1. {సమూయేలు జననం} [PS] ఎఫ్రాయిము కొండ ప్రాంతంలో రామతయిము-సోఫీము అనే ఊరిలో ఒక వ్యక్తి ఉండేవాడు. అతని పేరు ఎల్కానా. అతడు యెరోహాము కొడుకు. యెరోహాము ఎలీహు కొడుకు. ఎలీహు తోహు కొడుకు. తోహు సూపు కొడుకు. సూపు ఎఫ్రాయీము గోత్రంవాడు. ఎల్కానాకు ఇద్దరు భార్యలు.
2. ఒకామె హన్నా, రెండవది పెనిన్నా. పెనిన్నాకు పిల్లలు పుట్టారు, హన్నాకు పిల్లలు లేరు. [PE][PS]
3. ఎల్కానా షిలోహులో సైన్యాలకు అధిపతి అయిన యెహోవాకు మొక్కుబడులు చెల్లించడానికీ, బలులు అర్పించడానికీ ప్రతి సంవత్సరం తన ఊరినుండి అక్కడికి వెళ్తుండేవాడు. ఆ రోజుల్లో ఏలీ కుమారులు హొఫ్నీ, ఫీనెహాసు అనే ఇద్దరు యెహోవాకు యాజకులుగా ఉన్నారు. [PE][PS]
4. ఎల్కానా బలి అర్పించే సమయంలో అతని భార్య పెనిన్నాకు, ఆమె కుమారులకు, కుమార్తెలకు భాగం ఇస్తూ వచ్చాడు.
5. అయితే అతనికి హన్నా అంటే ఎక్కువ ఇష్టం గనక యెహోవా ఆమెకు సంతానం ఇవ్వకపోయినా అతడు ఆమెకు రెండు భాగాలు ఇస్తుండేవాడు.
6. యెహోవా ఆమెకు సంతానం కలగకుండా చేయడంవల్ల ఆమె సవతి పెనిన్నా ఆమెను విసిగిస్తూ, కోపం పుట్టిస్తూ ఉండేది. [PE][PS]
7. ఎల్కానా ప్రతి సంవత్సరం అలాగే చేస్తూ ఉండేవాడు. హన్నా యెహోవా మందిరానికి వెళ్ళినప్పుడల్లా పెనిన్నా ఆమెను విసిగించేది. అందువల్ల ఆమె భోజనం చేయకుండా ఏడుస్తూ ఉండేది.
8. ఆమె భర్త ఎల్కానా “హన్నా, నీవెందుకు ఏడుస్తున్నావు? భోజనం ఎందుకు చేయడం లేదు? నీ మనసులో విచారం ఎందుకు? పదిమంది కొడుకులకన్నా నేను నీకు ఎక్కువ కాదా?” అని ఆమెతో చెబుతూ ఉండేవాడు. [PE][PS]
9. వారు షిలోహులో భోజనం ముగించిన తరువాత హన్నా లేచినపుడు యాజకుడైన ఏలీ మందిర స్తంభం దగ్గర ఉన్న కుర్చీపై కూర్చుని ఉన్నాడు.
10. తీవ్రమైన దుఃఖంలో ఉన్న హన్నా యెహోవా సన్నిధిలో ఏడుస్తూ ప్రార్థన చేస్తూ ఉంది. [PE][PS]
11. ఆమె ఒక ప్రమాణం చేస్తూ “సైన్యాలకు అధిపతి అయిన యెహోవా, నీ సేవకురాలనైన నాకు కలిగిన బాధను చూసి నన్ను మరచిపోకుండా జ్ఞాపకం చేసుకుని, నీ సేవకురాలనైన నాకు ఒక కుమారుణ్ణి దయచేస్తే వాడు బతికే కాలమంతా వాణ్ణి యెహోవాకు సమర్పిస్తాను. వాడి తలకు ఎన్నటికీ మంగలి కత్తి తగలనియ్యను” అని చెప్పింది. ఆమె యెహోవా సన్నిధిలో ప్రార్థన చేస్తుండగా ఏలీ ఆమె నోటి కదలికలు కనిపెడుతున్నాడు.
12. ఎందుకంటే హన్నా తన మనస్సులోనే మాట్లాడుకుంటూ ఉంది.
13. ఆమె పెదవులు మాత్రం కదులుతున్నాయి. ఆమె స్వరం వినబడడం లేదు. అందువల్ల ఏలీ ఆమె మద్యం సేవించి ఉంది అనుకున్నాడు.
14. అతడామెతో “ఎంతసేపు నువ్వు మత్తులో ఉంటావు? ద్రాక్ష మద్యం ఇక చాలించు” అన్నాడు. [PE][PS]
15. అందుకు హన్నా “ప్రభూ, అది కాదు, నేను మనసులో దుఃఖంతో నిండి ఉన్నాను. నేను ద్రాక్షరసం గానీ, మరి ఏ మద్యం గానీ తీసుకోలేదు. నా ఆత్మను యెహోవా సన్నిధిలో ఒలకబోస్తూ ఉన్నాను.
16. నీ సేవకురాలనైన నన్ను చెడ్డదానిగా అనుకోవద్దు. మితిమీరిన దిగులు, అందోళనల వల్ల నాలో నేను చెప్పుకుంటున్నాను” అని జవాబిచ్చింది. [PE][PS]
17. అప్పుడు ఏలీ “నువ్వు క్షేమంగా వెళ్లు. ఇశ్రాయేలు దేవునితో నువ్వు చేసికొన్న మనవి ఆయన దయచేస్తాడు గాక” అని ఆమెతో చెప్పాడు.
18. ఆమె అతనితో “నీ సేవకురాలనైన నేను ఈ విషయంలో కృప పొందుతాను” అన్నది. తరువాత ఆ స్త్రీ తన ఇంటికి వెళ్లిపోయి భోజనం చేస్తూ అప్పటినుండి విచారంగా ఉండడం మానుకుంది. [PE][PS]
19. తరువాత వారు ఉదయాన్నే త్వరగా లేచి యెహోవాకు మొక్కి తిరిగి రమాలోని తమ ఇంటికి వచ్చారు. అప్పుడు ఎల్కానా తన భార్య హన్నాను కూడినప్పుడు, యెహోవా ఆమె ప్రార్థనకు జవాబిచ్చాడు.
20. హన్నా గర్భం ధరించి, రోజులు గడిచిన తరువాత ఒక కొడుకుని కని “నేను మహోన్నతమైన యెహోవాకు మొక్కుకుని వీణ్ణి అడిగాను” అని చెప్పి ఆ పసికందుకు సమూయేలు అని పేరు పెట్టింది. [PS]
21. {సమూయేలును హన్నా ప్రతిష్టించడం} [PS] ఎల్కానా, అతని ఇంటి వారంతా యెహోవాకు ప్రతి ఏడూ అర్పించే బలులు అర్పించడానికి, మొక్కుబడులు చెల్లించడానికి వెళ్లారు.
22. అయితే హన్నా “బిడ్డ పాలు మానే వరకూ నేను రాను, వాడు యెహోవా సన్నిధిలో కనపడి మళ్ళీ తిరిగి రాకుండా అక్కడే ఉండేలా నేను వాణ్ణి తీసుకువస్తాను” అని తన భర్తతో చెప్పి మందిరానికి వెళ్ళలేదు.
23. అప్పుడు ఆమె భర్త ఎల్కానా “నీకు ఏది మంచిదనిపిస్తే అది చెయ్యి. నువ్వు వాడికి పాలు మాన్పించే వరకూ రావద్దు. యెహోవా తన వాక్కును స్థిరపరుస్తాడు గాక” అని ఆమెతో అన్నాడు. ఆమె అక్కడే ఉండిపోయి తన కొడుకు పాలు మానేవరకూ అతన్ని పెంచుతూ ఉంది. [PE][PS]
24. పాలు మానిన తరువాత బాలుడు ఇంకా పసి వాడుగా ఉన్నప్పుడే ఆమె అతణ్ణి ఎత్తుకుని మూడేళ్ళ కోడెదూడ, తూమెడు పిండి, ద్రాక్షారసం తిత్తిని తీసుకు షిలోహులోని మందిరానికి వచ్చింది.
25. వారు ఒక కోడెను వధించి, పిల్లవాణ్ణి ఏలీ దగ్గరకి తీసుకు వచ్చారు. అప్పుడామె అతనితో ఇలా చెప్పింది,
26. “ప్రభూ, నా ప్రభువు జీవం తోడు నీ దగ్గర నిలబడి బిడ్డను దయచేయమని యెహోవాను ప్రార్థించిన స్త్రీని నేనే.
27. యెహోవాను నేను వేడుకొన్నది ఆయన నాకు అనుగ్రహించాడు.
28. కాబట్టి నేను ఆ బిడ్డను యెహోవాకు సమర్పిస్తున్నాను. అతడు జీవించే కాలమంతటిలో వాడు యెహోవాకు ప్రతిష్ట అయిన వాడు” అని చెప్పింది. ఎల్కానా, అతని కుటుంబం అక్కడే యెహోవాను ఆరాధించారు. [PE]