మార్కు సువార్త 2 : 1 (IRVTE)
పక్షవాత రోగిని బాగు చెయ్యడం
మత్తయి 9:1-8; లూకా 5:18-26 కొద్ది రోజుల తరువాత యేసు కపెర్నహూము పట్టణానికి తిరిగి వచ్చాడు.
మార్కు సువార్త 2 : 2 (IRVTE)
ఆయన ఇంట్లో ఉన్నాడని ప్రజలకు తెలిసింది. చాలా మంది అక్కడ గుమికూడారు. తలుపు దగ్గర కూడా చోటు లేకపోయింది. యేసు వారికి ఉపదేశం చేయసాగాడు.
మార్కు సువార్త 2 : 3 (IRVTE)
నలుగురు మనుషులు ఒక పక్షవాత రోగిని మోసుకుంటూ అక్కడికి తెచ్చారు.
మార్కు సువార్త 2 : 4 (IRVTE)
ప్రజలంతా గుమికూడిన కారణంగా రోగిని ఆయనకు దగ్గరగా తీసుకురాలేకపోయారు. అందువల్ల వారు ఆయన ఉన్న గది పైకప్పు ఊడదీసి, సందుచేసి, ఆ పక్షవాత రోగిని అతని పరుపుతో సహా యేసు ముందు దించారు.
మార్కు సువార్త 2 : 5 (IRVTE)
యేసు వారి విశ్వాసం చూసి, “కుమారా, నీ పాపాలకు క్షమాపణ దొరికింది” అన్నాడు.
మార్కు సువార్త 2 : 6 (IRVTE)
అక్కడ ఉన్న కొందరు ధర్మశాస్త్ర పండితులు తమలో తాము ఇలా ఆలోచించారు,
మార్కు సువార్త 2 : 7 (IRVTE)
“అతడీ విధంగా ఎలా మాట్లాడగలడు? దైవదూషణ చేస్తున్నాడు గదా. దేవుడు తప్ప పాపాలు క్షమించ గలవారెవరు?”
మార్కు సువార్త 2 : 8 (IRVTE)
వారు లోలోపల ఇలా ఆలోచిస్తున్నారని యేసు అంతరాత్మలో గ్రహించి, వారితో ఇలా అన్నాడు, “మీరు ఎందుకు ఈ విధంగా ఆలోచిస్తున్నారు? ఏది తేలిక?
మార్కు సువార్త 2 : 9 (IRVTE)
ఈ పక్షవాత రోగితో, ‘నీ పాపాలకు క్షమాపణ దొరికింది’ అనడమా? లేక ‘లేచి నీ పడక ఎత్తుకుని నడువు’ అనడమా?
మార్కు సువార్త 2 : 10 (IRVTE)
భూలోకంలో పాపాలు క్షమించే అధికారం మనుష్య కుమారుడికి ఉందని మీరు తెలుసుకోవాలి” అని చెప్పి
మార్కు సువార్త 2 : 11 (IRVTE)
ఆ పక్షవాత రోగిని చూసి, “నువ్వు లేచి నీ పడక తీసుకుని ఇంటికి వెళ్ళమని నేను నీతో చెబుతున్నాను” అన్నాడు.
మార్కు సువార్త 2 : 12 (IRVTE)
వెంటనే ఆ పక్షవాత రోగి లేచి పడక ఎత్తుకుని, అందరూ చూస్తూ ఉండగా నడుస్తూ బయటకు వెళ్ళిపోయాడు. ఇది చూసి వారంతా విస్మయం చెంది, “మనం ఇంతవరకూ ఇలాంటిది చూడలేదే” అని దేవుణ్ణి స్తుతించారు.
మార్కు సువార్త 2 : 13 (IRVTE)
లేవీ (మత్తయి) కి పిలుపు
మత్తయి 9:9-13; లూకా 5:27-32 యేసు మళ్లీ గలిలయ సముద్ర తీరానికి వెళ్ళాడు. అనేక మంది ప్రజలు ఆయన దగ్గరికి వచ్చారు. ఆయన వారికి ఉపదేశం చేశాడు.
మార్కు సువార్త 2 : 14 (IRVTE)
ఆయన నడుస్తుండగా, దారిలో అల్ఫయి కుమారుడు లేవీని చూశాడు. అతడు పన్ను వసూలు చేసే చోట కూర్చుని ఉన్నాడు. యేసు అతనితో, “నా వెంట రా!” అని పిలిచాడు. అతడు లేచి ఆయన వెంట వెళ్ళాడు.
మార్కు సువార్త 2 : 15 (IRVTE)
యేసు లేవి ఇంట్లో భోజనం చేస్తున్నపుడు పన్ను వసూలు చేసేవారు, పాపులు, చాలామంది ఆయనతో, ఆయన శిష్యులతో కలిసి భోజనం చేస్తున్నారు. ఎందుకంటే చాలా మంది ఆయనను వెంబడిస్తున్నారు.
మార్కు సువార్త 2 : 16 (IRVTE)
అది చూసి ధర్మశాస్త్ర పండితులు, పరిసయ్యులు ఆయన శిష్యులతో, “ఈయన పాపులతో, పన్ను వసూలు చేసేవారితో కలిసి భోజనం చేస్తున్నాడేమిటి?” అన్నారు.
మార్కు సువార్త 2 : 17 (IRVTE)
యేసు ఈ మాట విని వారితో, “ఆరోగ్యంగా ఉన్నవారికి వైద్యుని అవసరం లేదు. రోగులకే వైద్యుడు అవసరం. నేను నీతిపరులను పిలవడానికి రాలేదు, పాపాత్ములను పిలవడానికే వచ్చాను” అని అన్నాడు.
మార్కు సువార్త 2 : 18 (IRVTE)
యోహాను శిష్యులు, పరిసయ్యులు ఉపవాసం చేస్తారు. వారు వచ్చి, “యోహాను శిష్యులూ, పరిసయ్యుల శిష్యులూ ఉపవాసం చేస్తారు గాని నీ శిష్యులు ఉపవాసం చెయ్యరేమిటి?” అని ఆయనను అడిగారు.
మార్కు సువార్త 2 : 19 (IRVTE)
యేసు, “పెళ్ళికొడుకు తమతో ఉన్న సమయంలో పెళ్లి వారు ఉపవాసం చేస్తారా? అతడు ఉన్నంత కాలం వారు ఉపవాసం చేయరు.
మార్కు సువార్త 2 : 20 (IRVTE)
పెళ్ళికొడుకును వారి దగ్గర నుండి తీసుకు వెళ్ళే సమయం వస్తుంది. ఆ రోజుల్లో వారు ఉపవాసం ఉంటారు.
మార్కు సువార్త 2 : 21 (IRVTE)
గుడ్డ మాసిక, ద్రాక్ష తిత్తుల ఉపమానం
మత్తయి 9:16-17; లూకా 5:36-39 “పాత బట్ట చిరుగుకు కొత్త బట్టతో ఎవరూ మాసిక వేయరు. అలా చేస్తే కొత్తది పాత దాన్ని గుంజి, చినుగు పెద్దదవుతుంది.
మార్కు సువార్త 2 : 22 (IRVTE)
పాత తిత్తుల్లో కొత్త ద్రాక్షారసం ఎవరూ పోయరు. అలా పోస్తే కొత్త ద్రాక్షరసం వల్ల ఆ తిత్తులు చినిగిపోతాయి. కొత్త ద్రాక్షరసం కొత్త తిత్తుల్లోనే పోయాలి” అని వారితో అన్నాడు.
మార్కు సువార్త 2 : 23 (IRVTE)
యేసు సబ్బాతుకు కూడా ప్రభువు
మత్తయి 12:1-8; లూకా 6:1-5 విశ్రాంతి దినాన ఆయన పంట చేలలో నడుస్తూ ఉన్నాడు. ఆయన శిష్యులు తాము తినడానికి కొన్ని ధాన్యం కంకులను తుంచారు.
మార్కు సువార్త 2 : 24 (IRVTE)
పరిసయ్యులు, “చూడు, నీ శిష్యులు విశ్రాంతి దినాన చేయకూడని పని ఎందుకు చేస్తున్నారు?” అని ఆయనను అడిగారు.
మార్కు సువార్త 2 : 25 (IRVTE)
అందుకాయన వారితో ఇలా అన్నాడు, “దావీదు, అతనితో ఉన్నవారు అవసరంలో ఆకలిగా ఉన్నప్పుడు అతడు చేసింది మీరు చదవలేదా?
మార్కు సువార్త 2 : 26 (IRVTE)
అబ్యాతారు ప్రధాన యాజకుడిగా ఉన్నప్పుడు దావీదు దేవుని మందిరంలో ప్రవేశించి యాజకులు తప్ప మరెవ్వరూ తినకూడని సన్నిధి రొట్టెలు తిని తనతో ఉన్నవారికి పెట్టలేదా?” అన్నాడు.
మార్కు సువార్త 2 : 27 (IRVTE)
ఆయన మళ్ళీ వారితో ఇలా అన్నాడు, “విశ్రాంతి దినం మనుషుల కోసమేగాని మనుషులు విశ్రాంతి దినం కోసం కాదు.
మార్కు సువార్త 2 : 28 (IRVTE)
అందుచేత మనుష్య కుమారుడు విశ్రాంతి దినానికి కూడా ప్రభువే!” అని వారితో చెప్పాడు.
❮
❯