1. {దేవుని మందసం ఫిలిష్తీయుల స్వాధీనం చేసుకోవడం} [PS] ఇశ్రాయేలీయులు ఫిలిష్తీయులతో యుద్ధం చేయడానికి సిద్ధపడి ఎబెనెజరులో సమావేశమయ్యారు. ఫిలిష్తీయులు ఆఫెకులో ఉన్నారు.
2. ఫిలిష్తీయులు బారులు తీరి నిలబడి ఇశ్రాయేలీయులపై యుద్ధం చేయగా ఇశ్రాయేలీయులు ఫిలిష్తీయుల చేతిలో ఓడిపోయి యుద్ధభూమిలోనే దాదాపు నాలుగు వేలమంది మరణించారు. [PE][PS]
3. ప్రజలు ఊరికి తిరిగి వచ్చాక ఇశ్రాయేలీయుల పెద్దలు “యెహోవా ఈ రోజు ఎందుకు మనలను ఫిలిష్తీయుల చేతిలో ఓడిపోయేలా చేశాడు? షిలోహులో ఉన్న యెహోవా నిబంధన మందసాన్ని తీసుకొచ్చి మన మధ్యనే ఉంచుకుందాము. అది [* అది యెహోవా ] మన మధ్య ఉంటే మనలను శత్రువుల చేతిలో నుండి కాపాడుతుంది” అన్నారు. [PE][PS]
4. కాబట్టి పెద్దలు కొందరిని షిలోహుకు పంపించి అక్కడనుండి కెరూబుల మధ్య ఆసీనుడై ఉన్న సైన్యాలకు అధిపతి యెహోవా నిబంధన మందసాన్ని తెప్పించారు. ఏలీ ఇద్దరు కుమారులు హొఫ్నీ, ఫీనెహాసు కూడా అక్కడే దేవుని నిబంధన మందసం దగ్గర ఉన్నారు. [PE][PS]
5. యెహోవా నిబంధన మందసాన్ని ప్రజల మధ్యకు తెచ్చినప్పుడు ఇశ్రాయేలు ప్రజలంతా భూమి దద్దరిల్లి పోయేలా కేకలు వేశారు.
6. ఫిలిష్తీయులు ఆ కేకలు విని, హెబ్రీయుల గుంపులో ఈ గొప్ప కేకలు ఏమిటో అని ఆరా తీసి, యెహోవా నిబంధన మందసాన్ని శిబిరంలోకి తెచ్చారని తెలుసుకున్నారు. [PE][PS]
7. వారు భయపడి, దేవుడు శిబిరంలోకి వచ్చాడనుకుని “అయ్యో, ఇక మనకి మూడింది. ఇలాంటిది ఇంతకుముందు ఎప్పుడూ జరగలేదు,
8. అయ్యో, మహాశూరుడైన ఈ దేవుడి చేతిలోనుండి మనలను ఎవరు విడిపిస్తారు? అరణ్యంలో రకరకాల తెగుళ్ళు రప్పించి ఐగుప్తు వారిని సంహరించిన దేవుడు ఈయనే గదా.
9. ఫిలిష్తీయులారా, వారు మన ముందు ఓడిపోయి దాసులు అయినట్టు మనం ఈ హెబ్రీయులకి దాసులు కాకూడదు. మనమంతా ధైర్యంగా నిలబడి బలం తెచ్చుకుని యుద్ధం చేద్దాం” అని చెప్పుకున్నారు. [PE][PS]
10. ఫిలిష్తీయులు యుద్ధం చేసినప్పుడు ఇశ్రాయేలీయులు ఓడిపోయి అందరూ పారిపోయి తమ డేరాలకు తిరిగి వచ్చారు. అప్పుడు భయంకరమైన వధ జరిగింది. ఇశ్రాయేలీయుల్లో 30 వేలమంది సైనికులు చనిపోయారు.
11. శత్రువులు దేవుని మందసాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఇంకా ఏలీ కొడుకులు హొఫ్నీ, ఫీనెహాసు ఇద్దరినీ చంపేశారు. [PS]
12. {ఏలీ మరణం} [PS] ఆ రోజు బెన్యామీను గోత్రానికి చెందిన ఒకడు యుద్ధభూమిలో నుండి పరుగెత్తుకొంటూ, చినిగిన బట్టలతో, తలంతా దుమ్ము కొట్టుకుపోయి షిలోహుకు వచ్చాడు.
13. అతడు వచ్చినప్పుడు ఏలీ దారి పక్కన కూర్చుని ఎదురు చూస్తున్నాడు. ఎందుకంటే దేవుని మందసం విషయం అతనికి గుండె బద్దలౌతూ ఉంది. ఆ వ్యక్తి నగరంలోకి సమాచారం తెచ్చినప్పుడు అంతా కేకలు వేశారు. [PE][PS]
14. ఏలీ ఆ కేకలు విని “ఈ కేకల శబ్దం ఏమిటి?” అని అడిగాడు. ఆ వ్యక్తి తొందరగా వచ్చి ఏలీతో జరిగిన సంగతి చెప్పాడు. [PE][PS]
15. అప్పుడు ఏలీ వయసు తొంభై ఎనిమిదేళ్లు. అతనికి చూపు మందగించి కళ్ళు కనిపించడం లేదు.
16. ఆ వ్యక్తి “యుద్ధంలో నుండి వచ్చినవాణ్ణి నేనే, ఈ రోజు యుద్ధంలో నుండి పారిపోయి వచ్చాను” అని ఏలీతో చెప్పాడు. ఏలీ “నాయనా, అక్కడ ఏమి జరిగింది?” అని అడిగాడు.
17. అందుకు అతడు “ఇశ్రాయేలీయులు ఫిలిష్తీయుల ముందు నిలబడలేక పారిపోయారు. జనంలో చాలామంది చనిపోయారు. హొఫ్నీ, ఫీనెహాసు అనే నీ ఇద్దరు కొడుకులూ చనిపోయారు. ఫిలిష్తీయులు దేవుని మందసాన్ని పట్టుకున్నారు” అని చెప్పాడు. [PE][PS]
18. దేవుని మందసం విషయం అతడు చెప్పగానే ఏలీ గుమ్మం దగ్గర ఉన్న ఆసనం మీద నుండి వెనుకకు పడి మెడ విరిగి చనిపోయాడు. ఎందుకంటే అతడు ముసలివాడు, స్థూల కాయుడు. అతడు నలభై ఏళ్లు ఇశ్రాయేలు ప్రజలకు న్యాయాధికారిగా ఉన్నాడు. [PE][PS]
19. నెలలు నిండి ప్రసవించడానికి సిద్ధంగా ఉన్న ఏలీ కోడలు ఫీనెహాసు భార్య శత్రువులు దేవుని మందసాన్ని పట్టుకున్నారనీ, తన మామ, భర్త చనిపోయారనీ విని, నొప్పులు ఎక్కువై మోకాళ్ల మీద కూలబడి అక్కడే ప్రసవించింది.
20. ఆమె చనిపోతుండగా అక్కడ నిలబడిన స్త్రీలు ఆమెతో “భయపడకు, నీకు కొడుకు పుట్టాడు” అని చెప్పారు. ఆమె ఎలాంటి మాటా చెప్పలేదు. ఏమీ పట్టించుకోలేదు.
21. ఆమె దేవుని మందసాన్ని పట్టుకున్నారనే విషయం, తన మామ, భర్త చనిపోయారన్న విషయం తెలుసుకుని “ఇశ్రాయేలీయుల్లో నుండి ప్రభావం వెళ్ళిపోయింది” అని చెప్పి, తన బిడ్డకు ఈకాబోదు అనే పేరు పెట్టింది. [PE][PS]
22. “శత్రువులు దేవుని మందసాన్ని పట్టుకోవడం వలన ఇశ్రాయేలీయుల్లో నుండి ప్రభావం వెళ్ళిపోయింది” అని ఆమె అంది. [PE]