కీర్తనల గ్రంథము 78 : 1 (IRVTE)
ఆసాపు కీర్తన. మస్కిల్ (దైవధ్యానం) నా ప్రజలారా, నా బోధను ఆలకించండి. నేను చెప్పే మాటలు వినండి.
కీర్తనల గ్రంథము 78 : 2 (IRVTE)
నా నోటితో జ్ఞానయుక్తమైన మాటలు చెబుతాను. పూర్వకాలం నుండీ రహస్యంగా ఉన్న విషయాలు నేను తెలియజేస్తాను.
కీర్తనల గ్రంథము 78 : 3 (IRVTE)
మాకు తెలిసిన సంగతులను, మా పూర్వికులు మాకు తెలిపిన సంగతులను చెబుతాను.
కీర్తనల గ్రంథము 78 : 4 (IRVTE)
యెహోవా చేసిన గొప్ప కార్యాలను, ఆయన బలాన్ని, ఆయన చేసిన ఆశ్చర్య క్రియలను దాచకుండా వారి పిల్లలకు మేము వినిపిస్తాం.
కీర్తనల గ్రంథము 78 : 5 (IRVTE)
రాబోయే తరాల్లో పుట్టే పిల్లలు దాన్ని తెలుసుకుని తమ పిల్లలకు దాన్ని వివరించాలి. వారు కూడా దేవునిలో నిరీక్షణ ఉంచి దేవుని కార్యాలు మరచిపోకూడదు.
కీర్తనల గ్రంథము 78 : 6 (IRVTE)
వారి పూర్వికులు యథార్థహృదయులు కారు. దేవుని విషయంలో స్థిర బుద్ధి లేనివారై ఆయనపై తిరగబడ్డారు.
కీర్తనల గ్రంథము 78 : 7 (IRVTE)
మీరు ఆ తరం వారిలాగా ఉండకూడదు. ఆయన ఆజ్ఞలు అనుసరించాలి.
కీర్తనల గ్రంథము 78 : 8 (IRVTE)
ఆయన యాకోబు సంతానానికి శాసనాలు ఏర్పాటు చేశాడు. ఇశ్రాయేలు సంతానానికి ధర్మశాస్త్రం అనుగ్రహించాడు. తమ సంతానానికి దాన్ని నేర్పించాలని మన పూర్వీకులకు ఆజ్ఞాపించాడు.
కీర్తనల గ్రంథము 78 : 9 (IRVTE)
ఎఫ్రాయిము గోత్రం వారు విల్లంబులు పట్టుకుని యుద్ధానికి సిద్ధపడ్డారు కానీ యుద్ధం జరిగిన రోజు వెనక్కి తిరిగి పారిపోయారు.
కీర్తనల గ్రంథము 78 : 10 (IRVTE)
వారు దేవునితో నిబంధనను నెరవేర్చలేదు. ఆయన ధర్మశాస్త్రాన్ని అనుసరించ లేదు.
కీర్తనల గ్రంథము 78 : 11 (IRVTE)
ఆయన చేసిన కార్యాలూ ఆయన వారికి చూపిన తన ఆశ్చర్య క్రియలూ వారు మర్చి పోయారు.
కీర్తనల గ్రంథము 78 : 12 (IRVTE)
ఈజిప్టుదేశంలోని సోయను ప్రాంతంలో వారి పూర్వీకుల మధ్య ఆయన ఆశ్చర్యకార్యాలు చేశాడు.
కీర్తనల గ్రంథము 78 : 13 (IRVTE)
ఆయన సముద్రాన్ని రెండుగా చీల్చి వారిని అవతలికి దాటించాడు. నీటిని రెండు వైపులా గోడల్లాగా నిలబెట్టాడు.
కీర్తనల గ్రంథము 78 : 14 (IRVTE)
పగలు మేఘంలో నుండీ రాత్రి అగ్ని వెలుగులో నుండీ ఆయన వారిని నడిపించాడు.
కీర్తనల గ్రంథము 78 : 15 (IRVTE)
అరణ్యంలో బండరాయిని చీల్చి సముద్రమంత సమృద్ధిగా వారికి నీరు అనుగ్రహించాడు.
కీర్తనల గ్రంథము 78 : 16 (IRVTE)
బండలోనుండి ఆయన నీటికాలువలు పారజేశాడు.
కీర్తనల గ్రంథము 78 : 17 (IRVTE)
అయినా వారు మహోన్నతుని మీద తిరుగుబాటు చేసి ఆయనకు వ్యతిరేకంగా పాపం చేస్తూనే వచ్చారు.
కీర్తనల గ్రంథము 78 : 18 (IRVTE)
వారు తమ ఆశకొద్దీ ఆహారం అడుగుతూ తమ హృదయాల్లో దేవుణ్ణి పరీక్షించారు.
కీర్తనల గ్రంథము 78 : 19 (IRVTE)
ఈ అరణ్యంలో దేవుడు భోజనం సిద్ధపరచగలడా?
కీర్తనల గ్రంథము 78 : 20 (IRVTE)
ఆయన గండ శిలను కొట్టినప్పుడు నీరు ఉబికి కాలువలై పారింది. ఆయన మనకు ఆహారం కూడా ఇవ్వగలడా? తన ప్రజలకు మాంసం సమకూర్చగలడా? అని వారు చెప్పుకుంటూ దేవునికి విరోధంగా మాట్లాడారు.
కీర్తనల గ్రంథము 78 : 21 (IRVTE)
యెహోవా ఈ మాట విని కోపగించాడు. యాకోబు సంతానాన్ని దహించడానికి ఆయన అగ్ని రాజుకుంది. ఇశ్రాయేలు సంతానం మీద ఆయన కోపం రగులుకుంది.
కీర్తనల గ్రంథము 78 : 22 (IRVTE)
వారు దేవునిలో విశ్వాసముంచలేదు. ఆయన అనుగ్రహించిన రక్షణలో నమ్మకం పెట్టుకోలేదు.
కీర్తనల గ్రంథము 78 : 23 (IRVTE)
అయినప్పటికీ ఆయన పైనున్న ఆకాశాలకు ఆజ్ఞాపించాడు. అంతరిక్ష ద్వారాలను తెరిచాడు.
కీర్తనల గ్రంథము 78 : 24 (IRVTE)
ఆయన వారికి ఆహారంగా మన్నాను కురిపించాడు. ఆకాశధాన్యం వారికి అనుగ్రహించాడు.
కీర్తనల గ్రంథము 78 : 25 (IRVTE)
మనుషులు దేవదూతల ఆహారం తిన్నారు. ఆయన వారికి ఆహారం సమృద్ధిగా పంపించాడు.
కీర్తనల గ్రంథము 78 : 26 (IRVTE)
ఆకాశంలో తూర్పు గాలి విసిరేలా చేశాడు. తన బలంతో దక్షిణపు గాలి రప్పించాడు.
కీర్తనల గ్రంథము 78 : 27 (IRVTE)
ధూళి అంత విస్తారంగా మాంసాన్నీ సముద్రపు ఇసుక రేణువులంత విస్తారంగా పక్షులనూ ఆయన వారి కోసం కురిపించాడు.
కీర్తనల గ్రంథము 78 : 28 (IRVTE)
అవి వారి శిబిరం మధ్యలో వారి గుడారాల చుట్టూ రాలి పడ్డాయి.
కీర్తనల గ్రంథము 78 : 29 (IRVTE)
వారు కడుపారా తిన్నారు. వారు దేని కోసం వెంపర్లాడారో దాన్ని ఆయన అనుగ్రహించాడు.
కీర్తనల గ్రంథము 78 : 30 (IRVTE)
అయితే, వారి ఆశ తీరక ముందే, అంటే ఆహారం ఇంకా వారి నోటిలో ఉండగానే,
కీర్తనల గ్రంథము 78 : 31 (IRVTE)
వారి మీద దేవుని కోపం చెలరేగింది. వారిలో బలమైన వారిని ఆయన సంహరించాడు. ఇశ్రాయేలు యువకులు కూలిపోయేలా చేశాడు.
కీర్తనల గ్రంథము 78 : 32 (IRVTE)
ఇంత జరిగినా వారు ఇంకా పాపం చేస్తూ వచ్చారు. ఆయన ఆశ్చర్యకార్యాలను చూసి ఆయన్ని నమ్మలేదు.
కీర్తనల గ్రంథము 78 : 33 (IRVTE)
కాబట్టి ఆయన వారి రోజులు తక్కువ చేశాడు. వారి సంవత్సరాలు భయంతో నింపాడు.
కీర్తనల గ్రంథము 78 : 34 (IRVTE)
ఆయన వారిని బాధలకు గురి చేసినప్పుడల్లా వారు ఆయన వైపు తిరిగి హృదయపూర్వకంగా దేవుణ్ణి బతిమాలుకున్నారు.
కీర్తనల గ్రంథము 78 : 35 (IRVTE)
దేవుడు తమ ఆశ్రయదుర్గమనీ మహోన్నతుడైన దేవుడు తమకు విమోచకుడనీ వారు జ్ఞాపకం చేసుకున్నారు.
కీర్తనల గ్రంథము 78 : 36 (IRVTE)
అయితే వారు తమ నోటితో పైపైనే ఆయన్ని స్తుతించారు. తమ నాలుకలతో ఆయన ఎదుట అబద్ధాలు పలికారు.
కీర్తనల గ్రంథము 78 : 37 (IRVTE)
ఎందుకంటే వారి హృదయం ఆయన మీద నిలుపుకోలేదు. ఆయన నిబంధనను నమ్మకంగా పాటించలేదు.
కీర్తనల గ్రంథము 78 : 38 (IRVTE)
అయితే ఆయన తన కనికరాన్ని బట్టి వారిని నాశనానికి గురి చేయకుండా వారి దోషాన్ని క్షమించాడు. చాలాసార్లు తన ఉగ్రతను రేపుకోకుండా దాన్ని అణచుకున్నాడు.
కీర్తనల గ్రంథము 78 : 39 (IRVTE)
ఎందుకంటే వారు కేవలం మానవమాత్రులనీ, వీచిన తరవాత తిరిగిరాని గాలిలాంటి వారనీ ఆయన జ్ఞాపకం చేసుకున్నాడు.
కీర్తనల గ్రంథము 78 : 40 (IRVTE)
అరణ్యంలో వారు ఆయన మీద ఎన్నోసార్లు తిరగబడ్డారు. ఎడారిలో ఆయనను ఎన్నోసార్లు దుఃఖపెట్టారు.
కీర్తనల గ్రంథము 78 : 41 (IRVTE)
మాటిమాటికీ దేవుణ్ణి శోధించారు. మాటిమాటికీ ఇశ్రాయేలు పరిశుద్ధ దేవునికి దుఃఖం పుట్టించారు.
కీర్తనల గ్రంథము 78 : 42 (IRVTE)
ఆయన బాహుబలాన్నీ, ఏ విధంగా ఆయన తమ శత్రువుల చేతిలో నుండి తమను విమోచించాడో దానినీ,
కీర్తనల గ్రంథము 78 : 43 (IRVTE)
ఈజిప్టులో ఆయన చూపిన సూచక క్రియలనూ సోయను ప్రాంతంలో ఆయన చేసిన అద్భుతాలనూ వారు జ్ఞాపకం చేసుకోలేదు.
కీర్తనల గ్రంథము 78 : 44 (IRVTE)
నైలునది కాలవలను, వారి ప్రవాహాలను ఆయన రక్తంగా మార్చినప్పుడు ఐగుప్తీయులు తాగలేక పోయారు.
కీర్తనల గ్రంథము 78 : 45 (IRVTE)
ఆయన వారి మీదికి ఈగల గుంపులను పంపించాడు. అవి వారిని ముంచివేశాయి, కప్పలను పంపాడు. అవి వారి నేలంతటినీ కప్పివేశాయి.
కీర్తనల గ్రంథము 78 : 46 (IRVTE)
ఆయన వారి పంటలను చీడపురుగులకిచ్చాడు. వారి కష్టఫలాన్ని మిడతలకు అప్పగించాడు.
కీర్తనల గ్రంథము 78 : 47 (IRVTE)
వడగండ్ల చేత వారి ద్రాక్షతీగెలను, మంచు చేత వారి మేడిచెట్లను ఆయన పాడు చేశాడు.
కీర్తనల గ్రంథము 78 : 48 (IRVTE)
వారి పశువులపై వడగళ్ళు కురిపించాడు. వారి మందలపై పిడుగులు రాలాయి.
కీర్తనల గ్రంథము 78 : 49 (IRVTE)
ఆయన విపత్తును కలిగించే దూతలుగా తన ఉగ్రతను, మహోగ్రతను, బాధను వారి మీదికి పంపించాడు.
కీర్తనల గ్రంథము 78 : 50 (IRVTE)
తన కోపానికి దారి చదునుగా చేశాడు. వారిని మరణం నుండి తప్పించకుండా వారి ప్రాణాన్ని తెగులుకు అప్పగించాడు.
కీర్తనల గ్రంథము 78 : 51 (IRVTE)
ఈజిప్టులోని పెద్ద కొడుకులందరినీ హాము గుడారాల్లో వారి బలానికి గుర్తుగా ఉన్న ప్రథమ సంతానాన్ని ఆయన చంపాడు.
కీర్తనల గ్రంథము 78 : 52 (IRVTE)
ఆ తరవాత ఆయన తన ప్రజలను గొర్రెలను తోలినట్టుగా నడిపించాడు. ఒకడు తన మందను ఎలా నడిపిస్తాడో అరణ్యంలో ఆయన వారిని అలా నడిపించాడు.
కీర్తనల గ్రంథము 78 : 53 (IRVTE)
వారు భయపడకుండా ఆయన వారిని సురక్షితంగా నడిపించాడు. వారి శత్రువులను సముద్రంలో ముంచివేశాడు.
కీర్తనల గ్రంథము 78 : 54 (IRVTE)
తన పరిశుద్ధ భూమి సరిహద్దు దగ్గరికి, తన కుడిచెయ్యి సంపాదించిన ఈ పర్వతం దగ్గరికి ఆయన వారిని రప్పించాడు.
కీర్తనల గ్రంథము 78 : 55 (IRVTE)
వారి ఎదుట నుండి అన్య జాతులను వెళ్లగొట్టాడు. ఆ ప్రజల వారసత్వాన్ని వారికి పంచి ఇచ్చాడు. ఇశ్రాయేలు గోత్రాలను వారి గుడారాల్లో స్థిరపరిచాడు.
కీర్తనల గ్రంథము 78 : 56 (IRVTE)
అయినప్పటికీ వారు మహోన్నతుడైన దేవుణ్ణి పరీక్షించి తిరుగుబాటు చేశారు. ఆయన శాసనాలను పాటించలేదు.
కీర్తనల గ్రంథము 78 : 57 (IRVTE)
తమ పూర్వికుల్లాగా వారు అపనమ్మకస్తులై ద్రోహం చేశారు. పనికిరాని విల్లులాగా నిష్ప్రయోజకులయ్యారు.
కీర్తనల గ్రంథము 78 : 58 (IRVTE)
వారు ఉన్నత స్థలాల్లో దేవస్థానాలు నిలిపి ఆయనకు కోపం పుట్టించారు. విగ్రహాలు నిలబెట్టి ఆయనకు రోషం కలిగించారు.
కీర్తనల గ్రంథము 78 : 59 (IRVTE)
దాన్ని చూసిన దేవుడు ఆగ్రహించి ఇశ్రాయేలును పూర్తిగా తోసిపుచ్చాడు.
కీర్తనల గ్రంథము 78 : 60 (IRVTE)
షిలోహు పట్టణంలో మందిరాన్ని, తాను మనుషులతో కలిసి నివసించిన గుడారాన్ని విడిచిపెట్టాడు.
కీర్తనల గ్రంథము 78 : 61 (IRVTE)
ఆయన తన బలాన్ని చెరలోకీ తన మహిమను విరోధుల చేతిలోకీ వెళ్ళడానికి అనుమతించాడు.
కీర్తనల గ్రంథము 78 : 62 (IRVTE)
తన ప్రజలను ఖడ్గానికి అప్పగించాడు. ఆయన తన వారసత్వం మీద కోపించాడు.
కీర్తనల గ్రంథము 78 : 63 (IRVTE)
అగ్ని వారి యువకులను దహించివేసింది. వారి కన్యలకు పెండ్లిపాటలు లేకుండా పోయాయి.
కీర్తనల గ్రంథము 78 : 64 (IRVTE)
వారి యాజకులు కత్తిపాలై కూలిపోయారు. విధవలైన వారి భార్యలు రోదనం చేయలేక పోయారు.
కీర్తనల గ్రంథము 78 : 65 (IRVTE)
అప్పుడు నిద్ర నుండి మేల్కొన్న వ్యక్తిలాగా, ద్రాక్షరసం తాగి కేకపెట్టే యోధుడిలాగా ప్రభువు లేచాడు.
కీర్తనల గ్రంథము 78 : 66 (IRVTE)
ఆయన తన విరోధులను వెనక్కి తరిమికొట్టాడు. వారిని నిత్యమైన అవమానానికి గురి చేశాడు.
కీర్తనల గ్రంథము 78 : 67 (IRVTE)
తరవాత ఆయన యోసేపు గుడారాన్ని అసహ్యించుకున్నాడు. ఎఫ్రాయిము గోత్రాన్ని కోరుకోలేదు.
కీర్తనల గ్రంథము 78 : 68 (IRVTE)
యూదా గోత్రాన్ని, తాను ప్రేమించిన సీయోను పర్వతాన్ని ఆయన ఎన్నుకున్నాడు.
కీర్తనల గ్రంథము 78 : 69 (IRVTE)
అంతరిక్షంలాగా, తాను శాశ్వతంగా స్థిరపరచిన భూమిలాగా ఆయన తన మందిరాన్ని కట్టించాడు.
కీర్తనల గ్రంథము 78 : 70 (IRVTE)
తన సేవకుడు దావీదును ఎన్నుకుని గొర్రెల మందల మధ్య నుండి అతణ్ణి పిలిపించాడు.
కీర్తనల గ్రంథము 78 : 71 (IRVTE)
పాలిచ్చే గొర్రెల వెంట నడవడం మాన్పించి తన ప్రజలైన యాకోబును, తన వారసత్వమైన ఇశ్రాయేలును మేపడానికి ఆయన అతణ్ణి రప్పించాడు.
కీర్తనల గ్రంథము 78 : 72 (IRVTE)
అతడు యథార్థ హృదయంతో వారిని పాలించాడు. నైపుణ్యంతో వారిని నడిపించాడు.
❮
❯