సంఖ్యాకాండము 35 : 1 (IRVTE)
లేవీయులు నివసించడానికి పట్టణాలు యెరికో దగ్గర యొర్దానుకు సమీపంలోని మోయాబు మైదానాల్లో యెహోవా మోషేకు ఈ విధంగా చెప్పాడు.
సంఖ్యాకాండము 35 : 2 (IRVTE)
“తాము పొందే వారసత్వాల్లో లేవీయులు నివసించడానికి వారికి పట్టణాలను ఇవ్వాలని ఇశ్రాయేలీయులకు ఆజ్ఞాపించు. ఆ పట్టణాల చుట్టూ ఉన్న పల్లెలను కూడా లేవీయులకు ఇవ్వాలి.
సంఖ్యాకాండము 35 : 3 (IRVTE)
అవి వారి నివాసానికి వారి పట్టణాలవుతాయి. వాటి పొలాలు వారి పశువులకు, మందలకు, వారి ఆలమందలకు ఉండాలి.
సంఖ్యాకాండము 35 : 4 (IRVTE)
మీరు లేవీయులకిచ్చే పట్టణాల గోడ మొదలుకుని చుట్టూ వెయ్యి మూరలు,
సంఖ్యాకాండము 35 : 5 (IRVTE)
ఆ పట్టణాల బయట నుండి తూర్పున రెండు వేల మూరలు, దక్షిణాన రెండు వేల మూరలు, పడమర రెండు వేల మూరలు, ఉత్తరాన రెండు వేల మూరలు కొలవాలి. ఆ మధ్యలో పట్టణాలుండాలి. అవి వారి పట్టణాలకు పల్లెలుగా ఉంటాయి.
సంఖ్యాకాండము 35 : 6 (IRVTE)
శరణు పట్టణాలు మీరు లేవీయులకు ఇచ్చే పట్టణాల్లో ఆరు ఆశ్రయపురాలుండాలి. హత్య చేసినవాడు వాటిలోకి పారిపోగలిగేందుకు వీలుగా వాటిని నియమించాలి. అవి గాక 42 పట్టణాలను కూడా ఇవ్వాలి.
సంఖ్యాకాండము 35 : 7 (IRVTE)
వాటి పల్లెలతో కలిపి మీరు లేవీయులకు ఇవ్వాల్సిన పట్టణాలన్నీ నలభై ఎనిమిది.
సంఖ్యాకాండము 35 : 8 (IRVTE)
మీరిచ్చే పట్టణాలు ఇశ్రాయేలీయుల వారసత్వంలో నుండే ఇవ్వాలి. ఎక్కువ భూమి ఉన్నవారు ఎక్కువగా, తక్కువ భూమి ఉన్నవారు తక్కువగా ఇవ్వాలి. ప్రతి గోత్రం తాను పొందే వారసత్వం ప్రకారం తన తన పట్టణాల్లో కొన్నిటిని లేవీయులకు ఇవ్వాలి.”
సంఖ్యాకాండము 35 : 9 (IRVTE)
యెహోవా ఇంకా మోషేకు ఇలా ఆజ్ఞాపించాడు. “నువ్వు ఇశ్రాయేలీయులతో చెప్పు,
సంఖ్యాకాండము 35 : 10 (IRVTE)
మీరు యొర్దాను దాటి కనాను దేశంలోకి వెళ్లిన తరవాత
సంఖ్యాకాండము 35 : 11 (IRVTE)
ఆశ్రయపురాలుగా ఉండటానికి పట్టణాలను ఎన్నిక చేయాలి.
సంఖ్యాకాండము 35 : 12 (IRVTE)
పొరబాటున ఎవరినైనా చంపినవాడు వాటిలోకి పారిపోవచ్చు. తీర్పు కోసం నరహంతకుడు సమాజం ఎదుట నిలిచే వరకూ వాడు మరణశిక్ష పొందకూడదు కాబట్టి ప్రతికారం తీర్చుకునేవాడి నుండి అవి మీకు ఆశ్రయం కల్పిస్తాయి.
సంఖ్యాకాండము 35 : 13 (IRVTE)
మీరు ఆరు పట్టణాలను ఆశ్రయ పురాలుగా ఇవ్వాలి.
సంఖ్యాకాండము 35 : 14 (IRVTE)
వాటిలో యొర్దాను ఇవతల మూడు పట్టణాలు, కనాను దేశంలో మూడు పట్టణాలు ఇవ్వాలి. అవి మీకు ఆశ్రయపురాలుగా ఉంటాయి.
సంఖ్యాకాండము 35 : 15 (IRVTE)
ఎవరినైనా పొరబాటున చంపిన వాడు వాటిలోకి పారిపోయేలా ఆ ఆరు పట్టణాలు ఇశ్రాయేలీయులకు, పరదేశులకు, మీ మధ్య నివసించే ఎవరికైనా ఆశ్రయంగా ఉంటాయి.
సంఖ్యాకాండము 35 : 16 (IRVTE)
ఒకడు చనిపోయేలా ఇనుప ఆయుధంతో కొట్టినవాడు నరహంతకుడు. వాడికి తప్పకుండా మరణశిక్ష విధించాలి.
సంఖ్యాకాండము 35 : 17 (IRVTE)
ఒకడు చనిపోయేలా రాతితో కొట్టినప్పుడు ఆ కొట్టినవాడు నరహంతకుడు. వాడికి తప్పకుండా మరణశిక్ష విధించాలి.
సంఖ్యాకాండము 35 : 18 (IRVTE)
అలాగే ఒకడు చనిపోయేలా మరొకడు చేతి కర్రతో కొడితే కొట్టినవాడు నరహంతకుడు. వాడు తప్పకుండా మరణశిక్ష పొందాలి.
సంఖ్యాకాండము 35 : 19 (IRVTE)
హత్య విషయంలో ప్రతికారం తీర్చుకునే వాడు తానే స్వయంగా ఆ నరహంతకుణ్ణి చంపాలి. వాణ్ణి కలిసినప్పుడు చంపవచ్చు.
సంఖ్యాకాండము 35 : 20 (IRVTE)
ఎవరైనా చనిపోయేలా పగపట్టి పొడిచినా, లేక పొంచి ఉండి వాడి మీద దేనినైనా విసిరినా, లేక వైరంతో చేతితో కొట్టినా, కొట్టినవాడు నరహంతకుడు. అతణ్ణి తప్పకుండా చంపాలి.
సంఖ్యాకాండము 35 : 21 (IRVTE)
ప్రతికారం తీర్చుకునేవాడు ఆ నరహంతకుణ్ణి కలిసినప్పుడు వాడిని చంపవచ్చు.
సంఖ్యాకాండము 35 : 22 (IRVTE)
అయితే పగ ఏమీ లేకుండా వాడిని పొడిచినా, పొంచి ఉండకుండాా వాడిమీద ఏ ఆయుధమైనా విసిరినా ఒకడు చనిపోయేలా వాడిమీద రాయి విసిరినా,
సంఖ్యాకాండము 35 : 23 (IRVTE)
దెబ్బతిన్న వాడు చనిపోతే ఆ కొట్టినవాడు వాడి మీద పగపట్ట లేదు, వాడికి హాని చేసే ఉద్దేశం లేదు.
సంఖ్యాకాండము 35 : 24 (IRVTE)
కాబట్టి సమాజం ఈ నియమాల ప్రకారం కొట్టిన వాడికీ ప్రతికారం తీర్చుకునే వాడికీ మధ్య తీర్పుతీర్చాలి.
సంఖ్యాకాండము 35 : 25 (IRVTE)
ఆ విధంగా చేసి సమాజం నరహత్య విషయంలో ప్రతికారం తీర్చుకునే వాడి చేతి నుండి ఆ నరహంతకుణ్ణి కాపాడాలి. సమాజం మొదట పారిపోయిన ఆశ్రయపురానికి వాణ్ణి మళ్ళీ పంపించాలి. వాడు పవిత్ర తైలంతో అభిషేకం పొందిన ప్రధాన యాజకుడు చనిపోయే వరకూ అక్కడే నివసించాలి.
సంఖ్యాకాండము 35 : 26 (IRVTE)
అయితే అతడు ఎప్పుడైనా తన ఆశ్రయపురం సరిహద్దు దాటి వెళితే
సంఖ్యాకాండము 35 : 27 (IRVTE)
నరహత్య విషయంలో ప్రతికారం తీర్చుకునేవాడు ఆశ్రయపురం సరిహద్దు బయట అతణ్ణి చూసి చంపినప్పటికీ వాడి మీద హత్యాదోషం ఉండదు.
సంఖ్యాకాండము 35 : 28 (IRVTE)
ఎందుకంటే, ప్రధాన యాజకుడు చనిపోయే వరకూ అతడు ఆశ్రయపురంలోనే నివసించాలి. ఆ ప్రధాన యాజకుడు చనిపోయిన తరువాత ఆ నరహంతకుడు తన వారసత్వం ఉన్న దేశానికి తిరిగి వెళ్లవచ్చు.
సంఖ్యాకాండము 35 : 29 (IRVTE)
ఇవి మీరు నివాసముండే స్థలాలన్నిటిలో అన్ని తరాలకు మీకు విధించిన కట్టడ.
సంఖ్యాకాండము 35 : 30 (IRVTE)
ఎవరైనా ఒకణ్ణి చంపితే సాక్షుల నోటి మాట వలన ఆ నరహంతకుడికి మరణశిక్ష విధించాలి. ఒక్క సాక్షిమాట మీద ఎవరికీ మరణశిక్ష విధించకూడదు.
సంఖ్యాకాండము 35 : 31 (IRVTE)
హత్యా దోషంతో చావుకు తగిన నరహంతకుని ప్రాణం కోసం మీరు విమోచన ధనాన్ని అంగీకరించక తప్పకుండా వాడికి మరణశిక్ష విధించాలి.
సంఖ్యాకాండము 35 : 32 (IRVTE)
ఆశ్రయపురానికి పారిపోయిన వాడు యాజకుడు చనిపోక ముందుగా తన స్వంత ఊరిలో నివసించేలా చేయడానికి వాడి దగ్గర విమోచన ధనాన్ని అంగీకరించకూడదు.
సంఖ్యాకాండము 35 : 33 (IRVTE)
మీరు జీవించే దేశాన్ని అపవిత్రం చేయకూడదు. నరహత్య దేశాన్ని అపవిత్రపరుస్తుంది. దేశంలో చిందిన రక్తం కోసం ప్రాయశ్చిత్తం ఆ చిందించిన వాడి రక్తం వల్లనే కలుగుతుంది గాని మరి దేనివల్లా జరగదు.
సంఖ్యాకాండము 35 : 34 (IRVTE)
కాబట్టి మీరు జీవించే దేశాన్ని అపవిత్రం చేయవద్దు. ఎందుకంటే నేను దానిలో నివసిస్తున్నాను. నిజంగా యెహోవా అనే నేను ఇశ్రాయేలీయుల మధ్య నివసిస్తున్నాను.”
❮
❯