1. యెహోవా మోషేతో మాట్లాడి ఇలా చెప్పాడు.
2. “ఒక వ్యక్తి తన పొరుగున ఉన్నవాడు తనకు అప్పగించిన దాని విషయంలో అతణ్ణి మోసం చేసినా, వంచించినా, దోచుకున్నా, లేక తన పొరుగున ఉన్నవాణ్ణి పీడించినా
3. అతడు పోగొట్టుకున్న వస్తువు తనకు దొరికినా దాని విషయం అబద్ధం చెప్పినా, ఒట్టు పెట్టి మరీ అబద్ధం చెప్పినా, ఇంకా ఇలాంటి విషయాల్లో పాపం చేస్తే అది యెహోవాకి వ్యతిరేకంగా ఆయన ఆజ్ఞలను ఉల్లంఘించి చేసిన పాపం అవుతుంది.
4. ఇలా పాపం చేసినవాడు అపరాధి. కాబట్టి అలాంటివాడు తను ఇతరుల దగ్గర దోచుకున్నదీ, పీడించి సంపాదించిందీ, లేక తనకు అప్పగించినదీ, తనకు దొరికినదీ తిరిగి ఇచ్చివేయాలి. [PE][PS]
5. తాను దేని గురించైతే అబద్ధ ప్రమాణం చేసాడో దాన్ని పూర్తిగా చెల్లించాలి. ఇంకా అది ఎవరికి చెందుతుందో వారికి దానిలో ఐదో వంతు తప్పక చెల్లించాలి. దాన్ని అపరాధ బలి అర్పించే రోజున చెల్లించాలి.
6. తరువాత అతడు తన అపరాధబలి అర్పణను యెహోవా దగ్గరికి తీసుకుని రావాలి. అపరాధబలిగా మందలోని లోపం లేని పోట్టేలును యాజకుడి దగ్గరికి తీసుకుని రావాలి. దాని విలువను ప్రస్తుత వెల ప్రకారం నిర్థారించాలి.
7. యాజకుడు యెహోవా సమక్షంలో అతని పాపం కోసం పరిహారం చేస్తాడు. అప్పుడు అతడు ఏ ఏ విషయాల్లో అపరాధి అయ్యాడో ఆ విషయాల్లో క్షమాపణ పొందుతాడు.” [PS]
8. {దహనబలి} [PS] ఇంకా యెహోవా మోషేతో మాట్లాడి ఇలా చెప్పాడు.
9. “నువ్వు అహరోనుకీ, అతని కొడుకులకీ ఇలా ఆదేశించు, ఇది దహనబలికి సంబంధించిన చట్టం. దహనబలి అర్పణ బలిపీఠం పైన నిప్పులపై రాత్రంతా, తెల్లవారే వరకూ ఉండాలి. బలిపీఠం పైన అగ్ని మండుతూనే ఉండాలి. [PE][PS]
10. యాజకుడు నారతో చేసిన బట్టలు వేసుకోవాలి. అతని లోదుస్తులు కూడా నారతో చేసినవే అయి ఉండాలి. అతడు దహనబలి అర్పణ పూర్తిగా కాలిపోయిన తరువాత బూడిద తీసి బలిపీఠం పక్కనే ఉంచాలి.
11. తరువాత అతడు తన బట్టలు మార్చుకుని శిబిరం బయట ఉన్న పవిత్ర స్థలానికి ఆ బూడిద తీసుకు వెళ్ళాలి. [PE][PS]
12. బలిపీఠం పైన అగ్ని మండుతూనే ఉండాలి. అది ఆరిపోకూడదు. ప్రతి ఉదయం యాజకుడు దాని పైన కట్టెలు వేస్తూ ఉండాలి. దాని పైన దహనబలి అర్పణని ఉంచాలి. శాంతిబలి పశువు కొవ్వును దాని పైన దహించాలి.
13. బలిపీఠం పైన అగ్ని ఎప్పటికీ మండుతూనే ఉండాలి. అది ఆరిపోకూడదు. [PS]
14. {నైవేద్య అర్పణ} [PS] ఇక నైవేద్య అర్పణ గూర్చిన చట్టం ఇది. దీన్ని అహరోను కొడుకులు యెహోవా సమక్షంలో బలిపీఠం ఎదుట అర్పించాలి.
15. యాజకుడు నైవేద్య అర్పణ నుండి గుప్పెడు పిండినీ, కొంత నూనెనూ, దాని పైనున్న సాంబ్రాణినూ తీసి వాటిని యెహోవా మంచితనాన్ని స్మరించుకోడానికి బలిపీఠం పైన దహించాలి. అది ఆయనకు కమ్మని సువాసనను కలుగజేస్తుంది. [PE][PS]
16. అర్పించగా మిగిలిన దాన్ని అహరోనూ, అతని కుమారులూ భుజించాలి. పరిశుద్ధ స్థలం లో దాన్ని తినాలి. పొంగజేసే పదార్ధం లేకుండా దాన్ని తినాలి. ప్రత్యక్ష గుడారం ఆవరణలో దాన్ని తినాలి.
17. దాని తయారీలో పొంగజేసే పదార్ధం కలపకూడదు. నాకు అర్పించే దహనబలుల్లో వాళ్ళ భాగంగా దాన్ని నేను ఇచ్చాను. పాపం కోసం చేసే బలి అర్పణగానూ, అపరాధం కోసం చేసే బలి అర్పణ గానూ ఇచ్చాను. అది అతి పరిశుద్ధం.
18. మీ రాబోయే అన్ని తరాల్లోనూ అహరోను వారసుడైన ప్రతివాడూ యెహోవాకు దహనబలిగా అర్పించిన దానిలోనుండి దాన్ని తన భాగంగా భావించి తిన వచ్చు. వాటికి తగిలిన ప్రతిదీ పవిత్రం అవుతుంది.” [PE][PS]
19. ఇంకా యెహోవా మోషేతో మాట్లాడి ఇలా చెప్పాడు.
20. “అహరోనుకూ, అతని కొడుకులకూ ఒక్కొక్కరికీ అభిషేకం జరిగిన రోజున వాళ్ళు చెల్లించాల్సిన అర్పణ ఇది. మామూలు నైవేద్య అర్పణలాగే వాళ్ళు సుమారు ఒక కిలో సన్నని గోదుమ పిండిని ఉదయం సగం, సాయంత్రం సగం అర్పించాలి. [PE][PS]
21. దాన్ని నూనెతో పెనం పైన కాల్చాలి. అది చక్కగా కాలిన తరువాత తీసుకురావాలి. దాన్ని ముక్కలు చేసి యెహోవాకు కమ్మని సువాసనగా నైవేద్య అర్పణ చేయాలి.
22. యాజకుని కొడుకుల్లో, అభిషేకం పొంది అతడి స్థానంలో కొత్తగా యాజకుడైన వ్యక్తి అలాగే అర్పించాలి. ఆజ్ఞ ప్రకారం దాన్ని యెహోవా కోసం పూర్తిగా దహించాలి.
23. యాజకుడు అర్పించే ప్రతి నైవేద్యాన్నూ పూర్తిగా దహించాలి. దాన్ని తినకూడదు.” [PS]
24. {పాపం కోసం చేసే బలి} [PS] ఇంకా యెహోవా మోషేతో మాట్లాడి ఇలా చెప్పాడు.
25. “నువ్వు అహరోనుతోనూ, అతని కొడుకులతోనూ మాట్లాడి ఇలా చెప్పు, పాపం కోసం చేసే అర్పణ చట్టం ఇది. దహనబలి అర్పణ పశువుని వధించిన చోటే పాపం కోసం చేసే బలి అర్పణ పశువునూ యెహోవా సమక్షంలో వధించాలి. అది అతి పరిశుద్ధం.
26. ప్రత్యక్ష గుడారం ఆవరణలోని పరిశుద్ధ స్థలం లో దాన్ని తినాలి. [PE][PS]
27. దాని మాంసానికి తగిలిన ప్రతిదీ పరిశుద్ధం అవుతుంది. దాని రక్తం బట్టల పైన చిందితే రక్తం చిమ్మిన ప్రాంతాన్ని పరిశుద్ధ స్థలం లో శుభ్రం చేయాలి.
28. దాన్ని మట్టి కుండలో ఉడకబెడితే, ఆ కుండని పగలగొట్టాలి. ఒకవేళ ఇత్తడి పాత్రలో ఉడకబెడితే దాన్ని తోమి నీళ్ళతో శుభ్రం చేయాలి. [PE][PS]
29. అది అతి పరిశుద్ధమైనది కాబట్టి యాజకుడి కుటుంబంలో ప్రతి మగవాడూ దాన్ని కొంచెం తినవచ్చు.
30. కానీ పాపం కోసమైన బలి అర్పణ చేసిన పశువు రక్తం పరిహారం కోసం ప్రత్యక్ష గుడారం లోకి తీసుకు రావడం జరిగితే, ఆ పశువు మాంసం తినకూడదు. దాన్ని పూర్తిగా కాల్చి వేయాలి.” [PE]