రకటించిన ఉగ్రత, మహాకోపం ఎంతో తీవ్రంగా ఉన్నాయి.”
యిర్మీయా 36 : 8 (IRVTE)
కాబట్టి ప్రవక్త అయిన యిర్మీయా తనకు ఆజ్ఞ ఇచ్చినట్టు, నేరీయా కొడుకు బారూకు యెహోవా మాటలన్నీ, బిగ్గరగా యెహోవా మందిరంలో చదివి వినిపించాడు.
యిర్మీయా 36 : 9 (IRVTE)
యూదా రాజైన యోషీయా కొడుకు యెహోయాకీము పరిపాలనలో ఐదో సంవత్సరం తొమ్మిదో నెలలో యెరూషలేములో ఉన్న ప్రజలందరూ, యూదా పట్టాణాల్లో నుంచి యెరూషలేముకు వచ్చిన ప్రజలందరూ యెహోవా పేరట ఉపవాసం ప్రకటించినప్పుడు,
యిర్మీయా 36 : 10 (IRVTE)
బారూకు యెహోవా మందిరంలో లేఖికుడైన షాఫాను కొడుకు గెమర్యా గదికి పైగా ఉన్న ప్రాంగణంలో, యెహోవా మందిరపు ప్రవేశ ద్వారం దగ్గర, ప్రజలందరూ వినేలా యిర్మీయా చెప్పిన మాటలు పుస్తకంలోనుంచి చదివి వినిపించాడు.
యిర్మీయా 36 : 11 (IRVTE)
షాఫాను కొడుకైన గెమర్యా కొడుకు మీకాయా ఆ పుస్తకంలో ఉన్న యెహోవా మాటలన్నీ విని
యిర్మీయా 36 : 12 (IRVTE)
రాజమందిరంలో ఉన్న లేఖికుడి గదిలోకి వెళ్ళినప్పుడు నాయకులందరూ లేఖికుడైన ఎలీషామా, షెమాయా కొడుకు దెలాయ్యా, అక్బోరు కొడుకు ఎల్నాతాను, షాఫాను కొడుకు గెమర్యా, హనన్యా కొడుకు సిద్కియా అనే వాళ్ళూ, నాయకులందరూ అక్కడ కూర్చుని ఉన్నారు.
యిర్మీయా 36 : 13 (IRVTE)
బారూకు ప్రజలందరికీ వినిపించేలా ఆ పుస్తకంలో నుంచి చదివి వినిపించిన మాటలన్నీ మీకాయా వాళ్లకు తెలియజేసినప్పుడు,
యిర్మీయా 36 : 14 (IRVTE)
అధికారులందరూ కూషీ మునిమనవడు, షెలెమ్యాకు మనవడు, నెతన్యాకు కొడుకు అయిన యెహూదిని బారూకు దగ్గరికి పంపి “నువ్వు ప్రజలు వింటుండగా చదివిన ఆ పుస్తకపు చుట్ట నీ చేత్తో పట్టుకుని తీసుకురా” అని ఆజ్ఞ ఇచ్చారు. నేరీయా కొడుకు బారూకు ఆ పుస్తకపు చుట్ట చేత్తో పట్టుకుని వచ్చాడు.
యిర్మీయా 36 : 15 (IRVTE)
అతడు వచ్చినప్పుడు వాళ్ళు “నువ్వు కూర్చుని మాకు చదివి వినిపించు” అన్నారు. కాబట్టి బారూకు దాన్ని వారికి చదివి వినిపించాడు.
యిర్మీయా 36 : 16 (IRVTE)
వాళ్ళు ఆ మాటలన్నీ విన్నప్పుడు భయంతో ఒకరినొకరు చూసుకుని “మనం కచ్చితంగా ఈ మాటలు రాజుకు తెలియజేయాలి” అని బారూకుతో అన్నారు.
యిర్మీయా 36 : 17 (IRVTE)
అప్పుడు వాళ్ళు బారూకుతో “మాతో చెప్పు, ఈ మాటలన్నీ యిర్మీయా చెప్తూ ఉన్నప్పుడు నువ్వు ఎలా రాశావు?” అని అడిగారు.
యిర్మీయా 36 : 18 (IRVTE)
బారూకు వాళ్ళతో “అతడు తన నోటితో ఈ మాటలన్నీ పలికినప్పుడు, నేను పుస్తకపు చుట్టలో వాటిని సిరాతో రాశాను” అన్నాడు.
యిర్మీయా 36 : 19 (IRVTE)
అప్పుడు ఆ అధికారులు బారూకుతో “నువ్వూ, యిర్మీయా, ఇద్దరూ వెళ్లి దాగి ఉండండి. మీరున్న చోటు ఎవరికీ తెలియనివ్వొద్దు” అన్నారు.
యిర్మీయా 36 : 20 (IRVTE)
అప్పుడు వాళ్ళు ఆ పుస్తకాన్ని లేఖికుడైన ఎలీషామా గదిలో ఉంచి, రాజమందిరానికి తామే వెళ్లి, ఆ మాటలన్నీ రాజుకు చెప్పారు.
యిర్మీయా 36 : 21 (IRVTE)
అప్పుడు రాజు ఆ పుస్తకపు చుట్టను తీసుకురావడానికి యెహూదిని పంపించినప్పుడు అతడు లేఖికుడైన ఎలీషామా గదిలోనుంచి దాన్ని తీసుకొచ్చి రాజుకు, రాజు పక్కన నిల్చుని ఉన్న అధికారులకూ వినిపించేలా బిగ్గరగా చదివాడు.
యిర్మీయా 36 : 22 (IRVTE)
తొమ్మిదో నెలలో, రాజు శీతాకాలం రాజమందిరంలో కూర్చుని ఉన్నప్పుడు, అతని ఎదుట కుంపటిలో అగ్ని రగులుతూ ఉంది.
యిర్మీయా 36 : 23 (IRVTE)
యెహూది మూడు నాలుగు వరుసలు చదివిన తరువాత, రాజు చాకుతో దాన్ని కోసి, ఆ కుంపటిలో వేశాడు. అప్పుడు అది పూర్తిగా కాలిపోయింది.
యిర్మీయా 36 : 24 (IRVTE)
అయితే, రాజుగాని, ఈ మాటలన్నీ విన్న అతని సేవకుల్లో ఒక్కడైనా భయపడ లేదు, తమ బట్టలు చింపుకోలేదు.
యిర్మీయా 36 : 25 (IRVTE)
పుస్తకపు చుట్టను కాల్చవద్దని ఎల్నాతాను, దెలాయ్యా, గెమర్యా రాజును కోరినా, అతడు వాళ్ళ మాట వినలేదు.
యిర్మీయా 36 : 26 (IRVTE)
లేఖికుడైన బారూకును, ప్రవక్త అయిన యిర్మీయాను పట్టుకోవాలని రాజవంశస్థుడైన యెరహ్మెయేలుకు, అజ్రీయేలు కొడుకు శెరాయాకు, అబ్దెయేలు కొడుకు షెలెమ్యాకు రాజు ఆజ్ఞాపించాడు, కాని యెహోవా యిర్మియా బారూకులను వారికి కనబడకుండా చేశాడు.
యిర్మీయా 36 : 27 (IRVTE)
యిర్మీయా చెప్పిన మాటనుబట్టి బారూకు రాసిన పుస్తకం చుట్టను రాజు కాల్చివేసిన తరువాత యెహోవా వాక్కు యిర్మీయాతో ఇలా చెప్పాడు.
యిర్మీయా 36 : 28 (IRVTE)
నువ్వు ఇంకొక పుస్తకం చుట్ట తీసుకుని యూదా రాజైన యెహోయాకీము కాల్చిన మొదటి పుస్తకంలో రాసిన మాటలన్నీ దానిలో రాయి.
యిర్మీయా 36 : 29 (IRVTE)
యూదా రాజైన యెహోయాకీముకు నువ్వు ఈ మాట చెప్పాలి. “యెహోవా చెప్పేదేమంటే, నువ్వు పుస్తకపు చుట్టను కాల్చేశావు! ‘బబులోను రాజు కచ్చితంగా వచ్చి ఈ దేశాన్ని నాశనం చేసి, ఈ ప్రజలను, జంతువులను నాశనం చేస్తాడు’ అని నువ్వు ఇందులో ఎందుకు రాశావు? అని అడిగావు.”
యిర్మీయా 36 : 30 (IRVTE)
ఆ కారణంగా యూదా రాజైన యెహోయాకీము గురించి యెహోవా ఇలా అంటున్నాడు. “దావీదు సింహాసనం మీద కూర్చోడానికి నీ వారసులు ఎవరూ ఉండరు. పగలు ఎండలో, రాత్రి గడ్డ కట్టిన మంచులో పాడైపోయేలా నీ శవాన్ని పారేస్తారు.
యిర్మీయా 36 : 31 (IRVTE)
వాళ్ళ దోషాన్ని బట్టి అతన్నీ, అతని సంతతినీ, అతని సేవకులనూ నేను శిక్షిస్తాను. నేను వాళ్ళ గురించి చెప్పిన కీడంతా వాళ్ళ మీదకీ, యెరూషలేము, యూదా ప్రజల మీదకీ తీసుకొస్తానని మిమ్మల్ని బెదిరించినా వాళ్ళు దాన్ని పట్టించుకోలేదు.”
యిర్మీయా 36 : 32 (IRVTE)
కాబట్టి యిర్మీయా ఇంకొక పుస్తకం చుట్టను తీసుకుని లేఖికుడైన నేరియా కొడుకు బారూకు చేతికి ఇచ్చినప్పుడు, అతడు యిర్మీయా నోటితో చెప్పిన మాటలనుబట్టి యూదా రాజైన యెహోయాకీము తగలబెట్టిన పుస్తకం చుట్టలోని మాటలన్నీ మళ్ళీ రాశాడు. ఆ మాటలే కాకుండా, అలాంటివి ఇంకా ఎన్నో మాటలు వాటికి జోడించి రాశాడు.

1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32