యెహెజ్కేలు 4 : 1 (TEV)
నరపుత్రుడా, పెంకు ఒకటి తీసికొనివచ్చి నీ ముందర ఉంచుకొని యెరూషలేముపట్టణపు రూపమును దాని మీద వ్రాయుము.
యెహెజ్కేలు 4 : 2 (TEV)
మరియు అది ముట్టడి వేయబడి నట్లును దానియెదుట బురుజులను కట్టినట్లును దిబ్బ వేసి నట్లును దాని చుట్టునున్న ప్రాకారములను కూలగొట్టు యంత్రములున్నట్లును నీవు వ్రాయుము.
యెహెజ్కేలు 4 : 3 (TEV)
మరియు ఇనుపరేకొకటి తెచ్చి, నీకును పట్టణమునకును మధ్య ఇనుప గోడగా దానిని నిలువబెట్టి, నీ ముఖ దృష్టిని పట్టణము మీద ఉంచుకొనుము; పట్టణము ముట్టడి వేయబడినట్లుగా ఉండును, నీవు దానిని ముట్టడివేయువాడవుగా ఉందువు; అది ఇశ్రాయేలీయులకు సూచనగా ఉండును.
యెహెజ్కేలు 4 : 4 (TEV)
మరియు నీ యెడమప్రక్కను పండుకొనియుండి ఇశ్రాయేలువారి దోషమును దానిమీద మోపవలెను; ఎన్ని దినములు నీవు ఆ తట్టు పండుకొందువో అన్ని దిన ములు నీవు వారి దోషమును భరింతువు.
యెహెజ్కేలు 4 : 5 (TEV)
ఇశ్రాయేలు వారి దోషమును నీవు భరించునట్లుగా వారు దోషము చేసిన సంవత్సరముల లెక్కచొప్పున నీకు మూడువందల తొంబది దినములు నిర్ణయించియున్నాను.
యెహెజ్కేలు 4 : 6 (TEV)
ఆ దినములు గడచిన తరువాత కుడిప్రక్కను పండుకొనియుండి నలు వది దినములు యూదావారి దోషమును భరింపవలెను, సంవత్సర మొకటింటికి ఒక దినము చొప్పున నేను నిర్ణ యించి యున్నాను.
యెహెజ్కేలు 4 : 7 (TEV)
ఈలాగు నీవుండగా యెరూష లేము ముట్టడివేయబడినట్లు తేరిచూచుచు, చొక్కాయిని తీసివేసిన బాహువు చాపి దానినిగూర్చి ప్రకటింపవలెను.
యెహెజ్కేలు 4 : 8 (TEV)
పట్టణము ముట్టడివేయబడినట్లుండు దినములు నీవు రెండవ ప్రక్కను తిరుగక అదేపాటున ఉండునట్లు నిన్నుకట్లతో బంధింతును.
యెహెజ్కేలు 4 : 9 (TEV)
మరియు నీవు గోధుమలును యవలును కాయధాన్యములును చోళ్లును సజ్జలును తెల్ల జిలకరను తెచ్చుకొని, యొక పాత్రలో ఉంచి, నీవు ఆ ప్రక్కమీద పండుకొను దినముల లెక్కచొప్పున రొట్టెలు కాల్చుకొనవలెను, మూడువందల తొంబది దినములు నీవు ఈలాగున భోజనము చేయుచు రావలెను;
యెహెజ్కేలు 4 : 10 (TEV)
నీవు తూనికె ప్రకారము, అనగా దినమొకటింటికి ఇరువది తులముల యెత్తుచొప్పున భుజింపవలెను, వేళవేళకు తినవలెను,
యెహెజ్కేలు 4 : 11 (TEV)
నీళ్లు కొలప్రకారము అరపడిచొప్పున ప్రతిదినము త్రాగ వలెను, వేళవేళకు త్రాగవలెను;
యెహెజ్కేలు 4 : 12 (TEV)
యవల అప్పములు చేసి వారు చూచుచుండగా దానిని మనుష్య మలముతో కాల్చి భుజింపవలెను;
యెహెజ్కేలు 4 : 13 (TEV)
నేను వారిని తోలివేయు జనము లలో ఇశ్రాయేలీయులు ఈ ప్రకారము అపవిత్రమైన ఆహారమును భుజింతురని యెహోవా నాకు సెలవిచ్చెను.
యెహెజ్కేలు 4 : 14 (TEV)
అందుకు అయ్యో, ప్రభువా, యెహోవా, నేనెన్నడును అపవిత్రత నొందినవాడను కానే, బాల్యమునుండి నేటి వరకును చచ్చినదానినైనను మృగములు చీల్చినదానినైనను నేను తినినవాడను కానే, నిషిద్ధమైన మాంసము నా నోట ఎన్నడును పడలేదే అని నేననగా
యెహెజ్కేలు 4 : 15 (TEV)
ఆయనచూడుము, మనుష్య మలమునకు మారుగా నీకు గోమలము నేను నిర్ణయించి యున్నాను; దీనితో నీవు నీ భోజనము సిద్ధ పరుచుకొనుమని సెలవిచ్చి
యెహెజ్కేలు 4 : 16 (TEV)
నరపుత్రుడా, ఇదిగో యెరూషలేములో రొట్టెయను ఆధారమును నేను లేకుండ చేసినందున వారు తూనికె ప్రకారముగా బహు చింతతో రొట్టె భుజింతురు, నీళ్లు కొలచొప్పున త్రాగుచు విస్మయ మొందుదురు.
యెహెజ్కేలు 4 : 17 (TEV)
అన్నపానములు లేకపోయినందున వారు శ్రమనొంది విభ్రాంతిపడి యొకనినొకడు చూచుచు తాము కలుగజేసికొనిన దోషమువలన నశించిపోవుదురు.
❮
❯