1. [PS]వాళ్ళ దేవుడైన యెహోవా వాళ్ళతో చెప్పమని తనకి ఆదేశించిన మాటలన్నిటినీ యిర్మీయా వాళ్లకు చెప్పి ముగించాడు.
2. అప్పుడు హోషేయా కొడుకు అజర్యా, కారేహ కొడుకు యోహానానూ ఇంకా అక్కడ ఆహంకారులందరూ యిర్మీయాతో “నువ్వు అబద్ధాలు చెప్తున్నావు. ‘మీరు నివసించడానికి ఐగుప్తుకు వెళ్ళవద్దు’ అని మా దేవుడు యెహోవా నీతో చెప్పి పంపలేదు.
3. మేం చావడానికీ, బబులోనుకు బందీలుగా పోవడానికీ కల్దీయుల చేతిలో చిక్కాలని నేరీయా కొడుకు బారూకు మాకు వ్యతిరేకంగా నిన్ను రెచ్చగొడుతున్నాడు” అన్నారు. [PE]
4. [PS]ఈ విధంగా కారేహ కొడుకు యోహానానూ, సైన్యాధిపతులందరూ, ఇంకా ప్రజలందరూ యూదా దేశంలో నివసించమన్న దేవుని మాట వినలేదు.
5. కారేహ కొడుకు యోహానానూ, సైన్యాధిపతులందరూ చెరలో నుండి యూదా దేశంలో నివసించడానికి అనేక ప్రాంతాల నుండి తిరిగి వచ్చిన వాళ్ళనందరినీ తీసుకు వెళ్ళారు.
6. స్త్రీ పురుషులనందరినీ, పిల్లలనూ, రాజ కుమార్తెలనూ, రాజు అంగరక్షకులకు అధిపతి అయిన నెబూజరదాను షాఫాను కొడుకైన అహీకాము కొడుకు గెదల్యా ఆధీనంలో ఉంచిన వాళ్ళనందరినీ తీసుకుని వెళ్ళారు. వాళ్ళు ప్రవక్త అయిన యిర్మీయానూ, నేరీయా కొడుకు బారూకును కూడా తీసుకు వెళ్ళారు.
7. వాళ్ళు దేవుని మాట వినకుండా ఐగుప్తుదేశంలో ఉన్న తహపనేసుకు వచ్చారు. [PE]
8. [PS]కాబట్టి యెహోవా వాక్కు తహపనేసులో ఉన్న యిర్మీయా వద్దకు వచ్చి ఇలా చెప్పాడు.
9. యూదులు చూస్తూ ఉండగా నువ్వు కొన్ని పెద్ద రాళ్ళను చేతిలో పట్టుకుని తహపనేసులో ఉన్న ఫరో భవన ద్వారం దగ్గరికి వెళ్ళు. అక్కడ ఇటుకలు పేర్చిన దారిలో సున్నం కింద వాటిని దాచి పెట్టు.
10. తర్వాత వాళ్లకిలా ప్రకటించు. “సేనల ప్రభువూ, ఇశ్రాయేలు దేవుడైన యెహోవా ఇలా చెప్తున్నాడు. ‘చూడండి, నేను నా సేవకుడూ, బబులోను రాజూ అయిన నెబుకద్నెజరును పిలవడానికి వార్తాహరులను పంపిస్తున్నాను. యిర్మీయా పాతిన ఈ రాళ్ళ పైన అతని సింహాసనాన్ని నిలబెడతాను. వాటిపైనే అతడు తన కంబళి పరుస్తాడు. [PE]
11. [PS]అతడు వచ్చి ఐగుప్తు పై దాడి చేస్తాడు. చావుకు నిర్ణయమైన వాళ్ళు చనిపోతారు. బందీలుగా వెళ్ళడానికి నిర్ణయమైన వాళ్ళు బందీలుగా వెళ్తారు. కత్తి మూలంగా చావడానికి నిర్ణయమైన వాళ్ళు కత్తి మూలంగానే చనిపోతారు.
12. అప్పుడు నేను ఐగుప్తు దేవుళ్ళ గుళ్లలో అగ్ని రాజేస్తాను. నెబుకద్నెజరు వాటిని కాల్చి వేస్తాడు. లేదా ఆ దేవుళ్ళను పట్టుకుపోతాడు. గొర్రెల కాపరి తన బట్టలపై ఉన్న పురుగులను తుడిచి పెట్టినట్టుగా అతడు ఐగుప్తు దేశాన్ని తుడిచి పెట్టేస్తాడు. విజయం సాధించి అక్కడ నుండి వెళ్తాడు.
13. అతడు ఐగుప్తులో సూర్య మందిరాలలో ఉన్న రాతి స్తంభాలను కూల్చి వేస్తాడు. ఐగుప్తు దేవుళ్ళ ఆలయాలను కాల్చివేస్తాడు.’ ” [PE]