కీర్తనల గ్రంథము 62 : 1 (IRVTE)
ప్రధాన సంగీతకారుని కోసం. ఎదూతూను అనే రాగంతో పాడేది. దావీదు కీర్తన నా ప్రాణం దేవుని కోసం మౌనంగా కనిపెడుతున్నది. ఆయన వలన నాకు రక్షణ కలుగుతుంది.
కీర్తనల గ్రంథము 62 : 2 (IRVTE)
ఆయనే నా ఆశ్రయదుర్గం. నా రక్షణకర్త. నా ఉన్నతమైన గోపురం ఆయనే. నన్నెవరూ పూర్తిగా కదలించలేరు.
కీర్తనల గ్రంథము 62 : 3 (IRVTE)
ఎన్నాళ్లు మీరంతా ఒక్క మనిషిపై దాడి చేస్తారు? ఒకడు ఒరిగిపోయే గోడను, పడిపోతున్న కంచెను కూలదోసినట్టు నీవు* నీవు మీరంతా ఎంతకాలం ఒక్కణ్ణి కూలదోయాలని చూస్తారు?
కీర్తనల గ్రంథము 62 : 4 (IRVTE)
గౌరవప్రదమైన స్థానం నుండి అతణ్ణి పడదోయడానికే వారు అతనితో ఆలోచిస్తారు. అబద్ధాలు చెప్పడం వారికి సంతోషం. వారు తమ నోటితో దీవెనలు పలుకుతూ వారి హృదయాల్లో మాత్రం అతన్ని శపిస్తారు.
కీర్తనల గ్రంథము 62 : 5 (IRVTE)
నా ప్రాణమా, మౌనంగా ఉండి దేవుని కోసం కనిపెట్టు. ఆయన వల్లనే నాకు నిరీక్షణ కలుగుతున్నది.
కీర్తనల గ్రంథము 62 : 6 (IRVTE)
ఆయనే నా ఆధార శిల, నా రక్షణ. ఎత్తయిన నా గోపురం ఆయనే. నన్నెవరూ పూర్తిగా కదలించలేరు
కీర్తనల గ్రంథము 62 : 7 (IRVTE)
దేవునిలోనే నా రక్షణ, నా మహిమ. నా బలమైన దుర్గం, నా ఆశ్రయం ఆయనలోనే ఉన్నాయి.
కీర్తనల గ్రంథము 62 : 8 (IRVTE)
ప్రజలారా, ఆయనలో నిరంతరం నమ్మకం ఉంచండి. ఆయన సన్నిధిలో మీ హృదయాలు కుమ్మరించండి. దేవుడే మనకు ఆశ్రయం.
కీర్తనల గ్రంథము 62 : 9 (IRVTE)
నిజానికి తక్కువ స్థాయి మనుషులు ఎందుకూ పనికిరానివారు. గొప్పవారేమో మాయలాంటివారు. త్రాసులో వారంతా తేలిపోతారు. వారందరినీ కలిపి తూచినా వారు గాలికన్నా తేలికగా ఉన్నారు.
కీర్తనల గ్రంథము 62 : 10 (IRVTE)
బలాత్కారంలో, దోచుకోవడంలో నమ్మకం పెట్టుకోవద్దు. ఐశ్వర్యంలో వ్యర్ధంగా మనసు నిలపవద్దు. ఎందుకంటే అవేవీ ఫలించవు.
కీర్తనల గ్రంథము 62 : 11 (IRVTE)
ప్రభావం తనదే అని దేవుడు ఒకసారి చెప్పాడు. రెండుసార్లు నేనా మాట విన్నాను.
కీర్తనల గ్రంథము 62 : 12 (IRVTE)
కృప చూపడం నీకే చెల్లుతుంది. ఎందుకంటే ప్రభూ, మనుష్యులందరికీ వారు చేసిన క్రియల ప్రకారం నువ్వే ప్రతిఫలమిస్తున్నావు.
❮
❯
1
2
3
4
5
6
7
8
9
10
11
12