1. {సైనిక సమూహాలు} [PS] సైన్యంలో చేరి రాజు సేవలో నిమగ్నమైన ఇశ్రాయేలీయుల వివరణ: ప్రతి సంవత్సరంలోను ప్రతి సమూహం ఒక నెలపాటు తమ విధికి హాజరయ్యేది. రాజును సేవించిన వారిలో వంశాలకు అధిపతులు, శతదళాధిపతులు, సహస్ర దళాధిపతులు, మరియు రక్షక భటులు వున్నారు. ప్రతి సైనిక విభాగంలోను ఇరవైనాలుగు వేలమంది మనుష్యులున్నారు.
2. మొదటి నెలలో మొదటి దళానికి యాషాబాము అధిపతి. యాషాబాము తండ్రి పేరు జబ్దీయేలు. యాషాబాము దళంలో ఇరవై నాలుగు వేలమంది సైనికులున్నారు.
3. యాషాబాము పెరెజు సంతతివారిలో ఒకడు. యాషాబాము సైనికాధికారులందరికీ మొదటి నెలలో అధిపతి.
4. రెండవ నెలలో సైనిక దళానికి దోదై అధిపతి. అతడు అహూయహు సంతతివాడు (అహోహీయుడు). దోదై విభాగంలో ఇరవై నాలుగువేల మంది ఉన్నారు.
5. మూడవ అధికారి బెనాయా. మూడవ నెలలో బెనాయా సైనికాధికారి. బెనాయా తండ్రి పేరు యెహోయాదా. యెహోయాదా ప్రముఖ యాజకుడు. బెనాయా దళంలో ఇరవై నాలుగువేల మంది సైనికులున్నారు.
6. ముప్పది మంది మహా యోధుల్లోగల బెనాయా ఇతడే. వారిని బెనాయా నడిపించాడు. బెనాయా కుమారుడు అమ్మీజాబాదు. బెనాయా దళానికి నిర్వాహకుడుగా వున్నాడు.
7. నాల్గవ అధికారి అశాహేలు. అతడు నాల్గవ నెలలో దళాధిపతి. అశాహేలు యోవాబు సోదరుడు. తరువాత అశాహేలు కుమారుడు జెబద్యా తన తండ్రి స్థానంలో అధిపతి అయ్యాడు. అశాహేలు దళంలో ఇరవైనాలుగు వేలమంది సైనికులు వున్నారు.
8. ఐదవ అధికారి షమ్హూతు. షమ్హూతు ఐదవ నెలలో అధిపతి. షమ్హూతు ఇశ్రాహేతీయుడు. షమ్హూతు విభాగంలో ఇరవై నాలుగువేల మంది సైనికులున్నారు.
9. ఆరవ అధిపతి ఈరా. ఈరా ఆరవ నెలలో అధిపతి. ఈరా తండ్రి పేరు ఇక్కెషు. ఇక్కెషు తెకోవ పట్టణంవాడు. ఈరా విభాగంలో ఇరవై నాలుగువేల మంది సైనికులున్నారు.
10. ఏడవ అధిపతి హేలెస్సు. హేలెస్సు ఏడవ నెలలో అధిపతి. అతడు పెలోనీయుడు. ఎఫ్రాయిము సంతతికి చెందినవాడు. హేలెస్సు దళంలో ఇరవై నాలుగు వేలమంది సైనికులు వున్నారు.
11. ఎనిమిదవ అధిపతి సిబ్బెకై. సిబ్బెకై ఎనిమిదవ నెలలో అధిపతి. సిబ్బెకై హుషాతీయుడు. అతడు జెరహు సంతతివాడు. సిబ్బెకై విభాగంలో ఇరవై నాలుగు వేలమంది సైనికులు వున్నారు.
12. తొమ్మిదవ అధిపతి అబీయెజెరు. అబీయెజెరు తొమ్మిదవ నెలలో అధిపతి. అబీయెజెరు అనాతోతు పట్టణం వాడు. అతడు బెన్యామీనీయుడు. అబీయెజెరు దళంలో ఇరవై నాలుగువేల మంది సైనికులు వున్నారు.
13. పదవ అధిపతి మహరై. మహరై పదవ నెలలో అధిపతి. మహరై నెటోపాతీయుడు. అతడు జెరహు సంతతివాడు. మహరై దళంలో ఇరవై నాలుగువేల మంది సైనికులున్నారు.
14. పదకొండవ అధిపతి బెనాయా. బెనాయా పదకొండవ నెలలో అధిపతి. అతడు పిరాతోనీయుడు. బెనాయా ఎఫ్రాయిము సంతతివాడు. బెనాయా వర్గంలో ఇరవై నాలుగువేల మంది సైనికులు వున్నారు.
15. పన్నెండవ అధిపతి హెల్దయి. పన్నెండవ నెలలో అధిపతి హెల్దయి. అతడు నెటోపాతీయుడు. హెల్దయి ఓత్నీయేలు కుటుంబీకుడు. హెల్దయి దళంలో ఇరవై నాలుగువేల మంది సైనికులు వున్నారు. [PS]
16. {వంశ నాయకులు} [PS] ఇశ్రాయేలు వంశాలు, వాటి పెద్దలు ఎవరనగా: రూబేను: జిఖ్రీ కుమారుడైన ఎలీయెజెరు. షిమ్యోను: మయకా కుమారుడైన షెఫట్య.
17. లేవీ: కెమూయేలు కుమారుడైన హషబ్యా. అహరోను: సాదోకు.
18. యూదా: దావీదు సోదరులలో ఒకడై ఎలీహు. ఇశ్శాఖారు: మిఖాయేలు కుమారుడగు ఒమ్రీ.
19. జెబూలూను: ఓబద్యా కుమారుడైన ఇష్మయా. నఫ్తాలి: అజీ్రయేలు కుమారుడైన యెరీమోతు.
20. ఎఫ్రాయిము: అజజ్యాహు కుమారుడైన హోషేయ. పశ్చిమ మనష్షే: పెదాయా కుమారుడైన యోవేలు.
21. తూర్పు మనష్షే: జెకర్యా కుమారుడైన ఇద్దో. బెన్యామీను: అబ్నేరు కుమారుడగు యహశీయేలు.
22. దాను: యెహోరాము కుమారుడు అజరేలు. వారంతా ఇశ్రాయేలు వంశాలకు అధిపతులు. [PS]
23. {దావీదు ఇశ్రాయేలీయులను లెక్కించటం} [PS] ఇశ్రాయేలు జనాభా లెక్కలు తీయటానికి దావీదు నిర్ణయించాడు. అయితే వారు అసంఖ్యాకంగా వున్నారు. ఎందువల్లననగా దేవుడు ఇశ్రాయేలు వారిని ఆకాశంలో నక్షత్రాల్లా వృద్ధిచేస్తానని చెప్పాడు. అందువల్ల దావీదు ఇరవై ఏండ్ల వయస్సు వారిని, అంతకు పైబడిన వయస్సు వారిని మాత్రమే లెక్కించమన్నాడు.
24. సెరూయా కుమారుడైన యోవాబు జనాభా లెక్కలు ప్రారంభించాడు. కాని పూర్తి చేయలేదు. [*యోవాబు … చేయలేదు చూడండి దినవృత్తాంతములు మొదటి గ్రంథం 21:1-30.] ఇశ్రాయేలు ప్రజల పట్ల దేవుడు మిక్కిలి కోపం చెందాడు. అందువల్ల రాజైన దావీదు పాలన గురించిన చరిత్ర గ్రంథంలో జనాభాసంఖ్య చేర్చబడలేదు. [PS]
25. {రాజకార్య నిర్వహకులు} [PS] రాజుయొక్క ఆస్తి కాపాడటంలో బాధ్యతగల వారెవరనగా: అదీయేలు కుమారుడు అక్మావెతు ఆధీనంలో రాజగిడ్డంగులు వుంచారు. చిన్న చిన్న పట్టణాలలోను, గామాలలోను, పొలాలలోను, దుర్గాలలోను వున్న వస్తువులను భధ్రపరచు గదులకు బాధ్యత, ఉజ్జీయా కుమారుడైన యోనాతానుకు [†యోనాతాను యెహోనాతాను అని పాఠాంతరం.] ఇవ్వబడింది.
26. వ్యవసాయ కూలీలపై కెలూబు కుమారుడైన ఎజీ నియమితుడయ్యాడు.
27. ద్రాక్షా తోటల సంరక్షణాధికారి షిమీ, షిమీ రామా పట్టణానికి చెందినవాడు. ద్రాక్షాతోటలనుండి సేకరించిన ద్రాక్షా రసపు నిల్వలు, వాటి పరిరక్షణ బాధ్యత జబ్దికి ఇవ్వబడింది. జబ్ది షెపాము ఊరివాడు.
28. పడమటి కొండల ప్రాంతంలో ఒలీవ చెట్ల, మేడి చెట్ల పరిరక్షణ, నిర్వహణ బాధ్యత బయల్ హనాను వహించాడు. బయల్ హనాను గెదేరీయుడు. ఒలీవ నూనె నిల్వల మీద అధికారి యోవాషు.
29. షారోను ప్రాంతంలో మేసే ఆవుల మీద పర్యవేక్షకుడు షిట్రయి. షిట్రయి షారోను ప్రాంతంవాడు. లోయలోని ఆవుల మీద అధికారి అద్లయి కుమారుడైన షాపాతు.
30. ఒంటెలపై అధికారి ఓబీలు ఇష్మాయేలీయుడు. గాడిదల సంరక్షణాధికారి యెహెద్యాహు. యెహెద్యాహు మేరోనో తీయుడు.
31. గొర్రెల విషయం చూసే అధికారి యాజీజు. యాజీజు హగ్రీయుడు. నాయకులైన ఈ వ్యక్తులందరూ రాజైన దావీదు ఆస్తి విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవటానికి నియమితులయ్యారు. [PE][PS]
32. యోనాతాను తెలివైన సలహాదారు. పైగా లేఖకుడు. యోనాతాను దావీదు పినతండ్రి. రాజకుమారుల యోగక్షేమాలు తెలుసుకోవటానికి హక్మోనీ కుమారుడైన యెహీయేలు నియమింపబడ్డాడు.
33. అహీతోపెలు రాజుకు సలహాదారు (మంత్రి). హూషై రాజుకు స్నేహితుడు (చెలికాడు). హూషై అర్కీయుడు.
34. అహీతోపెలు తరువాత అతని స్థానంలో యెహోయాదా మరియు అబ్యాతారు లిరువురూ రాజుకు సలహాదారులయ్యారు. యెహోయాదా తండ్రి పేరు బెనాయా. యోవాబు రాజు సేనకు అధిపతి. [PE]