పరమగీతము 2 : 1 (IRVTE)
షారోను పుష్పం (యువతి తన ప్రియునితో మాట్లాడుతూ ఉంది) నేను కేవలం మైదానంలోని పువ్వును. కేవలం లోయలోని లిల్లీ పువ్వును.
పరమగీతము 2 : 2 (IRVTE)
(ఆ వ్యక్తి ఆమెతో మాట్లాడుతూ ఉన్నాడు) ప్రేయసీ! నువ్వు నా దేశపు యువతుల మధ్య ముళ్ళ చెట్లలో లిల్లీ లాగా ఉన్నావు.
పరమగీతము 2 : 3 (IRVTE)
(ఆ యువతి తనలో తాను మాట్లాడుకుంటూ ఉంది) అడవి చెట్టుల్లో ఆపిల్ వృక్షంలా, యువకుల్లో నా ప్రియుడున్నాడు. ఉప్పొంగి పోతూ నేనతని నీడలో కూర్చున్నాను. అతని పండు ఎంతో రుచిగా ఉంది.
పరమగీతము 2 : 4 (IRVTE)
అతడు నన్ను విందుశాలకు తెచ్చాడు. అతని ప్రేమ పతాక స్థాయిలో ఉంది.
పరమగీతము 2 : 5 (IRVTE)
(యువతి తన ప్రియునితో మాట్లాడుతూ ఉంది) ప్రేమ కోసం నేను ఆకలిగా ఉన్నాను. ఎండు ద్రాక్షపళ్ళతో నన్ను తెప్పరిల్లజేయండి, ఆపిల్ పళ్ళతో నన్ను ఉత్తేజ పరచండి.
పరమగీతము 2 : 6 (IRVTE)
(ఆ యువతి తనలో తాను మాట్లాడుకుంటూ ఉంది) అతని ఎడమ చెయ్యి నా తల కింద ఉంది. కుడిచేత్తో అతడు నన్ను కౌగిలించుకున్నాడు.
పరమగీతము 2 : 7 (IRVTE)
(ఆ యువతి మిగతా స్త్రీలతో మాట్లాడుతూ ఉంది) యెరూషలేము ఆడపడుచులారా, పొలాల్లోని జింకల మీద, లేళ్ల మీద ఒట్టు పెట్టి చెప్పండి. మా ప్రేమ పని ముగిసేంత వరకూ మీరు మమ్మల్ని ఆటంకపరచవద్దు.
పరమగీతము 2 : 8 (IRVTE)
*రెండవ భాగం (ఆ యువతి తనలో తాను మాట్లాడుకుంటూ ఉంది) నా ప్రియుని స్వరం అదుగో! చూడు, అతడు వస్తున్నాడు. పర్వతాల మీద గంతులేస్తూ కొండల మీద దూకుతూ వస్తున్నాడు.
పరమగీతము 2 : 9 (IRVTE)
నా ప్రియుడు జింకలాగా, లేడిపిల్లలాగా ఉన్నాడు. చూడు, మన గోడ వెనక నిలబడి ఉన్నాడు. కిటికీలోనుంచి చూస్తున్నాడు. అల్లిక తడికె గుండా తొంగి చూస్తున్నాడు.
పరమగీతము 2 : 10 (IRVTE)
నా ప్రియుడు నాతో మాట్లాడి ఇలా అన్నాడు, “ప్రియా, లే. సుందరీ, నాతో వచ్చెయ్యి.
పరమగీతము 2 : 11 (IRVTE)
చలికాలం పోయింది. వానలు పడి వెళ్ళిపోయాయి.
పరమగీతము 2 : 12 (IRVTE)
దేశమంతా పూలు పూశాయి. కొమ్మలను కత్తిరించే కాలం, పక్షులు కోలాహలం చేసే కాలం వచ్చింది. కోకిల కూతలు మన ప్రాంతాల్లో వినబడుతున్నాయి.
పరమగీతము 2 : 13 (IRVTE)
అంజూరు పళ్ళు పక్వానికి వచ్చాయి. ద్రాక్షచెట్లు పూతపట్టాయి. అవి సువాసన ఇస్తున్నాయి. ప్రియా, లే. సుందరీ, నాతో వచ్చెయ్యి.
పరమగీతము 2 : 14 (IRVTE)
బండసందుల్లోని నా పావురమా, కొండ మరుగు చరియల్లోని పావురమా, నీ ముఖం నన్ను చూడ నివ్వు. నీ స్వరం వినిపించు. నీ స్వరం మధురం, నీ ముఖం ఎంత ముద్దుగా ఉంది.”
పరమగీతము 2 : 15 (IRVTE)
(యువతి తన ప్రియునితో మాట్లాడుతూ ఉంది) మన ద్రాక్షతోటలు పూతకు వచ్చాయి. తోడేళ్ళను పట్టుకో. ద్రాక్షతోటలను పాడుచేసే గుంట నక్కలను పట్టుకో.
పరమగీతము 2 : 16 (IRVTE)
(ఆ యువతి తనలో తాను మాట్లాడుకుంటూ ఉంది) నా ప్రియుడు నా వాడు. నేను అతని దాన్ని. లిల్లీలు ఉన్నతావుల్లో అతడు మందను చక్కగా మేపుతున్నాడు.
పరమగీతము 2 : 17 (IRVTE)
(యువతి తన ప్రియునితో మాట్లాడుతూ ఉంది) ప్రియా, వెళ్ళిపో. ఉషోదయ శీతల పవనాలు వీచే ముందే చీకటి నీడలు పారిపోయే లోపే వెళ్ళిపో. కొండ బాటల్లోని జింక లాగా లేడిపిల్లలాగా ఉండు.

1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17