నెహెమ్యా 6 : 1 (IRVTE)
నెహెమ్యా మీద అసత్య ప్రచారం నేను పగుళ్ళు ఏవీ లేకుండా గోడలు కట్టే పని పూర్తి చేశాను. ఇంకా తలుపులు నిలబెట్టలేదు. ఈ విషయం సన్బల్లటుకూ, టోబీయాకూ, అరబ్బు వాడు గెషెంకూ, ఇంకా మా శత్రువుల్లో మిగతా వారికి తెలిసింది.
నెహెమ్యా 6 : 2 (IRVTE)
సన్బల్లటు, గెషెంలు నాకు ఎలాగైనా కీడు తలపెట్టాలని చూశారు. “ఓనో మైదానంలో ఎదో ఒక చోట మనం కలుసుకుందాం, రండి” అని మాకు కబురు పంపారు.
నెహెమ్యా 6 : 3 (IRVTE)
అప్పుడు నేను “నేను చేస్తున్న పని మహత్తరమైనది. ఆ పని ఆపేసి మీ దగ్గరికి ఎందుకు రావాలి?” అని నా మనుషులతో జవాబు పంపాను.
నెహెమ్యా 6 : 4 (IRVTE)
వాళ్ళు అదే విధంగా నాలుగుసార్లు నాకు కబురు పంపించారు, నేను కూడా ముందు చెప్పినట్టుగానే జవాబిచ్చాను.
నెహెమ్యా 6 : 5 (IRVTE)
ఐదవసారి సన్బల్లటు తన పనివాడి ద్వారా ఒక బహిరంగ లేఖ నాకు పంపించాడు.
నెహెమ్యా 6 : 6 (IRVTE)
ఆ ఉత్తరంలో “యూదులపై రాజుగా ఉండాలని నువ్వు సరిహద్దు గోడలు కడుతున్నావు. ఆ కారణం వల్ల నువ్వు, యూదులు కలసి రాజు మీద తిరుగుబాటు చేయాలనుకుంటున్నారు.
నెహెమ్యా 6 : 7 (IRVTE)
‘యూదులకు రాజు ఉన్నాడు’ అని నిన్ను గూర్చి ప్రకటించడానికి యెరూషలేంలో కొందరు ప్రవక్తలను నువ్వు నియమించావని, ఇంకా ఇతర విషయాలు రాజుకు తెలిశాయన్న పుకార్లు బయలుదేరాయి. అన్య జాతుల ప్రజల మధ్య ఈ పుకార్లు గెషెం లేవదీస్తున్నాడని తెలిసింది. కాబట్టి ఈ విషయాలన్నీ ఆలోచించడానికి మనం కలుసుకుందాం” అని రాసి ఉంది.
నెహెమ్యా 6 : 8 (IRVTE)
ఇలా చేస్తే మేము బెదిరిపోయి పని చేయలేక నీరసించిపోతాం అని వాళ్ళు భావించారు.
నెహెమ్యా 6 : 9 (IRVTE)
“మేము ఎప్పటికీ ఇలాంటి పనులు చెయ్యం. వీటన్నిటినీ నీ మనస్సులో నువ్వే కల్పించుకున్నావు” అని అతనికి జవాబు పంపాను. దేవా, ఇప్పుడు నా చేతులకు బలమియ్యి.
నెహెమ్యా 6 : 10 (IRVTE)
తరువాత మెహేతబేలు మనవడు దెలాయ్యా కొడుకు షెమయా యింటికి వచ్చాను. అతణ్ణి అతడి ఇంట్లోనే నిర్బంధించారు. అతడు “రాత్రివేళ నిన్ను చంపడానికి వాళ్ళు వస్తారు, మనం దేవుని మందిరం లోపలికి వెళ్లి తలుపులు వేసుకుందాం రా” అని నాతో అన్నాడు.
నెహెమ్యా 6 : 11 (IRVTE)
నేను “నాలాంటి వాడు పారిపోవచ్చా? ఇంతటి వాడినైన నేను నా ప్రాణం కాపాడుకోవడానికి ఆలయం లోపలి భాగంలోకి వెళ్ళవచ్చా? నేను ఆలయంలోకి రాను” అన్నాను.
నెహెమ్యా 6 : 12 (IRVTE)
అప్పుడు షెమయా ద్వారా దేవుడు ఈ మాట చెప్పించలేదనీ, టోబీయా, సన్బల్లటులు అతనికి డబ్బిచ్చి నా గురించి ఇలా చెప్పించారనీ స్పష్టంగా తెలుసుకున్నాను.
నెహెమ్యా 6 : 13 (IRVTE)
నన్ను భయపెట్టడానికి వారు అలా చేశారు. అతడు చెప్పినట్టు చేసి నేను పాపంలో పడిపోతానని వాళ్ళు భావించారు. నేనలా చేస్తే నా పేరు పాడు చేసి, నన్ను అవమాన పరచవచ్చు అని వారి ఉద్దేశం. నాకు వ్యతిరేకంగా వారు చేసిన పనులన్నీ గుర్తుంచుకో.
నెహెమ్యా 6 : 14 (IRVTE)
నా దేవా, టోబీయా, సన్బల్లటులను గుర్తుంచుకో. నన్ను భయపెట్టాలని చూస్తున్న నోవద్యా అనే స్త్రీ ప్రవక్తను, తక్కిన ప్రవక్తలను జ్ఞాపకం చేసుకో.
నెహెమ్యా 6 : 15 (IRVTE)
గోడలు కట్టడం పూర్తి ఈ విధంగా ఏలూలు నెల 25 వ తేదీన, అంటే 52 రోజులకు సరిహద్దు గోడలు కట్టడం పూర్తి అయింది.
నెహెమ్యా 6 : 16 (IRVTE)
అయితే మా శత్రువులూ చుట్టూ ఉన్న ఇతర రాజ్యాల ప్రజలూ జరిగిన పని చూసి ఎంతో భయపడ్డారు. మా దేవుని సహాయం వల్లనే ఈ పని మొత్తం జరిగిందని వాళ్ళు తెలుసుకున్నారు.
నెహెమ్యా 6 : 17 (IRVTE)
ఆ రోజుల్లో యూదుల ప్రముఖులు టోబీయాకు మాటిమాటికీ ఉత్తరాలు రాశారు. అతడు కూడా వాళ్ళకు జవాబులు రాస్తున్నాడు.
నెహెమ్యా 6 : 18 (IRVTE)
అతడు ఆరహు కొడుకు, షెకన్యాకు అల్లుడు. అదీకాక, అతని కొడుకు యోహానాను బెరెక్యా కొడుకు మెషుల్లాము కూతుర్ని పెళ్లి చేసుకున్నాడు. కాబట్టి యూదుల్లో చాలామంది అతని పక్షంగా ఉంటామని ప్రమాణం చేశారు.
నెహెమ్యా 6 : 19 (IRVTE)
వాళ్ళు నా సమక్షంలో అతడి మంచి లక్షణాల గురించి చెబుతూ వచ్చారు. నేను చెప్పిన మాటలు కూడా అతనికి తెలియజేశారు. నన్ను భయపెట్టడానికే టోబీయా ఉత్తరాలు పంపాడు.
❮
❯
1
2
3
4
5
6
7
8
9
10
11
12
13
14
15
16
17
18
19