యిర్మీయా 46 : 1 (IRVTE)
ఐగుప్తుకు గూర్చి ప్రవచనం ఇతర జాతులనూ దేశాలనూ గూర్చి యిర్మీయా దగ్గరికి వచ్చిన యెహోవా వాక్కు.
యిర్మీయా 46 : 2 (IRVTE)
ఐగుప్తును గూర్చిన మాట. యూఫ్రటీసు నది సమీపాన ఉన్న కర్కెమీషు దగ్గర ఉన్న ఐగుప్తు రాజు ఫరో నెకో సైన్యాలను గూర్చిన సంగతులు. యోషీయా కొడుకూ యూదా రాజు అయిన యెహోయాకీము పరిపాలనలో నాలుగో సంవత్సరంలో బబులోను రాజు నెబుకద్నెజరు ఈ సైన్యాలను ఓడించాడు.
యిర్మీయా 46 : 3 (IRVTE)
“డాలునూ కవచాన్నీ సిద్ధం చేసుకోండి. యుద్ధానికి ముందుకు కదలండి.
యిర్మీయా 46 : 4 (IRVTE)
గుర్రాలను సిద్ధం చేయండి. రౌతులారా, శిరస్త్రాణం పెట్టుకుని వాటిని అధిరోహించండి. బల్లేలకు పదును పెట్టండి. ఆయుధాలు ధరించండి.
యిర్మీయా 46 : 5 (IRVTE)
ఇక్కడ నేనేం చూస్తున్నాను? వాళ్ళు భయకంపితులయ్యారు. పారిపోతున్నారు. ఎందుకంటే వాళ్ళ సైన్యాలు ఓడిపోయాయి. వాళ్ళు వెనక్కి తిరిగి చూడకుండా సురక్షితమైన చోటును వెదుక్కుంటూ వేగంగా పారిపోతున్నారు. అన్నివేపులా భయం ఆవరించింది. యెహోవా చేస్తున్న ప్రకటన ఇది.
యిర్మీయా 46 : 6 (IRVTE)
వేగం గలవాళ్ళు పారిపోలేక పోతున్నారు. సైనికులు తప్పించుకోలేక పోతున్నారు. ఉత్తర దిక్కులో వాళ్ళు యూఫ్రటీసు నదీ తీరంలో తడబడి పడిపోతున్నారు.
యిర్మీయా 46 : 7 (IRVTE)
నైలునదీ ప్రవాహంలా ఉప్పొంగుతూ వస్తున్న ఈ వ్యక్తి ఎవరు? ఇతని నీళ్ళు నదుల్లా ఎగసి పడుతున్నాయి.
యిర్మీయా 46 : 8 (IRVTE)
ఐగుప్తు నైలు నదిలా పైకి లేస్తుంది. దాని నీళ్ళు నదుల్లా పైకీ కిందికీ విసిరినట్టుగా ప్రవహిస్తుంది. అది ‘నేను పైకి లేస్తాను. భూమిని కప్పి వేస్తాను. నేను పట్టణాలనూ, వాటిలో ప్రజలనూ నాశనం చేస్తాను’ అంటుంది.
యిర్మీయా 46 : 9 (IRVTE)
గుర్రాలూ, పైకి లేవండి. రథాలూ రోషం తెచ్చుకోండి. సైనికుల్లారా బయలుదేరండి. డాలు వాడటంలో నిపుణులైన కూషు వాళ్ళూ, పూతు వాళ్ళూ, విల్లు వంచి బాణాలు సంధించడంలో నిపుణులైన లూదీ వాళ్ళూ బయలుదేరాలి.
యిర్మీయా 46 : 10 (IRVTE)
ఇది సేనల ప్రభువైన యెహోవా ప్రతీకారం తీర్చుకునే రోజు. ఆయన తన శత్రువులపై పగ తీర్చుకుంటాడు. కత్తి శత్రువులని చీల్చివేస్తుంది. తృప్తి చెందుతుంది. వాళ్ళ రక్తాన్ని పానం చేస్తుంది. యూఫ్రటీసు నది దగ్గర ఉత్తర దేశంలో సేనల ప్రభువైన యెహోవాకు బలి అర్పణ జరగబోతూ ఉంది.
యిర్మీయా 46 : 11 (IRVTE)
కన్య అయిన ఐగుప్తు కుమారీ, గిలాదుకి వెళ్లి ఔషధం తెచ్చుకో. నీ పైన ఎక్కువ ఔషధాలు ఉపయోగించడం వ్యర్ధం. నీకు స్వస్థత కలుగదు.
యిర్మీయా 46 : 12 (IRVTE)
నీకు కలిగిన అవమానం గూర్చి జాతులన్నీ తెలుసుకున్నాయి. నువ్వు చేసే రోదన ధ్వని భూమి అంతటా వినిపిస్తుంది. ఒక సైనికుడు తడబడి మరో సైనికుడి పైన పడతాడు. ఇద్దరూ కలసి కూలి పోతారు.”
యిర్మీయా 46 : 13 (IRVTE)
యిర్మీయా 46 : 14 (IRVTE)
బబులోను రాజైన నెబుకద్నెజరు బయలుదేరి వచ్చి ఐగుప్తుపై దాడి చేసినప్పుడు ప్రవక్త అయిన యిర్మీయాకు యెహోవా చెప్పిన మాట ఇది. ఐగుప్తులో తెలియజేయండి. అది మిగ్దోలులోనూ మెంఫిస్ లోనూ వినిపించాలి. తహపనేసులో వాళ్ళు ఇలా ప్రకటించారు. నీ చుట్టూ కత్తి స్వైర విహారం చేస్తూ అంతటినీ మింగివేస్తుంది. కాబట్టి మీరు లేచి ధైర్యంగా నిలిచి ఉండండి.
యిర్మీయా 46 : 15 (IRVTE)
ఏపిస్ అనే నీ దేవుడు ఎందుకు పారిపోయాడు? నీ ఎద్దు దేవుడు ఎందుకు నిలబడలేదు? ఎందుకంటే యెహోవా అతణ్ణి కిందకు పడవేశాడు.
యిర్మీయా 46 : 16 (IRVTE)
తడబడే వాళ్ళ సంఖ్యను ఆయన అధికం చేస్తున్నాడు. ఒక్కో సైనికుడు మరొకడి మీద పడిపోతున్నాడు. వాళ్ళు “లేవండి, ఇంటికి వెళ్దాం. మన స్వంత ప్రజల దగ్గరకూ, మన స్వదేశానికీ వెళ్దాం. మనలను బాధిస్తున్న ఈ కత్తిని వదిలించుకుందాం.” అని చెప్పుకుంటున్నారు.
యిర్మీయా 46 : 17 (IRVTE)
వాళ్ళు అక్కడ “ఐగుప్తు రాజైన ఫరో కేవలం ఒక ధ్వని మాత్రమే. అతడు అవకాశాలను చేజార్చుకునే వాడు” అని ప్రకటించారు.
యిర్మీయా 46 : 18 (IRVTE)
సేనల ప్రభువూ, రాజూ అయిన యెహోవా ఇలా ప్రకటన చేస్తున్నాడు. “నా తోడు, ఒక మనిషి రాబోతూ ఉన్నాడు. అతడు తాబోరు పర్వతం లాంటి వాడు. సముద్రం పక్కనే ఉన్న కర్మెలు లాంటి వాడు.
యిర్మీయా 46 : 19 (IRVTE)
ఐగుప్తు ఆడపడుచులారా, మీరు చెరలోకి వెళ్ళడానికి సిద్ధపడండి. ఎందుకంటే నోపు భయం కలిగించేలా శిథిలమై పోతుంది. అక్కడ ఎవరూ నివసించలేరు.
యిర్మీయా 46 : 20 (IRVTE)
ఐగుప్తు ఒక అందమైన లేగదూడ వంటిది. కానీ ఉత్తరం వైపు నుండి కుట్టే కందిరీగ ఒకటి వస్తుంది. అది సమీపిస్తూ ఉంది.
యిర్మీయా 46 : 21 (IRVTE)
వాళ్ళ మధ్యలో అద్దెకు తెచ్చుకున్న సైనికులు కొవ్వు పట్టిన ఎద్దుల్లా ఉన్నారు. అయితే వాళ్ళు కూడా వెనక్కి తిరిగి పారిపోతారు. వాళ్ళు కలసి ఉండరు. వాళ్ళు నాశనమయే రోజు వాళ్లకు వ్యతిరేకంగా వస్తూ ఉంది. అది వాళ్ళని శిక్షించే రోజు.
యిర్మీయా 46 : 22 (IRVTE)
ఐగుప్తు పైకి శత్రువులు దండెత్తి వస్తున్నారు. అది పాములా బుసలు కొడుతూ పాక్కుంటూ అవతలికి వెళ్ళిపోతుంది. చెట్ల కొమ్మలు నరికే వాళ్ళు గొడ్డళ్ళు పట్టుకుని వచ్చినట్టుగా వాళ్ళు ఆమె దగ్గరికి వస్తున్నారు.”
యిర్మీయా 46 : 23 (IRVTE)
ఇది యెహోవా చేస్తున్న ప్రకటన. “అవి ఎంత దట్టమైన అడవులైనా వాళ్ళు దాన్ని నరికి వేస్తారు. ఎందుకంటే వాళ్ళ సంఖ్య మిడతల దండు కంటే ఎక్కువగా ఉంటుంది. వాళ్ళను లెక్క పెట్టడం సాధ్యం కాదు.
యిర్మీయా 46 : 24 (IRVTE)
ఐగుప్తు కుమారిని అవమానపరుస్తారు. ఉత్తరం వైపున దేశాల వారికి ఆమెను అప్పగిస్తారు.”
యిర్మీయా 46 : 25 (IRVTE)
సేనల ప్రభువూ, ఇశ్రాయేలు దేవుడూ అయిన యెహోవా ఇలా చెప్తున్నాడు. “చూడండి, నో పట్టణంలో ఉన్న ఆమోను దేవుణ్ణి, ఫరోనూ, ఐగుప్తునూ, దాని దేవుళ్ళనూ, రాజులనూ, ఫరో రాజులనూ, ఇంకా వాళ్ళలో నమ్మకముంచే వాళ్ళనీ నేను శిక్షించ బోతున్నాను.
యిర్మీయా 46 : 26 (IRVTE)
వాళ్ళ ప్రాణాలు తీయాలని చూసే వాళ్ళ చేతుల్లోకి వాళ్ళను అప్పగిస్తున్నాను. బబులోను రాజు నెబుకద్నెజరుకూ, అతని సేవకులకూ వాళ్ళని అప్పగిస్తున్నాను. ఆ తర్వాత ఐగుప్తు మళ్ళీ ఇంతకు ముందు లాగానే ప్రజలకు నివాస యోగ్యం అవుతుంది.” ఇది యెహోవా చేస్తున్న ప్రకటన.
యిర్మీయా 46 : 27 (IRVTE)
యిర్మీయా 46 : 28 (IRVTE)
“కానీ నా సేవకుడవైన యాకోబూ, నువ్వు భయపడకు. ఇశ్రాయేలూ, వ్యాకుల పడకు. ఎందుకంటే చూడు, నిన్ను దూర ప్రాంతాల్లోనుండి వెనక్కి తీసుకు వస్తాను. బందీలుగా ఉన్న నీ సంతానాన్ని చెరలో ఉన్న దేశం నుండి తీసుకు వస్తాను. యాకోబు తిరిగి వస్తాడు. అతనికి శాంతి లభిస్తుంది. క్షేమంగా ఉంటాడు. అతణ్ణి భయపెట్టే వాళ్ళు ఎవరూ ఉండరు. నా సేవకుడైన యాకోబూ, నువ్వు భయపడకు.” ఇదే యెహోవా చేస్తున్న ప్రకటన. “ఎందుకంటే నేను నీతో ఉన్నాను. నేను మిమ్మల్ని ఏ ఏ దేశాల్లోకి చెదరగొట్టానో ఆ దేశాలను సమూలంగా నాశనం చేస్తాను. కానీ నిన్ను పూర్తిగా నాశనం చేయను. అయితే నా సేవకుడవైన యాకోబూ, నేను నీకు తోడుగా ఉన్నాను. భయపడకు. నేనెక్కడికి నిన్ను చెదరగొట్టానో ఆ దేశప్రజలందరినీ సమూల నాశనం చేస్తాను. అయితే నిన్ను సమూలంగా నాశనం చేయను. న్యాయమైన విధంగా నిన్ను శిక్షిస్తాను. శిక్షించకుండా నిన్ను వదిలిపెట్టను.”

1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28