నహూము 3 : 1 (IRVTE)
నీనెవేకి బాధ నరహత్య చేసిన పట్టణమా, నీకు బాధ తప్పదు. అది నిరంతరం అబద్ధాలతో దొంగిలించి తెచ్చిన వస్తువులతో నిండి ఉంది. దాని చేతుల్లో హతమైన వారు దానిలో ఉన్నారు.
నహూము 3 : 2 (IRVTE)
రథసారధి చేసే కొరడా శబ్దం, రథ చక్రాల ధ్వని, గుర్రాల అడుగుల శబ్దం, వేగంగా పరిగెత్తే రథాల శబ్దం వినబడుతున్నాయి.
నహూము 3 : 3 (IRVTE)
రౌతులు వేగంగా పరుగెత్తుతున్నారు, కత్తులు, ఈటెలు తళతళ మెరుస్తున్నాయి. శవాలు కుప్పలుగా పడి ఉన్నాయి. కూలిన శవాలకు లెక్కే లేదు, శవాలు కాళ్ళకు తగిలి దాడి చేసే వారు తొట్రుపడుతున్నారు.
నహూము 3 : 4 (IRVTE)
ఇందుకు కారణం, అది మంత్ర విద్యలో ఆరితేరిన అందమైన వేశ్య జరిగించిన కామ క్రీడలే. ఆమె తన జారత్వంతో జాతులను అమ్మేసింది. తన ఇంద్రజాలంతో మనుషులను వశపరచుకుంది.
నహూము 3 : 5 (IRVTE)
సేనల ప్రభువు యెహోవా చెప్పేదేమిటంటే “నేను నీకు విరోధిని. నీ బట్టలు నీ ముఖం పైకి ఎత్తి ప్రజలకు నీ మర్మాంగాలను చూపిస్తాను. రాజ్యాలకు నీ అవమానాన్ని బట్టబయలు చేస్తాను.
నహూము 3 : 6 (IRVTE)
నీ ముఖంపై పెంట విసిరి చూసేవారు నిన్ను ఏవగించుకునేలా చేస్తాను.
నహూము 3 : 7 (IRVTE)
అప్పుడు నిన్ను చూసేవారంతా నీ దగ్గర నుండి పారిపోతారు. ‘నీనెవె పాడైపోయింది. దాని కోసం ఎవరు విలపిస్తారు? నిన్ను ఓదార్చేవాళ్ళు ఎక్కడ దొరుకుతారు’ అంటారు.”
నహూము 3 : 8 (IRVTE)
చుట్టూ నీటితో సముద్రాన్నే తనకు కావలిగా, సరిహద్దుగా చేసుకుని, నైలు నది దగ్గర ఉన్న తేబేసు* తేబేసు నో అమోస్ అనేది హీబ్రూభాషలో (ఈజిప్టు రాజధాని) పట్టణం కంటే నువ్వు గొప్పదానివా?
నహూము 3 : 9 (IRVTE)
ఇతియోపియా, ఈజిప్టు దేశాలు దానికి అండ. పూతు, లిబియా దాని మిత్ర పక్షాలు.
నహూము 3 : 10 (IRVTE)
అయినప్పటికీ దాని నివాసులు బందీలయ్యారు. పురవీధుల్లో శత్రువులు దానిలోని చిన్నపిల్లలను బండలకు కొట్టి చంపారు. ప్రముఖుల మీద చీట్లు వేశారు, దాని ప్రధానులనందరినీ సంకెళ్లతో బంధించారు.
నహూము 3 : 11 (IRVTE)
నీకు కూడా మత్తు ఎక్కుతుంది. నువ్వు దాక్కుంటావు. నీ మీదికి శత్రువు రావడం చూసి ఆశ్రయం కోసం వెదకుతావు.
నహూము 3 : 12 (IRVTE)
అయితే నీ కోటలన్నీ అకాలంలో పండిన కాయలున్న అంజూరపు చెట్లలాగా ఉన్నాయి. ఎవరైనా ఒకడు వాటిని ఊపితే చాలు, పండ్లు తిందామని వచ్చినవాడి నోట్లో పడతాయి.
నహూము 3 : 13 (IRVTE)
నీ నివాసులు స్త్రీల వంటి వారు. నీ దేశపు ద్వారాలు శత్రువులకు తెరిచి ఉన్నాయి. ద్వారాల అడ్డకర్రలు కాలిపోయాయి.
నహూము 3 : 14 (IRVTE)
వారు ముట్టడించే సమయానికి నీళ్లు చేదుకో. నీ కోటలను దిట్టపరచుకో. బంకమట్టిలోకి దిగి ఇటుకల కోసం బురద తొక్కు. కొలిమి సిద్ధం చేసుకో.
నహూము 3 : 15 (IRVTE)
అక్కడే నిన్ను అగ్ని కాల్చివేస్తుంది. కత్తివాత పడి నువ్వు నాశనం అవుతావు. గొంగళిపురుగు తినివేసే విధంగా అది నిన్ను నాశనం చేస్తుంది. గొంగళిపురుగులంత విస్తారంగా, మిడతలంత విస్తారంగా నీ సంఖ్యను పెంచుకో.
నహూము 3 : 16 (IRVTE)
నీ వర్తకుల సంఖ్య లెక్కకు ఆకాశ నక్షత్రాలకంటే ఎక్కువగా ఉన్నప్పటికీ వాళ్ళు మిడతల్లాగా వచ్చి దోచుకుని ఎగిరిపోతారు.
నహూము 3 : 17 (IRVTE)
నీ వీరులు లెక్కకు మిడతలంత విస్తారంగా ఉన్నారు. నీ సేనానులు చలికాలంలో కంచెల్లో దిగిన మిడతల్లాగా ఉన్నారు. ఎండ కాసినప్పుడు అవన్నీ ఎగిరిపోతాయి. అవి ఎక్కడికి వెళ్లి వాలతాయో ఎవరికీ తెలియదు.
నహూము 3 : 18 (IRVTE)
అష్షూరు రాజా, నీ సంరక్షకులు నిద్రపోయారు. నీ ప్రధానులు విశ్రాంతిలో ఉన్నారు. నీ ప్రజలు పర్వతాల్లోకి చెదరిపోయారు. వారిని తిరిగి సమకూర్చేవాడు ఒక్కడు కూడా లేదు.
నహూము 3 : 19 (IRVTE)
నీకు తగిలిన దెబ్బ తీవ్రమైనది. నీ గాయాన్ని ఎవ్వరూ బాగు చెయ్యలేరు. నిన్ను గూర్చిన వార్త విన్న వాళ్ళంతా నీకు జరిగిన దానికి సంతోషంతో చప్పట్లు కొడతారు. ఎందుకంటే ప్రజలంతా నీచేత ఎడతెగకుండా హింసల పాలయ్యారు.
❮
❯
1
2
3
4
5
6
7
8
9
10
11
12
13
14
15
16
17
18
19