కీర్తనల గ్రంథము 65 : 1 (IRVTE)
ప్రధాన సంగీతకారుని కోసం. దావీదు కీర్తన దేవా, సీయోనులో నీ ఎదుట మౌనంగా కనిపెట్టడం, నీకు మా మొక్కుబడి చెల్లించడం ఎంతో మంచిది.
కీర్తనల గ్రంథము 65 : 2 (IRVTE)
ప్రార్థన ఆలకించే నీ దగ్గరికి మనుషులంతా వస్తారు.
కీర్తనల గ్రంథము 65 : 3 (IRVTE)
మా దోషాలు మమ్మల్ని ముంచెత్తాయి. మా అతిక్రమాలకు నీవే ప్రాయశ్చిత్తం చేస్తావు.
కీర్తనల గ్రంథము 65 : 4 (IRVTE)
నీ ఆవరణల్లో నివసించడానికి నీవు ఎంపిక చేసుకున్నవాడు ధన్యుడు. నీ పరిశుద్ధాలయం అనే నీ మందిరంలోని మేలుతో మేము తృప్తిపొందుతాము.
కీర్తనల గ్రంథము 65 : 5 (IRVTE)
మాకు రక్షణకర్తవైన దేవా, భూదిగంతాల్లో, దూర సముద్రం మీద ఉన్న వారికందరికీ నీవే ఆశ్రయం. నీతిని బట్టి అద్భుతమైన క్రియల ద్వారా నువ్వు మాకు జవాబిస్తావు.
కీర్తనల గ్రంథము 65 : 6 (IRVTE)
బలాన్నే నడికట్టుగా కట్టుకుని నీ శక్తితో పర్వతాలను స్థిరపరచింది నువ్వే.
కీర్తనల గ్రంథము 65 : 7 (IRVTE)
నువ్వే సముద్రాల హోరునూ వాటి అలల ఘోషనూ శాంతింపజేసేవాడివి. ప్రజల అల్లరిని అణిచేవాడివి.
కీర్తనల గ్రంథము 65 : 8 (IRVTE)
నీ క్రియలు జాడలను చూసి ఈ భూమి అంచుల్లో నివసించే ప్రజలు భయపడతారు. తూర్పు పడమరలు సంతోషించేలా చేసేది నువ్వే.
కీర్తనల గ్రంథము 65 : 9 (IRVTE)
నువ్వు భూమిని దర్శించి దాన్ని తడుపుతున్నావు. దాన్ని ఐశ్వర్యవంతం చేస్తున్నావు. దేవుని నది జలమయంగా ఉంది. నువ్వు భూమిని ఆ విధంగా సిద్ధం చేసి మానవాళికి ధాన్యం దయ చేస్తున్నావు.
కీర్తనల గ్రంథము 65 : 10 (IRVTE)
దాని దుక్కులను నీళ్లతో సమృద్ధిగా తడిపి దాని నాగటి చాళ్ళను చదును చేస్తున్నావు. వాన జల్లు కురిపించి దాన్ని మెత్తన చేస్తున్నావు. అది మొలకెత్తినప్పుడు దాన్ని ఆశీర్వదిస్తున్నావు.
కీర్తనల గ్రంథము 65 : 11 (IRVTE)
సంవత్సరమంతటికీ నీ మంచితనం ఒక కిరీటంగా ఉంది. నీ రథ చక్రాల జాడలు సారం ఒలికిస్తున్నాయి.
కీర్తనల గ్రంథము 65 : 12 (IRVTE)
అడవి బీడులు సారాన్ని వెదజల్లుతున్నాయి. కొండలు ఆనందాన్ని నడుముకు కట్టుకున్నాయి.
కీర్తనల గ్రంథము 65 : 13 (IRVTE)
గొర్రెల మందలు పచ్చిక మైదానాలను శాలువాలాగా కప్పాయి. లోయలు పంట ధాన్యంతో కప్పి ఉన్నాయి. అవన్నీ సంతోషధ్వని చేస్తున్నాయి. అవన్నీ పాటలు పాడుతున్నాయి.

1 2 3 4 5 6 7 8 9 10 11 12 13