1. [QS]యెహోవా యాకోబు మీద జాలిపడతాడు. ఆయన మళ్ళీ ఇశ్రాయేలును ఎంపిక చేసుకుని వారికి తమ స్వదేశంలో పూర్వ క్షేమ స్థితి కలిగిస్తాడు. పరదేశులు వాళ్ళల్లో కలిసి, యాకోబు సంతతితో జత కూడుతారు. [QE]
2. [QS]ఇతర జాతులు వాళ్ళను తమ సొంత దేశానికి తీసుకు పోతారు. ఇశ్రాయేలు వంశస్థులు యెహోవా దేశంలో వాళ్ళను దాసదాసీలుగా ఉపయోగించుకుంటారు. తమను బందీలుగా పట్టుకున్న వాళ్ళను వాళ్ళు బందీలుగా పట్టుకుంటారు. తమను బాధించిన వాళ్ళ మీద పరిపాలన చేస్తారు. [QE]
3. [QS]ఆ రోజున నీ బాధ నుంచి, నీ వేదన నుంచి, నువ్వు చెయ్యాల్సి వచ్చిన కష్టం నుంచి యెహోవా నీకు విశ్రాంతి ఇస్తాడు. [QE]
4. [QS]ఆ రోజున నువ్వు బబులోను రాజు గూర్చి ఎగతాళి పాట ఎత్తి ఇలా పాడతావు. [QE][QS]“బాధించిన వాళ్లకు అంతం ఎలా వచ్చిందో చూడు. గర్వించిన రౌద్రం ఎలా అంతమయ్యిందో చూడు! [QE]
5. [QS]దుష్టుల దుడ్డుకర్రనూ, ఎడతెగని హత్యలతో జాతులను క్రూరంగా కొట్టిన పాలకుల రాజదండాన్ని యెహోవా విరగ్గొట్టాడు. [QE]
6. [QS]వాళ్ళు ఆగ్రహంతో నిరంకుశ బలత్కారంతో జాతులను లోబరచుకున్నారు. [QE]
7. [QS]భూలోకమంతా నిమ్మళించి విశ్రాంతిగా ఉంది. వాళ్ళు పాటలతో తమ సంబరాలు మొదలు పెట్టారు. [QE]
8. [QS]నిన్ను గూర్చి తమాల వృక్షాలు, లెబానోను దేవదారు వృక్షాలు సంతోషిస్తూ ఇలా అంటాయి, ‘నువ్వు ఓడిపోయినప్పట్నుంచి చెట్లు నరికే వాడెవడూ మమ్మల్ని నరకడానికి మా మీదకు రాలేదు.’ [QE]
9. [QS]నువ్వు ప్రవేశిస్తూ ఉండగానే నిన్ను ఎదుర్కోడానికి పాతాళం నీ కోసం ఆసక్తిగా ఎదురు చూస్తోంది. అది నీ కోసం చనిపోయిన వాళ్ళను లేపుతోంది. భూరాజులందరినీ, జనాల రాజులందరినీ వాళ్ళ సింహాసనాల మీద నుంచి లేపుతోంది. [QE]
10. [QS]వాళ్ళందరూ నిన్ను చూసి, నువ్వు కూడా మాలాగే బలహీనుడివయ్యావు. నువ్వూ మాలాంటి వాడివయ్యావు. [QE]
11. [QS]నీ ఆడంబరం, నీ తీగ వాయిద్య స్వరం పాతాళానికి పడిపోయాయి. నీ కింద పురుగులు వ్యాపిస్తాయి. క్రిములు నిన్ను కప్పుతాయి. [QE]
12. [QS]తేజోనక్షత్రమా, వేకువచుక్కా, ఆకాశం నుంచి నువ్వెలా పడిపోయావు? జాతులను కూల్చిన నువ్వు నేలమట్టం వరకూ ఎలా తెగి పడిపోయావు? [QE]
13. [QS]నువ్వు నీ హృదయంలో, ‘నేను ఆకాశానికి ఎక్కిపోతాను, దేవుని నక్షత్రాలకన్నా ఎత్తుగా నా సింహాసనాన్ని గొప్ప చేసుకుంటాను, ఉత్తరం వైపు ఉన్న సభాపర్వతం మీద కూర్చుంటాను, [QE]
14. [QS]మేఘమండలం మీదకు ఎక్కుతాను, మహోన్నతుడైన దేవునితో నన్ను సమానంగా చేసుకుంటాను’ అనుకున్నావు.
15. అయితే నువ్వు ఇప్పుడు పాతాళపు లోతుల్లోకి దిగిపోయావు. నరకంలో పడి ఉన్నావు. [QE]
16. [QS]నిన్ను చూసిన వాళ్ళు నిన్ను నిదానించి చూస్తూ ఇలా అంటారు, [QE]
17. [QS]‘భూమిని కంపింపజేసి రాజ్యాలను వణకించినవాడు ఇతడేనా? లోకాన్ని నిర్జన ప్రదేశంగా చేసి, దాని పట్టణాలను పాడు చేసినవాడు ఇతడేనా? తాను చెరపట్టిన వాళ్ళను తమ నివాసస్థలానికి వెళ్ళనివ్వనివాడు ఇతడేనా?’ [QE]
18. [QS]జాతులన్నిటి రాజులందరూ ఘనత వహించినవారై తమ తమ సమాధుల్లో నిద్రిస్తున్నారు. [QE]
19. [QS]కానీ నువ్వు పారేసిన కొమ్మలా ఉన్నావు. కత్తివాత చచ్చిన శవాలు నిన్ను కప్పుతున్నాయి. అగాధంలో ఉన్న రాళ్ళ దగ్గరికి దిగిపోయిన వాళ్ళ శవాలు నిన్ను కప్పుతున్నాయి. నువ్వు తొక్కేసిన పీనుగులా అయ్యావు. [QE]
20. [QS]నీవు నీ దేశాన్ని పాడుచేసి నీ ప్రజలను హతం చేశావు. వాళ్ళతో పాటు నువ్వు సమాధిలో ఉండవు. దుష్టుల సంతానం ఎన్నడూ జ్ఞాపకానికి రాదు. [QE]
21. [QS]తమ పూర్వీకుల అపరాధం కారణంగా అతని కొడుకులను హతం చేసే స్థలం సిద్ధం చెయ్యండి. వాళ్ళు పెరిగి భూమిని స్వాధీనం చేసుకుని పట్టణాలతో లోకాన్ని నింపకూడదు.” [QE]
22. [QS]సైన్యాలకు అధిపతి అయిన యెహోవా వాక్కు ఇదే “నేను వాళ్ళ మీదకు లేచి, బబులోనుకు దాని పేరునూ, శేషించిన వారినీ, సంతానాన్నీ లేకుండా కొట్టేస్తాను.” ఇది యెహోవా ప్రకటన. [QE]
23. [QS]“నేను దాన్ని గుడ్లగూబల స్వాధీనం చేస్తాను. దాన్ని నీటి మడుగులుగా చేస్తాను. నాశనం అనే చీపురుకట్టతో దాన్ని తుడిచి పెట్టేస్తాను.” ఇది సైన్యాలకు అధిపతి అయిన యెహోవా ప్రకటన. [QE]
24. {#1అష్షూరు గురించి ప్రవచనం } [QS]సైన్యాలకు అధిపతి అయిన యెహోవా ప్రమాణపూర్వకంగా ఇలా అంటున్నాడు. “కచ్చితంగా నేను ఉద్దేశించినట్టే అది జరుగుతుంది. నేను యోచన చేసినట్టే అది ఉంటుంది. [QE]
25. [QS]నా దేశంలో అష్షూరును విరగ్గొడతాను. నా పర్వతాల మీద అతన్ని నా కాళ్ళ కింద తొక్కుతాను. అప్పుడు అతని కాడి నా ప్రజల మీద నుంచి తొలగిపోతుంది. అతని భారం వాళ్ళ భుజాల మీద నుంచి తేలిపోతుంది. [QE]
26. [QS]సర్వలోకం గురించి నేను చేసిన ఆలోచన ఇదే. జాతులన్నిటి మీదా చాపిన చెయ్యి ఇదే. [QE]
27. [QS]సైన్యాలకు అధిపతి అయిన యెహోవా దాన్ని ఆలోచించాడు. ఆయన్ని ఆపేవాడెవడు? ఆయన చెయ్యి ఎత్తి ఉంది. దాన్ని ఎవడు వెనక్కి తిప్పుతాడు?” [QE]
28. {#1ఫిలిష్తియా గురించి ప్రవచనం } [QS]రాజైన ఆహాజు చనిపోయిన సంవత్సరం ఈ ప్రకటన వచ్చింది, [QE]
29. [QS]“ఫిలిష్తియా, నిన్ను కొట్టిన దండం విరిగిపోయిందని సంతోషించకు. ఆ సర్పవంశం నుంచి కట్లపాము వస్తుంది. దాని సంతానం, రెక్కల అగ్ని సర్పం. [QE]
30. [QS]అప్పుడు పేదలకే పేదలైన[* పేదలకే పేదలైన అతిపేదలు ] వారు భోజనం చేస్తారు. నిరాశ్రయులు క్షేమంగా పండుకుంటారు. కాని, నేను నీ సంతానాన్ని కరువుతో చంపేస్తాను. అది నీలో మిగిలిన వాళ్ళను హతం చేస్తుంది. [QE]
31. [QS]ద్వారమా, ప్రలాపించు. పట్టణమా, అంగలార్చు. ఫిలిష్తియా, నువ్వు పూర్తిగా కరిగిపోతావు. ఎందుకంటే ఉత్తరం నుంచి పొగ మేఘం వస్తున్నది. బారులు తీరిన సైన్యంలో వెనుతిరిగే వాడు ఒక్కడూ లేడు. [QE]
32. [QS]ఆ దేశ వార్తాహరుడికి ఇవ్వాల్సిన జవాబేది? యెహోవా సీయోనును స్థాపించాడు. ఆయన ప్రజల్లో బాధకు గురైన వాళ్లకు దానిలో ఆశ్రయం దొరుకుతుంది.” [QE]