మార్కు సువార్త 5 : 1 (IRVTE)
గదరా ప్రదేశంలో ఉన్మాది
మత్తయి 8:28-34; లూకా 8:26-37
వారు సముద్రం దాటి అవతలి ఒడ్డున ఉన్న గెరాసేను ప్రాంతానికి వెళ్ళారు.
మార్కు సువార్త 5 : 2 (IRVTE)
యేసు పడవ దిగగానే దయ్యం పట్టిన వాడొకడు స్మశానం నుండి ఆయన దగ్గరికి వచ్చాడు.
మార్కు సువార్త 5 : 3 (IRVTE)
వాడు స్మశానంలోనే నివసించేవాడు. ఇనప గొలుసులతో సైతం వాణ్ణి ఎవ్వరూ కట్టెయ్యలేకపోయారు.
మార్కు సువార్త 5 : 4 (IRVTE)
వాడి చేతులు, కాళ్ళు ఎన్నిసార్లు గొలుసులతో సంకెళ్ళతో కట్టినా ఆ సంకెళ్ళను తెంపి, కట్లను చిందరవందర చేసే వాడు. వాణ్ణి అదుపు చేసే శక్తి ఎవరికీ లేదు.
మార్కు సువార్త 5 : 5 (IRVTE)
వాడు స్మశానంలో, కొండల మీదా రేయింబవళ్ళు తిరుగుతూ పెద్దగా కేకలు పెడుతూ తన శరీరాన్ని గాయపరచుకొనేవాడు.
మార్కు సువార్త 5 : 6 (IRVTE)
వాడు యేసును దూరం నుండి చూసి పరుగెత్తుకు వచ్చి ఆయన ముందు మోకరించి నమస్కారం చేశాడు.
మార్కు సువార్త 5 : 7 (IRVTE)
“యేసూ, మహోన్నత దేవుని కుమారా! నాతో నీకేం పని? దేవుని పేరిట నిన్ను బతిమాలుతున్నాను, నన్ను బాధ పెట్టవద్దు!” అని అన్నాడు.
మార్కు సువార్త 5 : 8 (IRVTE)
ఎందుకంటే యేసు అతనితో, “అపవిత్రాత్మా! ఈ మనిషిని వదలి బయటకు రా!” అని అన్నాడు.
మార్కు సువార్త 5 : 9 (IRVTE)
ఆయన, “నీ పేరేమిటి?” అని అతణ్ణి అడిగాడు. “నా పేరు సేన, మేము చాలా మందిమి,” అని అతడు సమాధానం చెప్పాడు.
మార్కు సువార్త 5 : 10 (IRVTE)
అతడు ఆ ప్రాంతం నుండి వాటిని పంపివేయవద్దని ఎంతో బతిమాలాడు.
మార్కు సువార్త 5 : 11 (IRVTE)
ఆ కొండ పక్కన పెద్ద పందుల గుంపు మేస్తూ ఉంది.
మార్కు సువార్త 5 : 12 (IRVTE)
ఆ దయ్యాలు యేసుతో, “మమ్మల్ని ఆ పందుల గుంపులో చొరబడడానికి అనుమతి ఇవ్వు” అని వేడుకున్నాయి.
మార్కు సువార్త 5 : 13 (IRVTE)
యేసు వాటికి అనుమతి ఇచ్చాడు. దయ్యాలు అతణ్ణి వదిలి ఆ పందుల్లోకి చొరబడ్డాయి. ఆ మందలో సుమారు రెండు వేల పందులు ఉన్నాయి. అవి వాలుగా ఉన్న కొండమీద నుండి వేగంగా పరుగెత్తి సముద్రంలో పడి మునిగి చచ్చాయి.
మార్కు సువార్త 5 : 14 (IRVTE)
ఆ పందులు మేపేవారు పారిపోయి పట్టణంలో, పల్లెప్రాంతాల్లో ఈ సంగతి చెప్పారు. ప్రజలు జరిగినదాన్ని చూడాలని వచ్చారు.
మార్కు సువార్త 5 : 15 (IRVTE)
వారు యేసు దగ్గరికి వచ్చినప్పుడు దయ్యాల సేన పట్టిన వాడు బట్టలు వేసుకుని బుద్ధిగా కూర్చుని ఉండడం గమనించారు. వారికి భయం వేసింది.
మార్కు సువార్త 5 : 16 (IRVTE)
అదంతా స్వయంగా చూసినవారు, దయ్యాలు పట్టిన వాడికి జరిగిన దాన్ని గురించి, పందుల గురించి అందరికీ చెప్పారు.
మార్కు సువార్త 5 : 17 (IRVTE)
వారు యేసును తమ ప్రాంతం విడిచి వెళ్ళమని వేడుకున్నారు.
మార్కు సువార్త 5 : 18 (IRVTE)
యేసు పడవ ఎక్కుతూ ఉండగా దయ్యాలు పట్టినవాడు వచ్చి తనను కూడా వెంట రానిమ్మని బతిమాలాడు.
మార్కు సువార్త 5 : 19 (IRVTE)
కాని యేసు దానికి అంగీకరించకుండా అతనితో, “నువ్వు ఇంటికి తిరిగి వెళ్ళి ప్రభువు నీకు చేసినదాని గురించీ నీపై చూపిన దయ గురించీ నీ వారికి చెప్పు” అని అన్నాడు.
మార్కు సువార్త 5 : 20 (IRVTE)
అతడు వెళ్ళి, యేసు తనకు చేసిన గొప్ప కార్యం గురించి దెకపొలి ప్రాంతంలో ప్రకటించాడు. అందరికీ ఎంతో ఆశ్చర్యం కలిగింది.
మార్కు సువార్త 5 : 21 (IRVTE)
రక్త స్రావం గల స్త్రీకి స్వస్థత, యాయీరు కుమార్తెకు ప్రాణ దానం
మత్తయి 9:18-26; లూకా 8:41-56
యేసు పడవ ఎక్కి సముద్రం అవతలి ఒడ్డుకు చేరుకున్నాడు. ఆయన సముద్రం ఒడ్డున ఉండగానే పెద్ద జనసమూహం ఆయన దగ్గర చేరింది.
మార్కు సువార్త 5 : 22 (IRVTE)
అప్పుడు యూదుల సమాజ మందిరం అధికారి ఒకడు వచ్చి యేసు పాదాల దగ్గర పడి
మార్కు సువార్త 5 : 23 (IRVTE)
“నా కూతురు చావు బతుకుల్లో ఉంది. దయచేసి నీవు వచ్చి నీ చేతులు ఆమె మీద ఉంచు. ఆమె బాగుపడి బతుకుతుంది” అని దీనంగా వేడుకున్నాడు.
మార్కు సువార్త 5 : 24 (IRVTE)
యేసు అతని వెంట వెళ్ళాడు. పెద్ద జనసమూహం ఆయన మీద పడుతూ ఆయన వెంట వెళ్ళింది.
మార్కు సువార్త 5 : 25 (IRVTE)
పన్నెండు సంవత్సరాల నుండి రక్తస్రావ రోగంతో ఉన్న ఒక స్త్రీ ఆ సమూహంలో ఉంది.
మార్కు సువార్త 5 : 26 (IRVTE)
ఆమె చాలామంది వైద్యుల దగ్గరికి వెళ్ళింది. కాని, ఆమె బాధ తగ్గలేదు. తన డబ్బంతా ఖర్చు చేసింది. అయినా జబ్బు నయం కావడానికి బదులు ఆమె పరిస్థితి ఇంకా క్షీణించింది.
మార్కు సువార్త 5 : 27 (IRVTE)
యేసు బాగు చేస్తాడని విని, సమూహంలో నుండి యేసు వెనుకగా వచ్చింది.
మార్కు సువార్త 5 : 28 (IRVTE)
తన మనసులో, “నేను ఆయన బట్టలు తాకితే చాలు, నాకు నయమౌతుంది” అని అనుకుని, ఆయన వెనకగా వచ్చి ఆయన వస్త్రం తాకింది.
మార్కు సువార్త 5 : 29 (IRVTE)
వెంటనే ఆమె రక్తస్రావం ఆగిపోయింది. తన జబ్బు పూర్తిగా నయమైందని ఆమె గ్రహించింది.
మార్కు సువార్త 5 : 30 (IRVTE)
వెంటనే యేసు తనలో నుండి శక్తి బయలువెళ్ళిందని గ్రహించి, ప్రజలవైపు తిరిగి, “నా బట్టలు తాకినదెవరు?” అని అన్నాడు.
మార్కు సువార్త 5 : 31 (IRVTE)
ఆయన శిష్యులు, “ఇంతమంది నీ మీద పడుతున్నారు గదా! అయినా ‘నన్ను తాకినది ఎవరు?’ అంటున్నావేమిటి!” అన్నారు.
మార్కు సువార్త 5 : 32 (IRVTE)
కాని యేసు, తనను తాకిన వారికోసం చుట్టూ చూశాడు.
మార్కు సువార్త 5 : 33 (IRVTE)
ఆ స్త్రీ తాను బాగుపడ్డానని గ్రహించి, భయంతో వణుకుతూ వచ్చి యేసు కాళ్ళపై పడి, జరిగిందంతా చెప్పింది.
మార్కు సువార్త 5 : 34 (IRVTE)
ఆయన ఆమెతో, “అమ్మాయీ! నీ విశ్వాసమే నిన్ను బాగుచేసింది. రోగనివారణ కలిగి శాంతిగా తిరిగి వెళ్ళు” అన్నాడు.
మార్కు సువార్త 5 : 35 (IRVTE)
యేసు ఇంకా మాట్లాడుతుండగా, యూదుల సమాజ మందిరం అధికారి యాయీరు ఇంటి నుండి కొందరు వచ్చి యాయీరుతో, “నీ కూతురు చనిపోయింది. ఇంక గురువుకు బాధ కలిగించడం ఎందుకు?” అని అన్నారు.
మార్కు సువార్త 5 : 36 (IRVTE)
యేసు వారి మాటలు పట్టించుకోకుండా, వెంటనే సమాజ మందిరం అధికారితో, “భయపడకు, నమ్మకం మాత్రం ఉంచు” అన్నాడు.
మార్కు సువార్త 5 : 37 (IRVTE)
అప్పుడాయన పేతురును, యాకోబును, యాకోబు సోదరుడు యోహానును తప్ప ఎవ్వరినీ తన వెంట రానివ్వలేదు.
మార్కు సువార్త 5 : 38 (IRVTE)
ఆయన యాయీరు ఇంటికి వచ్చినప్పుడు అక్కడ ఉన్నవారు బిగ్గరగా ఏడుస్తూ, రోదిస్తూ ఉండడం యేసు చూశాడు.
మార్కు సువార్త 5 : 39 (IRVTE)
ఆయన ఇంట్లోకి వెళ్ళి వాళ్లతో, “ఎందుకు గాభరా పడుతున్నారు? ఎందుకు ఏడుస్తున్నారు? ఆమె చనిపోలేదు, నిద్రలో ఉంది, అంతే” అన్నాడు.
మార్కు సువార్త 5 : 40 (IRVTE)
కాని, వారు ఆయనను హేళన చేశారు. యేసు వారందర్నీ బయటకు పంపిన తరువాత ఆమె తండ్రిని, తల్లిని, తనతో ఉన్న శిష్యులను వెంటబెట్టుకుని ఆమె ఉన్న గదిలోకి వెళ్ళాడు.
మార్కు సువార్త 5 : 41 (IRVTE)
ఆమె చెయ్యి తన చేతిలోకి తీసుకుని, “తలితా కుమీ!” అని అన్నాడు. ఆ మాటకు, “చిన్నపాపా! నీతో నేనంటున్నాను, లే!” అని అర్థం.
మార్కు సువార్త 5 : 42 (IRVTE)
వెంటనే ఆమె లేచి నడిచింది. ఆమె వయస్సు పన్నెండేళ్ళు. ఇది చూసి వారికి చాలా ఆశ్చర్యం కలిగింది.
మార్కు సువార్త 5 : 43 (IRVTE)
ఈ సంగతి ఎవ్వరికి చెప్పవద్దని ఆయన వారికి గట్టిగా ఆజ్ఞాపించాడు. ఆ అమ్మాయికి తినడానికి ఏదైనా ఇవ్వమని వారితో చెప్పాడు.

1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43