కీర్తనల గ్రంథము 31 : 1 (IRVTE)
ప్రధాన సంగీతకారుని కోసం. దావీదు కీర్తన. యెహోవా, నీ ఆశ్రయం కోరి వచ్చాను. నన్ను ఎన్నటికీ అవమానం పొందనీయకు. నీ నీతిని బట్టి నన్ను రక్షించు.
కీర్తనల గ్రంథము 31 : 2 (IRVTE)
నా మాటలు ఆలకించి నన్ను త్వరగా విడిపించు. నన్ను రక్షించే బలమైన దుర్గంగా, ప్రాకారం గల కోటగా ఉండు.
కీర్తనల గ్రంథము 31 : 3 (IRVTE)
నా కొండ, నా కోట నువ్వే. నీ నామాన్ని బట్టి నాకు దారి చూపి నడిపించు.
కీర్తనల గ్రంథము 31 : 4 (IRVTE)
నన్ను పట్టుకోడానికి శత్రువులు రహస్యంగా పన్నిన వల నుండి నన్ను తప్పించు. నా ఆశ్రయదుర్గం నీవే.
కీర్తనల గ్రంథము 31 : 5 (IRVTE)
నా ఆత్మను నీ చేతికప్పగిస్తున్నాను. యెహోవా, నమ్మదగిన దేవా, నువ్వు నన్ను విమోచిస్తావు.
కీర్తనల గ్రంథము 31 : 6 (IRVTE)
నేను యెహోవాను నమ్ముకున్నాను. పనికిమాలిన విగ్రహాలను పూజించేవారు నాకు అసహ్యం.
కీర్తనల గ్రంథము 31 : 7 (IRVTE)
నీ నిబంధన నమ్మకత్వాన్ని బట్టి నేను సంతోషించి ఆనందభరితుడినౌతాను. ఎందుకంటే నువ్వు నా బాధను గమనించావు. నా ప్రాణం పడే వేదనను కనిపెట్టావు.
కీర్తనల గ్రంథము 31 : 8 (IRVTE)
నన్ను నా శత్రువులకు అప్పగించకుండా, విశాలమైన స్థలంలో నా పాదాలు నిలబెట్టావు.
కీర్తనల గ్రంథము 31 : 9 (IRVTE)
యెహోవా, నన్ను కనికరించు. నేను ఇరుకులో పడిపోయాను. దుఃఖంతో నా కళ్ళు క్షీణిస్తున్నాయి. నా ప్రాణం, దేహం క్షీణిస్తున్నాయి.
కీర్తనల గ్రంథము 31 : 10 (IRVTE)
నా బ్రతుకు దుఃఖంతో వెళ్లబుచ్చుతున్నాను. నా ఆయుష్షు అంతా నిట్టూర్పులతో గతించిపోతున్నది. నా పాపం వలన నా బలం తగ్గిపోతున్నది. నా ఎముకలు క్షీణించిపోతున్నాయి.
కీర్తనల గ్రంథము 31 : 11 (IRVTE)
నా శత్రువులంతా నన్ను హేళన చేస్తున్నారు. నా పొరుగువారు నన్ను చూసి నివ్వెరబోతున్నారు. నా స్నేహితులు భయపడుతున్నారు. వీధిలో నన్ను చూసేవారు నా దగ్గర నుండి పారిపోతున్నారు.
కీర్తనల గ్రంథము 31 : 12 (IRVTE)
చనిపోయి ఎవరూ జ్ఞాపకం చేసుకోని వ్యక్తిలాగా అందరూ నన్ను మర్చిపోయారు. నేను ఓటికుండలాగా తయారయ్యాను.
కీర్తనల గ్రంథము 31 : 13 (IRVTE)
చాలా మంది నా మీద కుట్ర పన్నుతున్నారు. నన్ను చంపడానికి ఆలోచిస్తున్నారు. వారు గుసగుసలాడడం నాకు వినబడుతూ ఉంది. ఎటు చూసినా నాకు భయమే.
కీర్తనల గ్రంథము 31 : 14 (IRVTE)
అయితే, యెహోవా, నేను నీలో నమ్మకం పెట్టుకున్నాను. నువ్వే నా దేవుడివి అనుకుంటున్నాను.
కీర్తనల గ్రంథము 31 : 15 (IRVTE)
నా భవిష్యత్తు అంతా నీ చేతిలో ఉంది. నా శత్రువుల చేతి నుండీ నా వెంటబడి తరుముతున్న వారినుండీ నన్ను రక్షించు.
కీర్తనల గ్రంథము 31 : 16 (IRVTE)
నీ సేవకుని మీద నీ ముఖకాంతి ప్రసరింపనీ. నీ కృపతో నన్ను రక్షించు.
కీర్తనల గ్రంథము 31 : 17 (IRVTE)
యెహోవా, నీకు మొరపెడుతున్నాను, నాకు అవమానం కలగనీయకు. భక్తిహీనులనే అవమానం పొందనీ. వారు పాతాళంలో పడి మౌనంగా ఉండి పోనీ.
కీర్తనల గ్రంథము 31 : 18 (IRVTE)
అబద్ధాలాడే పెదాలు మూతబడి పోనీ. వారు గర్వంతో నీతిమంతులను చిన్నచూపు చూస్తూ వారిపై కఠినంగా మాట్లాడతారు.
కీర్తనల గ్రంథము 31 : 19 (IRVTE)
నీలో భయభక్తులు గలవారి కోసం నువ్వు దాచి ఉంచిన మేలు ఎంత గొప్పది! మనుషులు చూస్తుండగా నీ ఆశ్రయం కోరేవారి కోసం నువ్వు సిద్ధపరచిన మేలు ఎంతో గొప్పది.
కీర్తనల గ్రంథము 31 : 20 (IRVTE)
మనుషులు పన్నే కుట్రలకు బలి కాకుండా వారికి నీ సన్నిధిలో ఆశ్రయం కలిగించావు. మాటల దాడినుండి వారిని తప్పించి నీ గుడారంలో దాచిపెట్టావు.
కీర్తనల గ్రంథము 31 : 21 (IRVTE)
ముట్టడికి గురైన పట్టణంలో నేనుండగా యెహోవా తన నిబంధన నమ్మకత్వాన్ని నాకు చూపించాడు. ఆయనకు స్తుతి కలుగు గాక.
కీర్తనల గ్రంథము 31 : 22 (IRVTE)
నేను భయపడి, నీ దృష్టిలో ఇక నాశనమై పోయాను అనుకున్నాను. కానీ నేను మొరపెట్టినప్పుడు నువ్వు నా విజ్ఞాపన ఆలకించావు.
కీర్తనల గ్రంథము 31 : 23 (IRVTE)
యెహోవా భక్తులంతా ఆయన్ని ప్రేమించండి. యెహోవా తనను నమ్మిన వారిని కాపాడతాడు. కానీ గర్విష్టుల విషయంలో ఆయన సంపూర్ణమైన ప్రతీకారం జరిగిస్తాడు.
కీర్తనల గ్రంథము 31 : 24 (IRVTE)
యెహోవా కోసం కనిపెట్టుకున్న వారలారా, మీరందరూ ధైర్యంగా నిబ్బరంగా ఉండండి.
❮
❯