నెహెమ్యా 4 : 1 (IRVTE)
నెహెమ్యా కుట్రను ఎదుర్కొవడం మేము గోడలు నిలబెట్టడం మొదలు పెట్టిన విషయం సన్బల్లటుకు తెలిసింది. అతడు తీవ్ర కోపంతో మండిపడుతూ యూదులను ఎగతాళి చేశాడు.
నెహెమ్యా 4 : 2 (IRVTE)
షోమ్రోను సైన్యం వారితో, తన స్నేహితులతో ఇలా అన్నాడు. “అల్పులైన ఈ యూదులు ఏం చేయగలరు? తమంత తామే ఈ పట్టణాన్ని తిరిగి కట్టగలరా? బలులు అర్పించి బలం తెచ్చుకుని ఒక్క రోజులోనే పని పూర్తి చేస్తారా? కాలిపోయిన శిథిలాల కుప్పల నుండి ఏరిన రాళ్ళను పునాదులుగా వాడతారా?”
నెహెమ్యా 4 : 3 (IRVTE)
అమ్మోనీయుడు టోబీయా అతని దగ్గరుండి “వీళ్ళు కట్టిన గోడపై ఒక నక్క ఎగిరితే ఆ గాలికి గోడ పడిపోతుంది” అన్నాడు.
నెహెమ్యా 4 : 4 (IRVTE)
“మా దేవా, మా ప్రార్థన విను. మేము తృణీకారానికి గురి అయిన వాళ్ళం. వారు మాపై వేసే నిందలు వారి మీదికే వచ్చేలా చెయ్యి. వారు ఓడిపోవాలి. వారు బందీలుగా పోయే దేశంలో శత్రువులు వారిని దోచుకోవాలి.
నెహెమ్యా 4 : 5 (IRVTE)
వారు ఆలయం కట్టే వారిని ఆటంకపరచి నీకు కోపం తెప్పించారు. కాబట్టి వారి దోషాన్ని బట్టి వారిని విడిచిపెట్టవద్దు. నీ దృష్టిలో నుంచి వారి పాపాన్ని తీసివేయ వద్దు.”
నెహెమ్యా 4 : 6 (IRVTE)
అయినప్పటికీ పని కొనసాగించడానికి ప్రజలు ఇష్టపడి సిద్ధమయ్యారు. మేము గోడ కడుతూ ఉన్నాం. గోడ నిర్మాణం సగం ఎత్తు వరకూ పూర్తి అయింది.
నెహెమ్యా 4 : 7 (IRVTE)
యెరూషలేం గోడల నిర్మాణం జరుగుతూ ఉందని, కూలిన గోడలను సరిగా కడుతున్నారని, సన్బల్లటు, టోబీయా, అరబ్బులు, అమ్మోను వారు, అష్డోదు వారు తెలుసుకుని మండిపడ్డారు.
నెహెమ్యా 4 : 8 (IRVTE)
జరుగుతున్న పనిని ఆటంకపరచాలని యెరూషలేం మీదికి దొమ్మీగా వచ్చి మమ్మల్ని కలవరానికి గురి చేశారు.
నెహెమ్యా 4 : 9 (IRVTE)
మేము మా దేవునికి ప్రార్థన చేసి, వాళ్ళ బెదిరింపుల వల్ల రాత్రింబగళ్లు కాపలా ఉంచాము.
నెహెమ్యా 4 : 10 (IRVTE)
అప్పుడు యూదా వాళ్ళు “బరువులు మోసేవారి శక్తి తగ్గిపోయింది, శిథిలాల కుప్పలు ఎక్కువై పోయాయి. గోడ కట్టడం కుదరదు” అన్నారు.
నెహెమ్యా 4 : 11 (IRVTE)
మా విరోధులు “వాళ్ళకు తెలియకుండా, వాళ్ళు చూడకుండా మనం వారి మధ్యలోకి చొరబడి వారిని చంపేసి, పని జరగకుండా చేద్దాం” అనుకున్నారు.
నెహెమ్యా 4 : 12 (IRVTE)
మా శత్రువులు ఉండే ప్రాంతాల్లో ఉంటున్న యూదులు, నాలుగు దిక్కుల నుండి వచ్చి మాకు సహాయం చేయాలని పదే పదే అడిగారు.
నెహెమ్యా 4 : 13 (IRVTE)
అందువల్ల గోడ వెనక ఉన్న పల్లంలో, గోడ పైనా మనుషులకు కత్తులు, ఈటెలు, విల్లు, బాణాలు ఇచ్చి వారి వారి వంశాల ప్రకారం వరసలో నిలబెట్టాను.
నెహెమ్యా 4 : 14 (IRVTE)
నేను లేచి, ప్రధానులను, అధికారులను సమకూర్చి “మీరు వాళ్లకు భయపడకండి. అత్యంత ప్రభావశాలి, భీకరుడైన యెహోవాను జ్ఞాపకం చేసుకొనండి. మీ సహోదరులు, మీ కుమారులు, మీ కుమార్తెలు, మీ భార్యలు, మీ నివాసాలు శత్రువుల వశం కాకుండా వారితో పోరాడండి” అన్నాను.
నెహెమ్యా 4 : 15 (IRVTE)
వాళ్ళు చేస్తున్న పన్నాగం మాకు తెలిసిందనీ, దేవుడు దాన్ని వమ్ము చేశాడనీ మా శత్రువులు గ్రహించారు. మేమంతా ఎవరి పని కోసం వారు గోడ దగ్గరికి చేరుకొన్నాం.
నెహెమ్యా 4 : 16 (IRVTE)
అప్పటినుండి పనివాళ్ళలో సగం మంది పనిచేస్తుండగా, మరో సగం మంది ఈటెలు, శూలాలు, విల్లంబులు, కవచాలు ధరించుకుని నిలబడ్డారు. గోడ కట్టే యూదు ప్రజల వెనుక అధికారులు వంశాల క్రమంలో నిలబడ్డారు.
నెహెమ్యా 4 : 17 (IRVTE)
గోడ కట్టేవారు, బరువులు మోసేవారు, ఎత్తేవారు ప్రతి ఒక్కరూ ఒక చేత్తో ఆయుధం పట్టుకుని మరో చేత్తో పని చేస్తున్నారు.
నెహెమ్యా 4 : 18 (IRVTE)
కట్టే పనిలో ఉన్నవాళ్ళు ప్రతి ఒక్కడూ తమ కత్తులు నడుముకు కట్టుకుని పని చేస్తున్నారు. బాకా ఊదేవాడు నా పక్కనే నిలబడి ఉన్నాడు.
నెహెమ్యా 4 : 19 (IRVTE)
అప్పుడు నేను ప్రధానులతో, అధికారులతో, మిగిలిన వారితో ఇలా అన్నాను. “మనం చేస్తున్న పని చాలా విలువైనది. గోడ మీద పని చేస్తూ మనం ఒకరికి ఒకరం దూరంగా ఉన్నాం.
నెహెమ్యా 4 : 20 (IRVTE)
కాబట్టి ఎక్కడైతే మీకు బూర శబ్దం వినిపిస్తుందో అక్కడ ఉన్న మా దగ్గరికి రండి. మన దేవుడు మన పక్షంగా యుద్ధం చేస్తాడు.”
నెహెమ్యా 4 : 21 (IRVTE)
ఆ విధంగా మేము పనిచేస్తూ వచ్చాం. సగం మంది ఉదయం నుండి రాత్రి నక్షత్రాలు కనిపించే వరకూ ఈటెలు పట్టుకుని నిలబడ్డారు.
నెహెమ్యా 4 : 22 (IRVTE)
ఆ సమయంలో నేను ప్రజలతో “ప్రతి వ్యక్తీ తన పనివాళ్ళతో కలసి యెరూషలేంలోనే బస చెయ్యాలి. అప్పుడు వాళ్ళు రాత్రి సమయంలో మాకు కావలిగా ఉంటారు, పగటి సమయంలో పని చేస్తారు” అని చెప్పాను.
నెహెమ్యా 4 : 23 (IRVTE)
ఈ విధంగా నేను గానీ, నా బంధువులు గానీ, నా సేవకులు గానీ, నా వెంట ఉన్న కాపలావాళ్ళు గానీ బట్టలు విప్పలేదు. దాహం తీర్చుకోవడానికి వెళ్ళినా సరే, ఆయుధం వదిలి పెట్టలేదు.

1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23