సంఖ్యాకాండము 16 : 1 (IRVTE)
కోరహు, దాతాను, అబీరాము లేవీ మునిమనవడు, కహాతు మనవడు, ఇస్హారు కొడుకు కోరహు, రూబేనీయుల్లో ఏలీయాబు కొడుకులు దాతాను, అబీరాము, పేలెతు కొడుకు ఓనుతో కలిసి
సంఖ్యాకాండము 16 : 2 (IRVTE)
ఇశ్రాయేలీయుల్లో పేరు పొందిన 250 మంది నాయకులతో సహా మోషే మీద తిరుగుబాటుగా లేచి
సంఖ్యాకాండము 16 : 3 (IRVTE)
మోషే అహరోనులకు విరోధంగా సమకూడారు. “మీరు చాలా ఎక్కువ అధికారం చలాయిస్తున్నారు. ఈ సమాజంలో ఉన్న వారిందరూ పవిత్రులే. అందరూ యెహోవా కోసం ప్రత్యేకించిన వారే. యెహోవా వారి మధ్య ఉన్నాడు. యెహోవా సమాజం మీద మిమ్మల్ని మీరు ఎందుకు గొప్ప చేసుకుంటున్నారు?” అన్నారు.
సంఖ్యాకాండము 16 : 4 (IRVTE)
మోషే ఆ మాట విన్నప్పుడు, సాగిలపడ్డాడు. ఆ తరువాత అతడు కోరహుతో, అతని గుంపుతో,
సంఖ్యాకాండము 16 : 5 (IRVTE)
“ఆయన వారు ఎవరో యెహోవా కోసం ప్రత్యేకించిన వారెవరో రేపు యెహోవా తెలియజేసి అతన్ని తన సన్నిధికి రానిస్తాడు. ఆయన తాను ఏర్పరచుకున్నవాణ్ణి తన దగ్గరికి చేర్చుకుంటాడు.
సంఖ్యాకాండము 16 : 6 (IRVTE)
కోరహు, నువ్వూ నీ గుంపూ ఇలా చెయ్యండి, మీరు ధూపార్తులు తీసుకుని వాటిలో నిప్పు ఉంచి రేపు యెహోవా సన్నిధిలో వాటి మీద ధూపసాంబ్రాణి వెయ్యండి.
సంఖ్యాకాండము 16 : 7 (IRVTE)
అప్పుడు యెహోవా ఎవరిని ఏర్పాటు చేసుకుంటాడో అతనే పవిత్రుడు. లేవీ కొడుకులారా, మీరు చాలా దూరం వెళ్ళారు” అన్నాడు.
సంఖ్యాకాండము 16 : 8 (IRVTE)
ఇంకా మోషే కోరహుతో “లేవీ కొడుకులారా వినండి,
సంఖ్యాకాండము 16 : 9 (IRVTE)
తన మందిరసేవ చెయ్యడానికి యెహోవా మిమ్మల్ని తన దగ్గరికి చేర్చుకోవడం చిన్న విషయమా? మీరు సమాజం ఎదుట నిలబడి వారు చెయ్యవలసిన సేవ చేసేలా ఇశ్రాయేలీయుల దేవుడు ఇశ్రాయేలీయుల సమాజంలోనుంచి మిమ్మల్ని ప్రత్యేక పరచుకోవడం మీకు తక్కువగా కనిపిస్తున్నదా?
సంఖ్యాకాండము 16 : 10 (IRVTE)
ఆయన నిన్నూ, నీతో లేవీయులైన నీ గోత్రం వారిందర్నీ చేర్చుకున్నాడు గదా. ఇప్పుడు మీరు యాజకత్వం కూడా కోరుతున్నారు.
సంఖ్యాకాండము 16 : 11 (IRVTE)
దీని కోసం నువ్వూ, నీ గుంపూ యెహోవాకు విరోధంగా పోగయ్యారు. మీరు అహరోనును ఎందుకు విమర్శిస్తున్నారు? అతడు కేవలం యెహోవాకు లోబడినవాడు” అన్నాడు.
సంఖ్యాకాండము 16 : 12 (IRVTE)
మోషే అప్పుడు ఏలీయాబు కొడుకులు దాతాను అబీరాములను పిలిపించాడు.
సంఖ్యాకాండము 16 : 13 (IRVTE)
కాని వారు “మేము రాము, ఈ అరణ్యంలో మమ్మల్ని చంపాలని * సారవంతమైన పాలు తేనెలు ప్రవహించే దేశంలో నుంచి మమ్మల్ని తీసుకు రావడం చాలదనట్టు, మామీద ప్రభుత్వం చెయ్యడానికి నీకు అధికారం కావాలా?
సంఖ్యాకాండము 16 : 14 (IRVTE)
అంతేకాదు, నువ్వు పాలు తేనెలు ప్రవహించే దేశం లోకి మమ్మల్ని తీసుకు రాలేదు. పొలాలు, ద్రాక్షతోటలు ఉన్న స్వాస్థ్యం మాకివ్వలేదు. మమ్మల్ని శుష్క ప్రియాలతో గుడ్డివారుగా చేస్తావా? మేము రాము” అన్నారు.
సంఖ్యాకాండము 16 : 15 (IRVTE)
అందుకు మోషే పట్టరాని కోపంతో, యెహోవాకు చెప్తూ “నువ్వు వారి నైవేద్యాన్ని గుర్తించ వద్దు. ఒక్క గాడిదనైనా నేను వారి దగ్గర తీసుకోలేదు. వారిలో ఎవరికీ నేను హాని చెయ్యలేదు” అన్నాడు.
సంఖ్యాకాండము 16 : 16 (IRVTE)
అప్పుడు మోషే కోరహుతో “నువ్వూ, నీ గుంపూ, అంటే నువ్వూ, నీ వారూ, అహరోను, రేపు యెహోవా సన్నిధిలో నిలబడాలి.
సంఖ్యాకాండము 16 : 17 (IRVTE)
మీలో ప్రతివాడూ తన ధూపార్తిని తీసుకుని వాటి మీద ధూప సాంబ్రాణి వేసి, ఒక్కొక్కడు తన ధూపార్తిని పట్టుకుని 250 ధూపార్తులను యెహోవా సన్నిధికి తేవాలి. నువ్వూ, అహరోను ఒక్కొక్కడు తన ధూపార్తిని తేవాలి” అని చెప్పాడు.
సంఖ్యాకాండము 16 : 18 (IRVTE)
కాబట్టి వారిల్లో ప్రతివాడూ తన ధూపార్తిని తీసుకుని వాటిలో నిప్పు ఉంచి వాటి మీద ధూప సాంబ్రాణి వేసినప్పుడు, వారూ, మోషే అహరోనులూ సన్నిధి గుడారం ద్వారం దగ్గర నిలబడ్డారు.
సంఖ్యాకాండము 16 : 19 (IRVTE)
కోరహు సన్నిధి గుడారం ద్వారం దగ్గరికి తన సమాజాన్ని వాళ్లకు విరోధంగా పోగు చేసినప్పుడు, యెహోవా మహిమ సమాజమంతటికీ కనిపించింది.
సంఖ్యాకాండము 16 : 20 (IRVTE)
అప్పుడు యెహోవా “మీరు ఈ సమాజంలోనుంచి అవతలికి వెళ్ళండి.
సంఖ్యాకాండము 16 : 21 (IRVTE)
తక్షణమే నేను వారిని కాల్చేస్తాను” అని మోషే అహరోనులతో చెప్పినప్పుడు,
సంఖ్యాకాండము 16 : 22 (IRVTE)
వారు సాగిలపడి “దేవా, సమస్త మానవాళి ఆత్మలకు దేవా, ఈ ఒక్కడు పాపం చేసినందుకు ఈ సమాజం అంతటి మీద నువ్వు కోపం చూపిస్తావా?” అని యెహోవాను వేడుకున్నారు.
సంఖ్యాకాండము 16 : 23 (IRVTE)
అప్పుడు యెహోవా మోషేకు జవాబిస్తూ,
సంఖ్యాకాండము 16 : 24 (IRVTE)
“సమాజమంతటితో చెప్పు, కోరహు, దాతాను, అబీరాముల గుడారాల చుట్టుపట్ల నుంచి వెళ్ళి పొండి” అన్నాడు.
సంఖ్యాకాండము 16 : 25 (IRVTE)
అప్పుడు మోషే లేచి, దాతాను అబీరాముల దగ్గరికి వెళ్ళినప్పుడు ఇశ్రాయేలీయుల పెద్దలు అతని వెంట వెళ్ళారు.
సంఖ్యాకాండము 16 : 26 (IRVTE)
అతడు “ఈ దుష్టుల గుడారాల దగ్గర నుంచి వెళ్ళి పొండి. మీరు వారి పాపాలన్నిట్లో పాలివారై నాశనం కాకుండా ఉండేలా వాళ్లకు కలిగినది ఏదీ ముట్టుకోకండి” అని ఆ సమాజంతో అన్నాడు.
సంఖ్యాకాండము 16 : 27 (IRVTE)
కాబట్టి వారు కోరహు, దాతాను, అబీరాముల గుడారాల దగ్గర నుంచి ఇటు అటు లేచి వెళ్ళిపోయారు. దాతాను, అబీరాము, వారి భార్యలు, వారి కొడుకులు, వారి పసిపిల్లలు తమ గుడారాల ద్వారం దగ్గర నిలబడ్డారు.
సంఖ్యాకాండము 16 : 28 (IRVTE)
అప్పుడు మోషే “ఈ కార్యాలన్నీ చెయ్యడానికి యెహోవా నన్ను పంపాడనీ, నా అంతట నేనే వాటిని చెయ్యలేదనీ దీనివల్ల మీరు తెలుసుకుంటారు.
సంఖ్యాకాండము 16 : 29 (IRVTE)
మనుషులందరికీ వచ్చే చావు లాంటి చావు వీళ్ళకు వస్తే ప్రతి మనిషికీ కలిగేదే వీళ్ళకూ కలిగితే, యెహోవా నన్ను పంపలేదు.
సంఖ్యాకాండము 16 : 30 (IRVTE)
కాని, యెహోవా ఒక అద్భుతం చేసి, వారు ప్రాణాలతోనే పాతాళంలోకి కుంగిపోయేలా భూమి తన నోరు తెరచి వారిని, వాళ్లకు కలిగిన సమస్తాన్నీ మింగేస్తే, వారు యెహోవాను అలక్ష్యం చేశారని మీకు తెలుస్తుంది” అన్నాడు.
సంఖ్యాకాండము 16 : 31 (IRVTE)
మోషే ఆ మాటలన్నీ చెప్పిన వెంటనే వారి కింద ఉన్న నేల తెరుచుకుంది.
సంఖ్యాకాండము 16 : 32 (IRVTE)
భూమి తన నోరు తెరిచి వారిని, వారి కుటుంబాలను, కోరహు సంబంధులందర్నీ, వాళ్లకు చెందిన వాటన్నిటినీ మింగేసింది.
సంఖ్యాకాండము 16 : 33 (IRVTE)
వారూ, వారి సంబంధులందరూ ప్రాణాలతో పాతాళంలోకి కుంగిపోయారు. భూమి వారిని మింగేసింది. వారు సమాజంలో ఉండకుండాా నాశనం అయ్యారు.
సంఖ్యాకాండము 16 : 34 (IRVTE)
వారి చుట్టూ ఉన్న ఇశ్రాయేలీయులందరూ వారి కేకలు విని “భూమి మనలను కూడా మింగేస్తుందేమో” అనుకుంటూ పారిపోయారు.
సంఖ్యాకాండము 16 : 35 (IRVTE)
అప్పుడు యెహోవా దగ్గర నుంచి అగ్ని బయలుదేరి, ధూపార్పణ తెచ్చిన ఆ 250 మందిని కాల్చేసింది.
సంఖ్యాకాండము 16 : 36 (IRVTE)
అప్పుడు యెహోవా మోషేతో “నువ్వు యాజకుడైన అహరోను కొడుకు ఎలియాజరుతో చెప్పు, ఆ అగ్ని మధ్యలోనుంచి ఆ ధూపార్తులను ఎత్తు, అవి ప్రతిష్ఠితమైనవి.
సంఖ్యాకాండము 16 : 37 (IRVTE)
సంఖ్యాకాండము 16 : 38 (IRVTE)
పాపం చేసి తమ ప్రాణాలకు ముప్పు తెచ్చుకున్న వీళ్ళ ధూపార్తులను తీసుకుని బలిపీఠానికి కప్పుగా వెడల్పైన రేకులు చెయ్యాలి. వారు యెహోవా సన్నిధికి వాటిని తెచ్చిన కారణంగా అవి ప్రతిష్ఠితం అయ్యాయి. అవి ఇశ్రాయేలీయులకు గుర్తుగా ఉంటాయి.”
సంఖ్యాకాండము 16 : 39 (IRVTE)
అహరోను సంతాన సంబంధి కాని అన్యుడు ఎవరూ యెహోవా సన్నిధిలో ధూపం అర్పించడానికి వచ్చి,
సంఖ్యాకాండము 16 : 40 (IRVTE)
కోరహులా, అతని గుంపులా అయపోకుండా ఇశ్రాయేలీయులకు జ్ఞాపికగా ఉండడానికి కాలిపోయినవారు అర్పించిన ఇత్తడి ధూపార్తులను యాజకుడైన ఎలియాజరు తీసి యెహోవా మోషే ద్వారా తనతో చెప్పినట్టు వాటితో బలిపీఠానికి కప్పుగా వెడల్పైన రేకులు చెయ్యించాడు.
సంఖ్యాకాండము 16 : 41 (IRVTE)
తరువాత రోజు ఇశ్రాయేలీయుల సమాజమంతా మోషే అహరోనులను విమర్శిస్తూ “మీరు యెహోవా ప్రజలను చంపారు” అని చెప్పి,
సంఖ్యాకాండము 16 : 42 (IRVTE)
సమాజమంతా మోషే అహరోనులకు విరోధంగా సమకూడారు. వారు సన్నిధి గుడారం వైపు తిరిగి చూసినప్పుడు, ఆ మేఘం దాన్ని కమ్మింది. యెహోవా మహిమ కూడా కనిపించింది.
సంఖ్యాకాండము 16 : 43 (IRVTE)
మోషే అహరోనులు సన్నిధి గుడారం ఎదుటికి వచ్చినప్పుడు,
సంఖ్యాకాండము 16 : 44 (IRVTE)
యెహోవా మోషేతో “మీరు ఈ సమాజం మధ్య నుంచి వెళ్ళి పొండి,
సంఖ్యాకాండము 16 : 45 (IRVTE)
తక్షణమే నేను వారిని నాశనం చేస్తాను” అని చెప్పినప్పుడు, వారు సాగిలపడ్డారు.
సంఖ్యాకాండము 16 : 46 (IRVTE)
అప్పుడు మోషే “నువ్వు ధూపార్తిని తీసుకుని బలిపీఠపు నిప్పులతో నింపి ధూపం వేసి త్వరగా సమాజం దగ్గరికి వెళ్లి వారి కోసం ప్రాయశ్చిత్తం చెయ్యి, ఎందుకంటే, యెహోవా సన్నిధిలోనుంచి కోపం బయలుదేరింది. తెగులు మొదలయ్యింది” అని అహరోనుతో చెప్పాడు.
సంఖ్యాకాండము 16 : 47 (IRVTE)
మోషే చెప్పినట్టు అహరోను వాటిని తీసుకుని సమాజం మధ్యకు పరుగెత్తి వెళ్ళినప్పుడు ప్రజల్లో తెగులు మొదలై పాకిపోతూ ఉంది. కాబట్టి అతడు ధూపం వేసి ఆ ప్రజల కోసం ప్రాయశ్చిత్తం చేశాడు.
సంఖ్యాకాండము 16 : 48 (IRVTE)
అతడు చనిపోయిన వారికీ, బతికున్న వారికీ మధ్య నిలబడినప్పుడు తెగులు ఆగింది.
సంఖ్యాకాండము 16 : 49 (IRVTE)
కోరహు తిరుగుబాటులో చనిపోయిన వారు కాకుండా 14, 700 మంది ఆ తెగులు వల్ల చనిపోయారు.
సంఖ్యాకాండము 16 : 50 (IRVTE)
ఆ తెగులు ఆగినప్పుడు అహరోను సన్నిధి గుడారపు ద్వారం దగ్గర ఉన్న మోషే దగ్గరికి తిరిగి వచ్చాడు.
❮
❯