పరమగీతము 3 : 1 (TEV)
రాత్రివేళ పరుండియుండి నేను నా ప్రాణప్రియుని వెదకితిని వెదకినను అతడు కనబడక యుండెను.
పరమగీతము 3 : 2 (TEV)
నేనిప్పుడే లేచెదను పట్టణము వెంబడిపోయి వెదకుదును సంతవీధులలోను రాజవీధులలోను తిరుగుదును నా ప్రాణప్రియుని వెదకుదును అని నేననుకొంటిని. నేను వెదకినను అతడు కనబడలేదు.
పరమగీతము 3 : 3 (TEV)
పట్టణమునందు సంచరించు కావలివారు నాకెదురు పడగా మీరు నా ప్రాణప్రియుని చూచితిరా? అని నేనడిగి తిని
పరమగీతము 3 : 4 (TEV)
నేను వారిని విడిచి కొంచెము దూరము పోగా నా ప్రాణప్రియుడు నాకెదురుపడెను వదలిపెట్టక నేనతని పట్టుకొంటిని నా తల్లి యింటికతని తోడుకొని వచ్చితిని నన్ను కనినదాని యరలోనికి తోడుకొని వచ్చితిని.
పరమగీతము 3 : 5 (TEV)
యెరూషలేము కుమార్తెలారా, పొలములోని యిఱ్ఱులనుబట్టియు లేళ్లనుబట్టియు మీచేత ప్రమాణము చేయించుకొని లేచుటకు ప్రేమకు ఇష్టమగువరకు మీరు లేపకయు కలతపరచకయు నుండుడని నేను మిమ్మును బతిమాలుకొనుచున్నాను.
పరమగీతము 3 : 6 (TEV)
ధూమ స్తంభములవలె అరణ్యమార్గముగా వచ్చు ఇది ఏమి? గోపరసముతోను సాంబ్రాణితోను వర్తకులమ్ము వివిధ మైన సుగంధ చూర్ణములతోను పరిమళించుచు వచ్చు ఇది ఏమి?
పరమగీతము 3 : 7 (TEV)
ఇదిగో సొలొమోను పల్లకి వచ్చుచున్నది అరువదిమంది శూరులు దానికి పరివారము వారు ఇశ్రాయేలీయులలో పరాక్రమశాలులు వారందరును ఖడ్గధారులు యుద్ధవీరులు
పరమగీతము 3 : 8 (TEV)
రాత్రి భయముచేత వారు ఖడ్గము ధరించి వచ్చు చున్నారు.
పరమగీతము 3 : 9 (TEV)
లెబానోను మ్రానుతో మంచమొకటి సొలొమోనురాజు తనకు చేయించుకొని యున్నాడు.
పరమగీతము 3 : 10 (TEV)
దాని స్తంభములు వెండిమయములు దాని పాదములు స్వర్ణమయములు దాని మెత్తలు ధూమ్రవర్ణవస్త్రముతో చేయబడెను ప్రేమను సూచించు విచిత్రమైన కుట్టుపనితో యెరూషలేము కుమార్తెలు దాని లోపలిభాగము నలంక రించిరి.
పరమగీతము 3 : 11 (TEV)
సీయోను కుమార్తెలారా, వేంచేయుడి కిరీటము ధరించిన సొలొమోనురాజును చూడుడి వివాహదినమున అతని తల్లి అతనికి పెట్టిన కిరీటము చూడుడి ఆ దినము అతనికి బహు సంతోషకరము.
❮
❯