యోహాను సువార్త 20 : 1 (IRVTE)
యేసుక్రీస్తు పునరుత్థానం
మత్తయి 28:1-10; మార్కు 16:1-14; లూకా 24:1-43 ఆదివారం ఉదయాన్నే ఇంకా చీకటిగా ఉండగానే మగ్దలేనే మరియ సమాధి దగ్గరికి వచ్చింది. అక్కడ సమాధిపై ఉంచిన రాయి తీసి ఉండడం చూసింది.
యోహాను సువార్త 20 : 2 (IRVTE)
కాబట్టి ఆమె సీమోను పేతురు దగ్గరకూ, యేసు ప్రేమించిన మరో శిష్యుడి దగ్గరకూ పరుగెత్తుకుని వెళ్ళింది. వారితో, “ప్రభువును ఎవరో సమాధిలో నుండి తీసుకు పోయారు. ఆయనను ఎక్కడ ఉంచారో తెలియడం లేదు” అని చెప్పింది.
యోహాను సువార్త 20 : 3 (IRVTE)
కాబట్టి పేతురూ, ఆ మరో శిష్యుడూ వెంటనే బయలుదేరి సమాధి దగ్గరికి వచ్చారు.
యోహాను సువార్త 20 : 4 (IRVTE)
వారిద్దరూ కలసి వెళుతుండగా ఆ మరో శిష్యుడు పేతురు కంటే వేగంగా పరుగెత్తి మొదటగా సమాధి దగ్గరికి వచ్చాడు.
యోహాను సువార్త 20 : 5 (IRVTE)
అతడు ఆ సమాధిలోకి తొంగి చూశాడు. నార బట్టలు అతనికి కనిపించాయి. కానీ అతడు సమాధిలోకి ప్రవేశించలేదు.
యోహాను సువార్త 20 : 6 (IRVTE)
ఆ తరువాత సీమోను పేతురు అతని వెనకాలే వచ్చి నేరుగా సమాధిలోకి ప్రవేశించాడు.
యోహాను సువార్త 20 : 7 (IRVTE)
అక్కడ నారబట్టలు పడి ఉండడమూ, ఆయన తలకు కట్టిన రుమాలు నార బట్టలతో కాకుండా వేరే చోట చక్కగా చుట్టి పెట్టి ఉండడమూ చూశాడు.
యోహాను సువార్త 20 : 8 (IRVTE)
ఆ తరువాత మొదట సమాధిని చేరుకున్న శిష్యుడు కూడా లోపలి వెళ్ళి చూసి విశ్వసించాడు.
యోహాను సువార్త 20 : 9 (IRVTE)
అయితే ‘ఆయన చనిపోయిన వారి నుండి బతికి లేవడం తప్పనిసరి’ అన్న లేఖనం వారింకా గ్రహించలేదు.
యోహాను సువార్త 20 : 10 (IRVTE)
అప్పుడు ఆ శిష్యులు తిరిగి తమ ఇళ్ళకు వెళ్ళిపోయారు.
యోహాను సువార్త 20 : 11 (IRVTE)
యేసు మగ్దలేనే మరియకు ప్రత్యక్షం కావడం కానీ మరియ సమాధి బయటే నిలబడి ఏడుస్తూ ఉంది. ఆమె సమాధిలోకి వంగి చూసింది.
యోహాను సువార్త 20 : 12 (IRVTE)
ఆమెకు ఇద్దరు దేవదూతలు కనిపించారు. వారు తెల్లని బట్టలు వేసుకుని ఉన్నారు. యేసు దేహం ఉంచిన చోట ఒకడు తల వైపునా మరొకడు కాళ్ళ వైపునా కూర్చుని ఉన్నారు.
యోహాను సువార్త 20 : 13 (IRVTE)
వారు మరియతో “ఎందుకు ఏడుస్తున్నావమ్మా?” అని అడిగారు. దానికి ఆమె, “ఎవరో నా ప్రభువును తీసుకు వెళ్ళిపోయారు. ఆయనను ఎక్కడ ఉంచారో తెలియడం లేదు” అంది.
యోహాను సువార్త 20 : 14 (IRVTE)
ఆమె ఇలా పలికి వెనక్కి తిరిగి అక్కడ యేసు నిలబడి ఉండడం చూసింది. కానీ ఆయనను ఆమె గుర్తు పట్టలేదు.
యోహాను సువార్త 20 : 15 (IRVTE)
యేసు, “అమ్మా, ఎందుకు ఏడుస్తున్నావు? ఎవరిని వెతుకుతున్నావు?” అని ఆమెను అడిగాడు. ఆమె ఆయనను తోటమాలి అనుకుంది. “అయ్యా, ఒకవేళ నువ్వు ఆయనను తీసుకు వెళ్తే ఆయనను ఎక్కడ ఉంచావో చెప్పు. నేను ఆయనను తీసుకుపోతాను” అంది.
యోహాను సువార్త 20 : 16 (IRVTE)
అప్పుడు యేసు ఆమెను చూసి, “మరియా” అని పిలిచాడు. ఆమె ఆయన వైపుకు తిరిగి, “రబ్బూనీ” అని పిలిచింది. రబ్బూనీ అనే మాటకు హీబ్రూ భాషలో ఉపదేశకుడు అని అర్థం.
యోహాను సువార్త 20 : 17 (IRVTE)
యేసు ఆమెతో, “నేను ఇంకా తండ్రి దగ్గరికి ఎక్కి పోలేదు. కాబట్టి నన్ను తాకవద్దు. కానీ నా సోదరుల దగ్గరికి వెళ్ళి నా తండ్రీ, మీ తండ్రీ, నా దేవుడూ, మీ దేవుడూ అయిన ఆయన దగ్గరికి ఆరోహణం అవుతున్నానని వారికి చెప్పు” అన్నాడు.
యోహాను సువార్త 20 : 18 (IRVTE)
మగ్దలేనే మరియ వచ్చి శిష్యులతో, “నేను ప్రభువును చూశాను. ఆయన నాతో ఈ మాటలు చెప్పాడు” అంటూ ఆయన మాటలన్నీ వారికి తెలియజెప్పింది.
యోహాను సువార్త 20 : 19 (IRVTE)
తోమా లేనప్పుడు యేసు తన శిష్యులకు ప్రత్యక్షం కావడం
లూకా 24:36-49 ఆదివారం సాయంకాలం యూదులకు భయపడి శిష్యులు తామున్న ఇంటి తలుపులు మూసుకుని ఉన్నారు. అప్పుడు యేసు వచ్చి వారి మధ్యలో నిలబడి, వారితో, “మీకు శాంతి కలుగు గాక” అన్నాడు.
యోహాను సువార్త 20 : 20 (IRVTE)
ఆయన అలా చెప్పిన తరువాత వారికి తన పక్కనూ చేతులనూ చూపించాడు. వారు ప్రభువును చూసి ఎంతో సంతోషించారు.
యోహాను సువార్త 20 : 21 (IRVTE)
అప్పుడు యేసు తిరిగి, “మీకు శాంతి కలుగు గాక! తండ్రి నన్ను పంపించిన విధంగానే నేనూ మిమ్మల్ని పంపుతున్నాను” అని వారితో చెప్పాడు.
యోహాను సువార్త 20 : 22 (IRVTE)
ఈ మాట చెప్పిన తరువాత ఆయన వారి మీద ఊది, “పరిశుద్ధాత్మను పొందండి.
యోహాను సువార్త 20 : 23 (IRVTE)
మీరు ఎవరి పాపాలను క్షమిస్తారో వారి పాపాలకు క్షమాపణ ఉంటుంది. ఎవరి పాపాలు ఉండనిస్తారో అవి అలా నిలిచి ఉంటాయి” అని చెప్పాడు.
యోహాను సువార్త 20 : 24 (IRVTE)
తోమా ఉండగా యేసు తన శిష్యులకు ప్రత్యక్షం కావడం పన్నెండుమంది శిష్యుల్లో ఒకడైన తోమా యేసు వచ్చినప్పుడు వారితో లేడు. ఇతణ్ణి “దిదుమ” అని పిలిచే వాళ్ళు.
యోహాను సువార్త 20 : 25 (IRVTE)
మిగిలిన శిష్యులు, “మేము ప్రభువును చూశాం” అని అతడితో చెప్పారు. అప్పుడు అతడు, “నేను ఆయన మేకుల గుర్తును చూడాలి. నా వేలు ఆ గాయం రంధ్రంలో ఉంచాలి. అలాగే నేను నా చేతిని ఆయన పక్కలో ఉంచాలి. అప్పుడే నేను నమ్ముతాను” అన్నాడు.
యోహాను సువార్త 20 : 26 (IRVTE)
ఎనిమిది రోజులైన తరువాత మళ్ళీ ఆయన శిష్యులు లోపల ఉన్నారు. ఈసారి తోమా కూడా వారితో ఉన్నాడు. తలుపులు మూసి ఉన్నాయి. అప్పుడు యేసు వారి మధ్యకు వచ్చి, “మీకు శాంతి కలుగు గాక!” అన్నాడు.
యోహాను సువార్త 20 : 27 (IRVTE)
తరువాత ఆయన తోమాను చూసి, “నా చేతులు చూడు. నీ వేళ్ళతో వాటిని తాకు. అలాగే నీ చెయ్యి చాచి నా పక్కలో పెట్టు. విశ్వాసిగా ఉండు. అవిశ్వాసివి కావద్దు” అన్నాడు.
యోహాను సువార్త 20 : 28 (IRVTE)
దానికి జవాబుగా తోమా, “నా ప్రభూ, నా దేవా” అన్నాడు.
యోహాను సువార్త 20 : 29 (IRVTE)
అప్పుడు యేసు, “నువ్వు నన్ను చూసి నమ్మావు. అయితే నన్ను చూడకుండానే నమ్మిన వారు ధన్యులు” అన్నాడు.
యోహాను సువార్త 20 : 30 (IRVTE)
యోహాను సువార్త రాసిన కారణం యేసు క్రీస్తు ఇంకా అనేక అద్భుతాలను తన శిష్యుల ఎదుట చేశాడు. వాటన్నిటినీ ఈ పుస్తకంలో రాయలేదు.
యోహాను సువార్త 20 : 31 (IRVTE)
కానీ యేసు దేవుని కుమారుడు క్రీస్తు అని మీరు నమ్మడానికీ నమ్మి ఆయన నామంలో జీవం పొందడానికీ ఇవన్నీ రాయడం జరిగింది.
❮
❯