మార్కు సువార్త 1 : 1 (IRVTE)
బాప్తిసమిచ్చే యోహాను పరిచర్య
మత్తయి 3:1-11; లూకా 3:1-16; యోహా 1:6-8; 19-28 దేవుని కుమారుడు యేసు క్రీస్తు గురించిన సువార్త ఆరంభం.
మార్కు సువార్త 1 : 2 (IRVTE)
యెషయా ప్రవక్త రాసిన గ్రంథంలో ఇలా ఉంది, “ఇదిగో, నా దూతను నీకు ముందుగా పంపుతున్నాను. అతడు నీ మార్గం సిద్ధపరుస్తాడు.
మార్కు సువార్త 1 : 3 (IRVTE)
‘ప్రభువు మార్గం సిద్ధం చేయండి, ఆయన దారులు తిన్నగా చేయండి’ అని అరణ్యంలో ఒకడి కేక వినిపిస్తూ ఉంది.”
మార్కు సువార్త 1 : 4 (IRVTE)
యోహాను వచ్చినపుడు అరణ్య ప్రాంతంలో బాప్తిసం ఇస్తూ, పాప క్షమాపణ కోసం పశ్చాత్తాపానికి సూచనగా ఉన్న బాప్తిసం గురించి ప్రకటించాడు.
మార్కు సువార్త 1 : 5 (IRVTE)
యూదయ ప్రాంతం, యెరూషలేము పట్టణం వారంతా, యోహాను దగ్గరికి వెళ్లి, తమ పాపాలు ఒప్పుకుని, యొర్దాను నదిలో అతని చేత బాప్తిసం పొందారు.
మార్కు సువార్త 1 : 6 (IRVTE)
యోహాను ఒంటె వెంట్రుకలతో చేసిన బట్టలు వేసుకుని, నడుముకు తోలు నడికట్టు కట్టుకునేవాడు. అడవి తేనె, మిడతలు అతని ఆహారం.
మార్కు సువార్త 1 : 7 (IRVTE)
యోహాను, “నాకంటే శక్తి గలవాడు నా తరువాత వస్తున్నాడు. నేను వంగి ఆయన చెప్పులు విప్పడానికి కూడా తగను” అని ప్రకటించాడు.
మార్కు సువార్త 1 : 8 (IRVTE)
“నేను మీకు నీళ్లలో బాప్తిసం ఇచ్చాను గాని ఆయన మీకు దేవుని పరిశుద్ధాత్మలో బాప్తిసం ఇస్తాడు” అన్నాడు.
మార్కు సువార్త 1 : 9 (IRVTE)
యోహాను ఇలా ప్రకటిస్తున్న రోజుల్లో గలిలయ ప్రాంతంలోని నజరేతు నుండి యేసు వచ్చి యోహాను చేత యొర్దాను నదిలో బాప్తిసం తీసుకున్నాడు.
మార్కు సువార్త 1 : 10 (IRVTE)
యేసు నీళ్లలో నుండి ఒడ్డుకు వచ్చినప్పుడు ఆకాశం చీలి, దేవుని ఆత్మ పావురం రూపంలో తన మీదికి దిగి రావడం చూశాడు.
మార్కు సువార్త 1 : 11 (IRVTE)
అప్పుడు ఆకాశం నుండి ఒక స్వరం ఇలా వినిపించింది, “నీవు నా ప్రియ కుమారుడివి, నీ విషయం నాకెంతో ఆనందం.”
మార్కు సువార్త 1 : 12 (IRVTE)
యేసు ఎదుర్కొన్న పరీక్ష
మత్తయి 4:1-11; లూకా 4:1-13 వెంటనే దేవుని ఆత్మ ఆయనను అరణ్య ప్రాంతానికి తీసుకు వెళ్ళాడు.
మార్కు సువార్త 1 : 13 (IRVTE)
ఆయన అక్కడ నలభై రోజులుండి సైతాను చేత పరీక్షలకు గురయ్యాడు. అడవి మృగాల మధ్య జీవించాడు. దేవుని దూతలు ఆయనకు సపర్యలు చేశారు.
మార్కు సువార్త 1 : 14 (IRVTE)
గలిలయ పరిచర్య ఆరంభం
మత్తయి 4:12-17; లూకా 4:14 యోహానును చెరసాలలో వేసిన తరవాత యేసు గలిలయ ప్రాంతానికి వచ్చి దేవుని రాజ్య సువార్తను బోధిస్తూ,
మార్కు సువార్త 1 : 15 (IRVTE)
“కాలం సమీపించింది, దేవుని రాజ్యం దగ్గర పడింది. పశ్చాత్తాపపడి సువార్తను నమ్మండి” అని ప్రకటించాడు.
మార్కు సువార్త 1 : 16 (IRVTE)
ఆయన గలిలయ సరస్సు ఒడ్డున నడుస్తూ ఉండగా, జాలరులైన సీమోను, అతని సోదరుడు అంద్రెయ సరస్సులో వలవేయడం చూశాడు.
మార్కు సువార్త 1 : 17 (IRVTE)
యేసు, “నాతో రండి, నేను మిమ్మల్ని మనుషులను పట్టే జాలరులుగా చేస్తాను” అని వారితో అన్నాడు.
మార్కు సువార్త 1 : 18 (IRVTE)
వారు వెంటనే వలలను వదిలిపెట్టి ఆయన వెంట వెళ్ళారు.
మార్కు సువార్త 1 : 19 (IRVTE)
పేతురు అంద్రెయలకు పిలుపు
మత్తయి 4:18-22; లూకా 5:10-11; యోహా 1:35-42 ఆయన ఇంకా కొంతదూరం వెళ్ళి జెబెదయి కుమారుడు యాకోబునూ, అతని సోదరుడు యోహానునూ చూశాడు. వారు పడవలో ఉండి వారి వలలు బాగు చేసుకుంటున్నారు.
మార్కు సువార్త 1 : 20 (IRVTE)
వారిని చూసిన వెంటనే తన వెంట రమ్మని యేసు వారిని పిలిచాడు. వారు తమ తండ్రి జెబెదయిని పడవలో పనివారి దగ్గర విడిచిపెట్టి యేసు వెంట వచ్చారు.
మార్కు సువార్త 1 : 21 (IRVTE)
కపెర్నహూములో యేసు దయ్యాలను వెళ్ళగొట్టడం
లూకా 4:31-37 తరువాత వారందరూ కపెర్నహూము అనే పట్టణంలో విశ్రాంతి దినాన ఆయన యూదుల సమాజ మందిరంలోకి వెళ్ళి వారికి బోధించాడు.
మార్కు సువార్త 1 : 22 (IRVTE)
ధర్మశాస్త్ర పండితుల్లాగా కాకుండా అధికారం కలిగిన వాడిలాగా వారికి బోధించడం చూసి వారంతా ఆయన ఉపదేశానికి ఆశ్చర్యపడ్డారు.
మార్కు సువార్త 1 : 23 (IRVTE)
అదే సమయంలో దయ్యం పట్టిన వాడొకడు ఆ సమాజ మందిరంలో ఉన్నాడు.
మార్కు సువార్త 1 : 24 (IRVTE)
వాడు, “నజరేతువాడవైన యేసూ, మాతో నీకేం పని? మమ్మల్ని నాశనం చెయ్యడానికి వచ్చావా? నీవెవరివో నాకు తెలుసు. నీవు దేవుని పరిశుద్ధుడివి!” అని కేకలు వేశాడు.
మార్కు సువార్త 1 : 25 (IRVTE)
యేసు దురాత్మను గద్దిస్తూ, “మాట్లాడకు, ఇతన్ని వదిలి వెళ్ళు” అన్నాడు.
మార్కు సువార్త 1 : 26 (IRVTE)
ఆ దయ్యం అతన్ని గిజగిజలాడించి పెద్దగా కేకలు పెట్టి అతనిలో నుంచి బయటకు వెళ్ళిపోయింది.
మార్కు సువార్త 1 : 27 (IRVTE)
ప్రజలంతా ఆశ్చర్యపోయారు. వారు, “ఇదేమిటి? అధికార పూర్వకమైన ఈ కొత్త ఉపదేశం! ఈయన దయ్యాలను కూడా ఆజ్ఞాపిస్తున్నాడు! అవి కూడా ఈయన మాటకు లొంగుతున్నాయి!” అని తమలో తాము చర్చించుకున్నారు.
మార్కు సువార్త 1 : 28 (IRVTE)
ఆయన్ని గూర్చిన సమాచారం గలిలయ ప్రాంతమంతా త్వరగా వ్యాపించింది.
మార్కు సువార్త 1 : 29 (IRVTE)
పేతురు అత్త జ్వరం నయం చేయడం
మత్తయి 8:14, 15; లూకా 4:38, 39 సమాజ మందిరం నుండి బయటకు వచ్చిన వెంటనే వారు సీమోను, అంద్రెయల ఇంట్లో ప్రవేశించారు. యాకోబు, యోహాను కూడా వారితో ఉన్నారు.
మార్కు సువార్త 1 : 30 (IRVTE)
సీమోను అత్త జ్వరంతో మంచం పట్టి ఉంది. వెంటనే వారు ఆమె గురించి ఆయనతో చెప్పారు.
మార్కు సువార్త 1 : 31 (IRVTE)
ఆయన ఆమె దగ్గరికి వచ్చి, ఆమె చెయ్యి పట్టుకుని లేవనెత్తిన వెంటనే జ్వరం ఆమెను వదిలిపోయి, ఆమె అందరికీ సపర్యలు చేయసాగింది.
మార్కు సువార్త 1 : 32 (IRVTE)
దయ్యాలను వెళ్ళగొట్టడం, ఇతర స్వస్థతలు
మత్తయి 8:16; లూకా 4:40-41 సాయంకాలం, సూర్యుడు అస్తమించిన తరువాత ప్రజలు రోగులనూ, దయ్యాలు పట్టిన వారినీ ఆయన దగ్గరికి తీసుకువచ్చారు.
మార్కు సువార్త 1 : 33 (IRVTE)
ఆ పట్టణమంతా ఆ ఇంటి దగ్గర గుమిగూడారు.
మార్కు సువార్త 1 : 34 (IRVTE)
రకరకాల రోగాలతో ఉన్న వారిని యేసు బాగు చేశాడు. ఎన్నో దయ్యాలను వెళ్ళగొట్టాడు. తాను ఎవరో ఆ దయ్యాలకు తెలుసు గనుక ఆయన వాటిని మాట్లాడనివ్వలేదు.
మార్కు సువార్త 1 : 35 (IRVTE)
ప్రార్థన, అనేక గ్రామాల సందర్శనం ఇంకా తెల్లవారక ముందే యేసు లేచి ఆ పట్టణం బయట ఏకాంత ప్రదేశానికి వెళ్ళి అక్కడ ప్రార్థనలో గడిపాడు.
మార్కు సువార్త 1 : 36 (IRVTE)
సీమోను, అతనితో ఉన్నవారు యేసును వెదకడానికి వెళ్ళారు.
మార్కు సువార్త 1 : 37 (IRVTE)
ఆయన కనబడినప్పుడు, “అందరూ నీ కోసం వెదుకుతున్నారు” అని ఆయనతో అన్నారు.
మార్కు సువార్త 1 : 38 (IRVTE)
ఆయన వారితో, “చుట్టుపక్కల గ్రామాలకు వెళ్దాం పదండి. అక్కడ కూడా నేను ప్రకటించాలి. నేను ఈ లోకానికి వచ్చింది అందుకే” అన్నాడు.
మార్కు సువార్త 1 : 39 (IRVTE)
ఆయన గలిలయ ప్రాంతమంతటా తిరుగుతూ, యూదుల సమాజ మందిరాల్లో బోధిస్తూ, దయ్యాలను వెళ్ళగొడుతూ ఉన్నాడు.
మార్కు సువార్త 1 : 40 (IRVTE)
కుష్టురోగి శుద్ధి
మత్తయి 8:2-4; లూకా 5:12-14 ఒక కుష్టురోగి ఆయన దగ్గరికి వచ్చి ఆయన ముందు మోకరిల్లి, “నీకిష్టమైతే నన్ను బాగు చేయగలవు” అని ఆయనను బతిమాలాడు.
మార్కు సువార్త 1 : 41 (IRVTE)
యేసు అతనిపై జాలిపడి, తన చెయ్యి చాపి అతన్ని తాకి “నిన్ను బాగు చేయడం నాకిష్టమే, స్వస్థత పొందు” అన్నాడు.
మార్కు సువార్త 1 : 42 (IRVTE)
వెంటనే కుష్టురోగం అతన్ని వదలిపోయింది. అతడు శుద్ధి అయ్యాడు.
మార్కు సువార్త 1 : 43 (IRVTE)
ఆయన అతన్ని పంపివేస్తూ, “ఈ విషయం ఎవ్వరితో చెప్పవద్దు సుమా,” అని అతన్ని హెచ్చరించి,
మార్కు సువార్త 1 : 44 (IRVTE)
“నువ్వు శుద్ధుడివైనట్టు యాజకునికి కనిపించి మోషే ఆజ్ఞాపించిన ప్రకారం అర్పణలు అర్పించు” అన్నాడు.
మార్కు సువార్త 1 : 45 (IRVTE)
కానీ అతడు వెళ్ళి అందరికీ ఈ విషయం చాటించసాగాడు. ఆ కారణంగా యేసు ఆ పట్టణాల్లో బహిరంగంగా వెళ్ళలేక బయట నిర్జన ప్రదేశాల్లో ఉండిపోవలసి వచ్చింది. అందువలన వివిధ ప్రాంతాల నుండి ప్రజలే ఆయన దగ్గరికి వస్తూ ఉన్నారు.
❮
❯