1. {#1బెన్యామీనీయుల నాశనం } [PS]అప్పుడు దాను ప్రాంతం నుండి బెయేర్షెబా వరకూ, గిలాదు వరకూ ఉన్న ఇశ్రాయేలీయులందరూ కదలి వచ్చారు. వారి సమాజం అంతా ఒక్క వ్యక్తిలా ఒకే ఆలోచనతో మిస్పాలో యెహోవా సన్నిధిలో సమావేశమయ్యారు.
2. ఈ సమావేశంలో దేవుని ప్రజలుగా ఉన్న ఇశ్రాయేలు గోత్రాలకు నాయకులుగా ఉన్నవాళ్ళు ఉన్నారు. కత్తియుద్ధం చేయగల నాలుగు లక్షలమంది కూడా వీరిలో ఉన్నారు. [PE]
3. [PS]ఇశ్రాయేలీయులు మిస్పాలో సమావేశం అయ్యారని బెన్యామీనీయులు విన్నారు. ఇశ్రాయేలీయులు “ఈ దుర్మార్గపు పని ఎలా జరిగిందో చెప్పండి” అని అడిగారు.
4. చనిపోయిన స్త్రీ భర్త అయిన లేవీయుడు ఇలా సమాధానమిచ్చాడు. “బెన్యామీనీయులకు చెందిన గిబియాలో రాత్రి బస కోసం నేను నా ఉంపుడుగత్తెతో కలసి వచ్చాను.
5. గిబియాకు చెందినవారు ఆ రాత్రి నా మీద దాడి చేశారు. నేను ఉన్న ఇంటిని చుట్టుముట్టి నన్ను చంపాలని ప్రయత్నించారు.
6. వాళ్ళు నా ఉంపుడుగత్తెను మానభంగం చేశారు. ఆమె చనిపోయింది. ఇశ్రాయేలీయుల్లో ఇలాంటి దుర్మార్గం, దౌర్జన్యం వాళ్ళు జరిగించారు కాబట్టి నేను ఆమె శరీరాన్ని ముక్కలుగా కోసి ఇశ్రాయేలీయుల దేశమంతటికి ఆ ముక్కలను పంపాను.” [PE]
7. [PS]“ఇశ్రాయేలీయులారా, ఇప్పుడు చెప్పండి, మీరంతా ఇక్కడే ఉన్నారు. ఈ విషయం గూర్చి ఆలోచించి ఏమి చేయాలో చెప్పండి”
8. అందరూ ఒక్కసారిగా ఒకే రకంగా స్పందించారు. వాళ్ళిలా అన్నారు “మనలో ఎవరూ తన గుడారానికి గానీ తన ఇంటికి గానీ వెళ్ళడు.
9. గిబియాకు మనం చేయాల్సిన విషయంలో ఇలా చేద్దాం. మనం చీట్లు వేసి దాని ప్రకారం గిబియా పైన దాడి చేద్దాం.
10. ఇశ్రాయేలీయుల్లో జరిగిన దుర్మార్గాన్ని శిక్షించడానికై బెన్యామీను ప్రాంతంలోని గిబియాకు యుద్ధానికి వెళ్ళే వాళ్ళ కోసం ఆహారాన్ని సమకూర్చడం కోసం ప్రతి గోత్రం నుండి నూరుమందికి పదిమందినీ, అలాగే వెయ్యికి వందమందినీ పదివేలకు వెయ్యి మందినీ ఏర్పాటు చేద్దాం” అని చెప్పుకున్నారు. [PE]
11. [PS]కాబట్టి ఇశ్రాయేలీయుల సైన్యం అంతా ఒక్క వ్యక్తిలా ఏకీభవించారు. అంతా ఒకే ఉద్దేశ్యంతో ఆ పట్టాణానికి వ్యతిరేకంగా లేచారు.
12. ఇశ్రాయేలీయులు బెన్యామీనీయులందరి దగ్గరికి మనుషులను పంపారు. వారితో “మీ మధ్య జరిగిన ఈ దుర్మార్గం ఏమిటి?
13. గిబియాలో ఉన్న ఆ దుర్మార్గులను మాకు అప్పగించండి. ఇశ్రాయేలీయులపై ఈ దోషాన్ని సంపూర్ణంగా తొలగించడానికై మేము వారిని చంపుతాం” అని చెప్పించారు. కాని బెన్యామీను గోత్రం వాళ్ళు తమకు సోదరులైన ఇశ్రాయేలీయుల హెచ్చరికను పెడచెవిన పెట్టారు.
14. వారంతా తమ తమ పట్టణాల్లో నుండి యుద్ధానికి బయల్దేరి గిబియాకు వచ్చి కలిశారు.
15. ఆ రోజు బెన్యామీను గోత్రం వాళ్ళు తమ సంఖ్య ఎంతో లెక్క వేసుకున్నారు. గిబియా వాళ్ళు ఏడువందల మంది కాకుండా ఇతర పట్టణాలనుండి వచ్చినవాళ్ళు ఇరవై ఆరు వేల మంది ఉన్నారు.
16. వాళ్ళందరిలో ప్రత్యేకంగా ఏడు వందలమంది ఎడమ చేత్తో యుద్ధం చేస్తారు. వీరు ఒక ఒడిసెలలో రాయి పెట్టి తలవెంట్రుకనైనా కొట్టగల నైపుణ్యం గలవారు.
17. బెన్యామీనీయులు కాకుండా మిగిలిన ఇశ్రాయేలీయుల్లో కత్తియుద్ధం చేయగలిగిన వాళ్ళు నాలుగు లక్షలమంది అని లెక్క వేశారు. వీళ్ళంతా యుద్ధ నైపుణ్యం గలవాళ్ళు. [PE]
18. [PS]ఇశ్రాయేలీయులు లేచి బేతేలుకు[* బేతేలుకు దేవుని మందిరం ] వెళ్ళారు. అక్కడ దేవుని దగ్గర బెన్యామీనీయులతో యుద్ధానికి తమలో ముందుగా ఎవరు వెళ్ళాలో తెలపాలని మనవి చేశారు. అప్పుడు దేవుడు “యూదా వాళ్ళు వెళ్ళాలి” అని చెప్పాడు.
19. ఇక ఇశ్రాయేలీయులు ఉదయాన్నే లేచి యుద్ధానికి సిద్ధపడి గిబియాకు ఎదురుగా మొహరించారు.
20. ఇశ్రాయేలీయుల సైనికులు బెన్యామీనీయులతో యుద్ధానికి వెళ్ళి గిబియా మీద దాడి చేయడానికి బారులు తీరారు.
21. ఆ రోజున బెన్యామీనీయులు గిబియాలో నుండి బయటికి వచ్చి ఇరవై రెండు వేలమంది ఇశ్రాయేలీ సైనికులను చంపివేశారు. [PE]
22. [PS]తరువాత ఇశ్రాయేలీయులు వెళ్ళి సాయంకాలం వరకూ యెహోవా ఎదుట ఏడుస్తూ ఉన్నారు. “మా సోదరులైన బెన్యామీనీయులతో యుద్ధం చేయడానికి తిరిగి వెళ్ళాలా” అంటూ దేవుని నడిపింపు కోసం ప్రార్థించారు. అప్పుడు యెహోవా “యుద్ధానికి వెళ్ళండి” అని చెప్పాడు.
23. రెండో రోజున ఇశ్రాయేలీయులు ధైర్యం తెచ్చుకున్నారు. మొదటి రోజు తాము నిలబడిన స్థానాల్లోనే తిరిగి నిలబడ్డారు.
24. కాబట్టి ఇశ్రాయేలీయులు రెండో రోజు బెన్యామీనీయులతో యుద్ధం చేయడానికి బయల్దేరారు. వారిని ఎదుర్కోడానికి బెన్యామీనీయులు
25. గిబియాలోనుండి బయలుదేరి వచ్చి ఇశ్రాయేలీయుల్లో పద్దెనిమిది వేలమందిని చంపేశారు.
26. చనిపోయిన వాళ్ళంతా కత్తియుద్ధం చేసేవాళ్ళే. అప్పుడు ఇశ్రాయేలీయుల సైనికులూ, ప్రజలూ అంతా వెళ్ళి బేతేలులో ప్రవేశించారు. అక్కడే ఏడుస్తూ సాయంకాలం వరకూ యెహోవా సమక్షంలో కూర్చుని ఉపవాసముండి, దేవునికి దహన బలులనూ సమాధాన బలులనూ అర్పించారు. [PE]
27. [PS]ఆ రోజుల్లో యెహోవా నిబంధన మందసం అక్కడే ఉంది.
28. అహరోను మనుమడూ ఎలియాజరు కొడుకూ అయిన ఫీనేహసు ఆ రోజుల్లో ఆ మందసం దగ్గర పరిచర్య చేస్తున్నాడు. ఇశ్రాయేలీయులు “మరోసారి మా సోదరులైన బెన్యామీనీయులతో యుద్దానికి వెళ్ళాలా వద్దా” అని యెహోవా సన్నిధిలో విచారణ చేస్తూ అడిగారు. దానికి యెహోవా “వెళ్ళండి, రేపు వాళ్ళను ఓడించడానికి మీకు సహాయం చేస్తాను” అని సమాధానం ఇచ్చాడు.
29. అప్పుడు ఇశ్రాయేలీయులు గిబియా చుట్టూ సైనికులను మాటు పెట్టారు.
30. మూడో రోజున ఇంతకు ముందు లాగానే ఇశ్రాయేలీయులు బెన్యామీనీయులతో యుద్ధానికి వెళ్ళారు. గిబియా వారితో యుద్ధానికి సిద్ధపడ్డారు.
31. బెన్యామీనీయులు వాళ్ళని ఎదిరించడానికి పట్టణంలో నుండి బయలుదేరి వచ్చారు. ఇశ్రాయేలీయులను తరుముతూ పట్టణం నుండి దూరంగా వెళ్ళారు. ఇంతకు ముందులాగానే ఇశ్రాయేలీయుల్లో గాయపడ్డవాళ్ళను రాజ మార్గాల్లో చంపుతూ వెళ్ళారు. దాదాపు ముప్ఫై మందిని అలా చంపారు. ఆ మార్గాల్లో ఒకటి బేతేలుకు వెళ్తుంది. మరొకటి గిబియాకు వెళ్తుంది.
32. బెన్యామీనీయులు “ఇంతకు ముందులా వీళ్ళు మనముందు నిలువలేకపోతున్నారు” అనుకున్నారు. కానీ ఇశ్రాయేలీయులు “మనం పారిపోతూ వాళ్ళను పట్టణంలోనుండి బయటకు వచ్చేలా చేద్దాం” అని చెప్పుకున్నారు.
33. ఇశ్రాయేలు సైనికులందరూ సిద్ధపడి బయల్తామారు అనే చోట యుద్ధం కోసం బారులు తీరారు. ఈ లోగా మాటున దాగి ఉన్న సైనికులు తాము దాగి ఉన్న స్థలం నుండి గిబియాకు పడమటి వైపునుండి వేగంగా వచ్చారు.
34. అప్పుడు ఇశ్రాయేలీ సైనికుల్లో నుండి ప్రత్యేకంగా ఉన్న పదివేల మంది సైనికులు గిబియా నుండి రావడంతో భీకరమైన యుద్ధం జరిగింది. కాని తాము నాశనం అంచున ఉన్నామని బెన్యామీనీయులకు తెలియలేదు. [PE]
35. [PS]ఆ రోజు యెహోవా ఇశ్రాయేలీయుల ద్వారా బెన్యామీనీయులను ఓడించాడు. ఆ రోజున ఇశ్రాయేలీయులు బెన్యామీనీయుల్లో ఇరవై ఐదు వేల వంద మందిని చంపారు. వీళ్ళంతా కత్తియుద్ధం చేయడంలో శిక్షణ పొందినవాళ్ళు.
36. బెన్యామీను సైన్యం తమకు అపజయం కలిగిందని తెలుసుకున్నారు. ఇశ్రాయేలీ సైనికులు తాము గిబియా పైన మాటుగా పెట్టిన వారిపై నమ్మకముంచి బెన్యామీనీయులను తమపైకి రానిచ్చారు.
37. మాటుగా ఉన్న సైనికులు త్వరగా గిబియాలో చొరబడి పట్టణంలో ఉన్నవారినందరినీ కత్తితో చంపేశారు. [PE]
38. [PS]ఇశ్రాయేలు సైన్యాలకూ, మాటున ఉండేవారికీ మధ్య సంకేతం ఒకటుంది. అదేమిటంటే పట్టణంలో నుండి పెద్ద మేఘంలా పొగను రాజేయడం.
39. ఇశ్రాయేలీయులు మొదట యుద్ధం నుండి పారిపోతున్నట్టుగా కనిపించినప్పుడు బెన్యామీనీయులు “వీళ్ళు మొదటి యుద్ధంలో ఓడిపోయినట్టు ఇప్పుడు కూడా మన చేతిలో ఓడిపోతున్నారు” అనుకుని, ఇశ్రాయేలీయుల్లో దాదాపు ముప్ఫైమందిని చంపారు.
40. కాని వెనుక ఉన్న పట్టణంలో నుండి ఆకాశంలోకి పెద్ద స్తంభంలాగా పొగ పైకి లేవడం ఆరంభించింది. అప్పుడు బెన్యామీనీ యులు వెనక్కి తిరిగి చూశారు. అప్పుడు ఆ పట్టణమంతా పొగ నిండిపోయి కనిపించింది.
41. అప్పుడు ఇశ్రాయేలీయులు వెనక్కు తిరిగారు. బెన్యామీనీయులు తమకు అపజయం కలిగిందని తెలుసుకుని భయకంపితులయ్యారు.
42. ఇశ్రాయేలీయుల నుండి పారిపోవడానికి ఎడారి దారి వైపుకు వెళ్దామని చూశారు, కానీ పారిపోతుండగా వారిని పట్టణంలో నుండి వచ్చిన ఇశ్రాయేలీ సైనికులు దారిలోనే చంపారు.
43. ఇశ్రాయేలీయులు బెన్యామీనీయులను చుట్టుముట్టారు. వారి వెనకబడి తరిమారు. తూర్పు వైపున గిబియాకి ఎదురుగా నోహా దగ్గర వారిని అణచి వేశారు.
44. అక్కడ బెన్యామీనీయుల్లో పద్దెనిమిది వేలమంది మరణించారు. వీళ్ళంతా పరాక్రమవంతులు. [PE]
45. [PS]అప్పుడు మిగిలినవాళ్ళు తిరిగి ఎడారిలో ఉన్న రిమ్మోను బండకు పారిపోయారు. రాజమార్గాల్లో చెదరిపోయి ఉన్న మరో ఐదు వేలమందిని ఇశ్రాయెలీ సైనికులు వేరు చేసి వాళ్ళను గిదోము వరకూ వెంటాడి తరిమి వాళ్ళలో రెండు వేలమందిని చంపేశారు.
46. ఆ రోజు ఇరవై ఐదు వేలమంది బెన్యామీనీయులు మరణించారు. చనిపోయిన వాళ్ళంతా కత్తియుద్ధంలో శిక్షణ పొందినవారే. యుద్ధం చేయడంలో ఆరితేరినవారే.
47. కాని ఆరువందలమంది ఎడారిలో ఉన్న రిమ్మోను కొండకు పారిపోయారు. ఆ కొండ మీద నాలుగు నెలలు ఉన్నారు.
48. తరువాత ఇశ్రాయేలీయులు బెన్యామీనీయుల పైకి తిరిగి వచ్చి పట్టణంలో ఉన్నవారిని పశువులనూ దొరికిన సమస్తాన్నీ కత్తితో చంపేశారు. దీనితో పాటు తాము ఆక్రమించుకున్న పట్టణాలన్నిటినీ తగలబెట్టారు. [PE]