యిర్మీయా 37 : 1 (IRVTE)
యిర్మీయా చెరసాల్లో యెహోయాకీము కొడుకు కొన్యాకు బదులుగా బబులోనురాజు నెబుకద్నెజరు యూదా దేశంలో రాజుగా నియమించిన యోషీయా కొడుకు సిద్కియా రాజ్యపాలన చేస్తూ ఉన్నాడు.
యిర్మీయా 37 : 2 (IRVTE)
అతడుగాని, అతని సేవకులుగాని, దేశప్రజలుగాని యెహోవా ప్రవక్త అయిన యిర్మీయా ద్వారా యెహోవా చెప్పిన మాటలు పట్టించుకోలేదు.
యిర్మీయా 37 : 3 (IRVTE)
రాజైన సిద్కియా షెలెమ్యా కొడుకు యెహుకలునూ, యాజకుడైన మయశేయా కొడుకు జెఫన్యానూ, ప్రవక్త అయిన యిర్మీయా దగ్గరికి పంపి “మా పక్షంగా మన దేవుడైన యెహోవాకు ప్రార్థన చెయ్యి,” అని అన్నారు.
యిర్మీయా 37 : 4 (IRVTE)
అప్పటికి వాళ్ళు యిర్మీయాను చెరసాల్లో పెట్టలేదు. అతడు ప్రజల మధ్య తిరుగుతూ ఉన్నాడు.
యిర్మీయా 37 : 5 (IRVTE)
ఫరో సైన్యం ఐగుప్తులోనుంచి బయలుదేరినప్పుడు, యెరూషలేమును ముట్టడి వేస్తున్న కల్దీయులు ఆ విషయం విని యెరూషలేమును విడిచి వెళ్ళిపోయారు.
యిర్మీయా 37 : 6 (IRVTE)
అప్పుడు యెహోవా వాక్కు ప్రవక్తయైన యిర్మీయాతో ఇలా అన్నాడు,
యిర్మీయా 37 : 7 (IRVTE)
“ఇశ్రాయేలు దేవుడైన యెహోవా ఇలా అంటున్నాడు, నన్ను అడిగి తెలుసుకోమని నిన్ను నా దగ్గరికి పంపిన యూదా రాజుతో నువ్వు ఈ విధంగా చెప్పాలి, ‘చూడు, మీకు సాయం చెయ్యడానికి బయలుదేరి వస్తున్న ఫరో సైన్యం తమ స్వదేశమైన ఐగుప్తుకు తిరిగి వెళ్ళిపోయింది.
యిర్మీయా 37 : 8 (IRVTE)
కల్దీయులు మళ్ళీ తిరిగి వస్తారు. వాళ్ళు వచ్చి ఈ పట్టణం మీద యుద్ధం చేసి దాని పట్టుకుని అగ్నితో కాల్చేస్తారు.’ ”
యిర్మీయా 37 : 9 (IRVTE)
యెహోవా ఇలా అంటున్నాడు. “కల్దీయులు కచ్చితంగా మా దగ్గర నుంచి వెళ్ళిపోతున్నారు,” అని మిమ్మల్ని మీరు మోసం చేసుకోకండి. ఎందుకంటే, వాళ్ళు వెళ్లనే వెళ్లరు.
యిర్మీయా 37 : 10 (IRVTE)
మీతో యుద్ధం చేసే కల్దీయుల సైన్యమంతటినీ మీరు హతం చేసి వాళ్ళల్లో గాయపడిన వాళ్ళను మాత్రమే మిగిల్చినా, వాళ్ళే తమ గుడారాల్లోనుంచి వచ్చి ఈ పట్టణాన్ని అగ్నితో కాల్చేస్తారు.
యిర్మీయా 37 : 11 (IRVTE)
ఫరో సైన్యం వస్తున్నందున భయపడి కల్దీయుల సైన్యం యెరూషలేమును విడిచి వెళ్ళిపోయింది.
యిర్మీయా 37 : 12 (IRVTE)
అప్పుడు యిర్మీయా బెన్యామీను దేశంలో తన వాళ్ళ దగ్గర ఒక భూభాగం తీసుకోడానికి యెరూషలేము నుంచి బయలు దేరాడు.
యిర్మీయా 37 : 13 (IRVTE)
అతడు బెన్యామీను ద్వారం దగ్గర నిలబడి ఉండగా కాపలాదారుల అధికారి అక్కడ ఉన్నాడు. అతడు షెలెమ్యా కొడుకు, హనన్యా మనవడు అయిన ఇరీయా. అతడు యిర్మీయా ప్రవక్తను పట్టుకుని “నువ్వు కల్దీయుల్లో చేరబోతున్నావు” అన్నాడు.
యిర్మీయా 37 : 14 (IRVTE)
కాని యిర్మీయా “అది నిజం కాదు. నేను కల్దీయుల్లో చేరడం లేదు” అన్నాడు. అయితే అతడు యిర్మీయా మాట వినలేదు. ఇరీయా యిర్మీయాను పట్టుకుని అధికారుల దగ్గరికి తీసుకొచ్చాడు.
యిర్మీయా 37 : 15 (IRVTE)
అధికారులు యిర్మీయా మీద కోపపడి, అతన్ని కొట్టి, తాము చెరసాలగా మార్చిన లేఖికుడైన యోనాతాను ఇంట్లో అతన్ని ఉంచారు.
యిర్మీయా 37 : 16 (IRVTE)
యిర్మీయా భూగర్భంలో ఉన్న ఒక చెరసాల గదిలో చాలా రోజులు ఉన్నాడు.
యిర్మీయా 37 : 17 (IRVTE)
తరువాత రాజైన సిద్కియా అతన్ని రప్పించడానికి ఒకణ్ణి పంపి, అతన్ని తన ఇంటికి పిలిపించి “యెహోవా దగ్గర నుంచి ఏ మాటైనా వచ్చిందా?” అని ఏకాంతంగా అతన్ని అడిగాడు. యిర్మీయా “వచ్చింది, నిన్ను బబులోను రాజు చేతికి అప్పగించడం జరుగుతుంది” అన్నాడు.
యిర్మీయా 37 : 18 (IRVTE)
అప్పుడు యిర్మీయా, రాజైన సిద్కియాతో ఇంకా ఇలా అన్నాడు. “నేను నీ పట్ల, నీ సేవకుల పట్ల, ఈ ప్రజల పట్ల ఏ పాపం చేశానని నన్ను చెరసాల్లో వేశావు?
యిర్మీయా 37 : 19 (IRVTE)
బబులోను రాజు మీమీదకైనా, ఈ దేశం మీదకైనా రాడని మీకు ప్రకటించిన మీ ప్రవక్తలు ఎక్కడ ఉన్నారు?
యిర్మీయా 37 : 20 (IRVTE)
కాని, రాజా, నా యేలినవాడా! విను. నా అభ్యర్ధన నీ ఎదుటకు రానివ్వు. నన్ను మళ్ళీ లేఖికుడైన యోనాతాను ఇంటికి తిరిగి పంపొద్దు. పంపితే నేను ఇంక అక్కడే చనిపోతాను.”
యిర్మీయా 37 : 21 (IRVTE)
కాబట్టి రాజైన సిద్కియా ఆజ్ఞ జారీ చేశాడు. అతని సేవకులు ఆ ప్రాంగణంలో ఉన్న చెరసాలలో యిర్మీయాను పెట్టారు. పట్టణంలో రొట్టెలున్నంత వరకూ రొట్టెలు కాల్చేవాళ్ళ వీధిలోనుంచి ప్రతిరోజూ ఒక రొట్టె అతనికి ఇస్తూ వచ్చారు. కాబట్టి సేవకుల ప్రాంగణంలో ఉన్న చెరసాలలో యిర్మీయా ఉన్నాడు.

1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21