1. {#1కోరెషు రాజాజ్ఞ [BR]1:1-3; 2దిన 36:22-23 } [PS]యెహోవా తాను యిర్మీయా ద్వారా పలికిన మాటలు నెరవేర్చడానికి పర్షియా రాజు కోరెషు పాలన మొదటి సంవత్సరంలో రాజు మనస్సును ప్రేరేపించాడు. అతడు తన రాజ్యమంతటా రాతపూర్వకంగా చాటింపు వేయించి ఇలా ప్రకటించాడు.
2. “పర్షియా రాజు కోరెషు ఇలా ఆజ్ఞాపిస్తున్నాడు. ఆకాశంలో ఉండే దేవుడైన యెహోవా లోకంలో ఉన్న ప్రజలందరినీ నాకు లోబరిచాడు. ఆయన యూదా దేశంలో ఉన్న యెరూషలేములో తనకు మందిరం కట్టించాలని నాకు ఆజ్ఞ ఇచ్చాడు.
3. మీలో ఆయన ప్రజలందరికీ దేవుడు తోడుగా ఉంటాడు గాక. వారు యూదా దేశంలోని యెరూషలేముకు బయలుదేరి, ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా మందిరాన్ని కట్టాలి.
4. యెరూషలేములో వివిధ ప్రాంతాల్లో మిగిలి ఉన్న ప్రజలు దేవుని మందిరం కట్టించడానికి ఇష్టపూర్తిగా తమ దగ్గరున్న వెండి బంగారాలను, వస్తువులను, పశువులను ఇచ్చి సహాయం చేయాలి.” [PE]
5. [PS]అప్పుడు యూదా పెద్దలు, బెన్యామీనీయుల పెద్దలు, యాజకులు, లేవీయులు ఎవరి మనస్సులను దేవుడు ప్రేరేపించాడో వారంతా సమకూడి యెరూషలేములో ఉన్న యెహోవా మందిరం కట్టడానికి బయలుదేరారు.
6. మిగిలి ఉన్న ప్రజలు ఇష్టపూర్వకంగా ఇచ్చినవి కాకుండా, వెండి వస్తువులు, బంగారం, పశువులు, విలువైన వస్తువులు ఇచ్చి వారికి సహాయం చేశారు. [PE]
7. [PS]ఇవి కాక, నెబుకద్నెజరు యెరూషలేము నుండి దోచుకుని వచ్చి తన దేవుళ్ళ గుడుల్లో ఉంచిన యెహోవా మందిర ఉపకరణాలను కోరెషు రాజు బయటికి తీయించాడు.
8. కోరెషు రాజు తన కోశాధికారి మిత్రిదాతు ద్వారా వాటిని బయటికి తెప్పించి లెక్క వేయించి, వాటిని యూదుల అధిపతి షేష్బజ్జరు చేతికి అప్పగించాడు.
9. వాటి మొత్తం లెక్క 30 బంగారం పళ్ళాలు, 1,000 వెండి పళ్ళాలు, 29 కత్తులు,
10. 30 బంగారం గిన్నెలు, 410 చిన్న వెండి గిన్నెలు, ఇంకా 1,000 వేరే రకం వస్తువులు.
11. బంగారు, వెండి వస్తువులు అన్నీ కలిపి 5, 400. ఈ మొత్తం వస్తువులతోపాటు బబులోను చెర నుండి విడుదలైన వారిని కూడా వెంటబెట్టుకుని షేష్బజ్జరు యెరూషలేముకు తీసుకువచ్చాడు. [PE]