1. {లేవీ గోత్రం} [PS] యెహోవా సీనాయి కొండపైన మోషేతో మాట్లాడిన నాటికి అహరోను మోషేల సంతానం వివరాలు ఇవి.
2. అహరోను పెద్ద కొడుకు నాదాబు. ఆ తరువాత అబీహు, ఎలియాజరు, ఈతామారు పుట్టారు. [PE][PS]
3. ఈ పేర్లు కలిగిన అహరోను కొడుకులు యాజకులుగా పనిచేయడానికి అభిషేకం పొందారు. వారిని యాజకులుగా ప్రతిష్టించారు.
4. కాని నాదాబు, అబీహు సీనాయి అరణ్యంలో దేవునికి అంగీకారం కాని అగ్నిని అర్పించినప్పుడు యెహోవా సమక్షంలో పడి చనిపోయారు. నాదాబు, అబీహులకు పిల్లలు లేరు. కాబట్టి ఎలియాజరు, ఈతామారు మాత్రమే తమ తండ్రి అయిన అహరోనుతో కలసి యాజక సేవ జరిగించారు. [PE][PS]
5. తరువాత యెహోవా మోషేతో ఇలా చెప్పాడు. “నువ్వు లేవీ గోత్రం వారిని తీసుకుని రా.
6. వారిని అహరోను ఎదుట నిలబెట్టు. వారు అతనికి సహాయకులుగా ఉండాలి. [PE][PS]
7. వారు సన్నిధి గుడారం ఎదుట అహరోను తరపునా, సమాజమంతటి తరపునా బాధ్యతలు నిర్వర్తించాలి. వారు దేవుని మందిరంలో పరిచర్య చేయాలి.
8. సన్నిధి గుడారంలోని అలంకరణలూ, వస్తువుల విషయమై వారు జాగ్రత్త తీసుకోవాలి. ఇశ్రాయేలు గోత్రాల ప్రజలు మందిరంలో సేవ చేస్తున్నప్పుడు వాళ్లకి సహాయం చేయాలి. [PE][PS]
9. కాబట్టి నువ్వు లేవీయులను అహరోనుకూ అతని కొడుకులకూ అప్పగించు. ఇశ్రాయేలు ప్రజలకి సేవ చేయడంలో వారు అహరోనుకి సాయంగా ఉండాలి. వారు సంపూర్ణంగా అతనికి స్వాధీనం అయ్యారు.
10. నువ్వు అహరోనునూ అతని కొడుకులను యాజకులుగా నియమించు. ఆ పరిచర్య చేయడానికి పరాయి వాడు ఎవడన్నా సమీపిస్తే వాడికి మరణ శిక్ష విధించాలి.” [PE][PS]
11. యెహోవా మోషేతో ఇంకా మాట్లాడాడు. ఆయన ఇలా చెప్పాడు.
12. “ఇశ్రాయేలు ప్రజల్లో నుండి నేను లేవీయులను ఎన్నుకున్నాను. ఇశ్రాయేలు ప్రజల్లో నుండి ప్రతి మొదటి మగ సంతానాన్ని తీసుకోడానికి బదులుగా నేను లేవీయులను తీసుకున్నాను. వారు నా వారు.
13. మొదటి సంతానం నాకు చెందుతుంది. ఐగుప్తు దేశంలో నేను వారి మొదటి సంతానాన్ని సంహరించినప్పుడు ఇశ్రాయేలులో మనుషుల్లోనూ, పశువుల్లోనూ మొదటి సంతానాన్ని నా కోసం నేను ప్రత్యేక పరచుకున్నాను. వారు నా వారు. అవి నావి. నేనే యెహోవాను.” [PE][PS]
14. సీనాయి అరణ్యంలో యెహోవా మోషేకు ఇలా చెప్పాడు.
15. “లేవీ వంశానికి చెందిన వాళ్లందర్నీ లెక్కించు. వారి వారి పూర్వీకుల కుటుంబాల ప్రకారం, వారి వంశాల ప్రకారం లెక్కించు. లేవీ వంశానికి చెందిన వాళ్లందర్నీ లెక్కించు. వారి పూర్వీకుల కుటుంబాల ప్రకారం, వారి వంశాల ప్రకారం లెక్కించు. ఒక నెల వయసున్న పిల్లల నుండి పురుషులందరినీ లెక్కపెట్టు.”
16. మోషే యెహోవా తనకు ఆదేశించిన ప్రకారం ఆయన చెప్పినట్టే వారిని లెక్కించాడు. [PE][PS]
17. లేవీకి గెర్షోను, కహాతు, మెరారి అనే కొడుకులున్నారు.
18. గెర్షోను కొడుకుల పేర్లు లిబ్నీ, షిమీ. ఈ పేర్లతో పిలిచే తెగలకు వీరే వంశకర్తలు.
19. కహాతు కొడుకుల పేర్లు అమ్రాము, ఇస్హారు, హెబ్రోను, ఉజ్జీయేలు. ఈ పేర్లతో పిలిచే తెగలకు వీరే వంశకర్తలు.
20. మెరారి కొడుకుల పేర్లు మాహలి, మూషి. ఈ పేర్లతో పిలిచే తెగలకు వీరే వంశకర్తలు. ఇవి లేవీ వంశానికి చెందిన తెగలు. [PE][PS]
21. గెర్షోను వంశస్తులు లిబ్నీయులు, షిమీయులు. గెర్షోనీయుల తెగలు అంటే వీరే.
22. వీళ్ళలో ఒక నెల వయసున్న మగ పిల్లల నుండి లెక్క పెడితే మొత్తం 7, 500 మంది ఉన్నారు.
23. గెర్షోనీయుల తెగలు దేవుని మందిరానికి పడమటి దిశగా అంటే వెనుక వైపున గుడారాలు వేసుకోవాలి. [PE][PS]
24. గెర్షోనీయుల తెగలకు లాయేలు కుమారుడు ఎలీయాసాపు నాయకత్వం వహించాలి.
25. గెర్షోను వంశం వారు సన్నిధి గుడారంలో మందిరానికీ, పైకప్పుగా ఉన్న తెరలకు బాధ్యత వహించాలి. ఇంకా గుడారానికీ, పైకప్పుకీ, సన్నిధి గుడారం ప్రవేశద్వారం దగ్గర ఉండే తెరలకీ బాధ్యత వహించాలి.
26. మందిరమూ, బలిపీఠమూ ఉండే ఆవరణ అడ్డతెరలకూ, ఆవరణ ద్వారం దగ్గర ఉండే తెరలకూ వారు బాధ్యత వహించాలి. సన్నిధి గుడారం లోని తాళ్లకీ దానిలో ఉన్న సమస్తానికీ వారు బాధ్యత వహించాలి. [PE][PS]
27. కహాతు నుండి అమ్రామీయులు, ఇస్హారీయులు, హెబ్రోనీయులు, ఉజ్జీయేలీయులు అనే తెగలు కలిగాయి. ఇవి కహాతీయుల తెగలు
28. వీళ్ళలో ఒక నెల వయసున్న మగ పిల్లల నుండి లెక్క పెడితే మొత్తం 8, 600 మంది ఉన్నారు. వీరు పరిశుద్ధ స్థలం బాధ్యత తీసుకోవాలి.
29. కహాతు వంశస్తులు మందిరం దక్షిణం వైపున తమ గుడారాలు వేసుకోవాలి. [PE][PS]
30. కహాతీయుల తెగలకు ఉజ్జీయేలు కొడుకు ఎలీషాపాను నాయకత్వం వహించాలి.
31. వీరు మందసం, బల్ల, దీపస్తంభం, వేదికలు, పరిశుద్ధ స్థలంలోని వస్తువులు, పరిశుద్ధస్థలం తెర ఇంకా పరిశుద్ధస్థలంలో ఉన్న వాటి విషయమై బాధ్యత వహించాలి.
32. లేవీయులను నడిపించే వారందరికీ యాజకుడైన అహరోను కొడుకు ఎలియాజరు నాయకత్వం వహించాలి. అతడు పరిశుద్ధస్థలం బాధ్యత తీసుకున్న వారిని పర్యవేక్షించాలి. [PE][PS]
33. మెరారి నుండి రెండు తెగలు కలిగాయి. అవి మహలీయులు, మూషీయులు. ఇవి మెరారి తెగలు.
34. వీళ్ళలో ఒక నెల వయసున్న మగ పిల్లల నుండి లెక్క పెడితే మొత్తం 6, 200 మంది ఉన్నారు.
35. మెరారీ తెగలకు అబీహాయిలు కొడుకు సూరీయేలు నాయకత్వం వహించాలి. వారు మందిరానికి ఉత్తరం వైపున తమ గుడారాలు వేసుకోవాలి. [PE][PS]
36. మెరారి వంశస్తులు మందిరపు పలకలకూ, దాని అడ్డకర్రలకూ, దాని స్తంభాలకూ, దాని మూలాలకూ, దాని స్థిర సామగ్రికీ, ఇంకా దానికి సంబంధిన వాటన్నిటికీ,
37. అంటే దాని చుట్టూ ఉన్న ఆవరణ స్తంభాలకీ, వాటి దిమ్మలకీ, మేకులకీ, తాళ్లకీ బాధ్యత వహించాలి. [PE][PS]
38. మోషే, అహరోనూ, అతని కొడుకులూ మందిరానికి తూర్పు వైపున సూర్యోదయ దిశగా సన్నిధి గుడారానికి ఎదురుగా తమ గుడారాలు వేసుకోవాలి. ఇశ్రాయేలు ప్రజలు చేయాల్సిన పనులకూ, పరిశుద్ధ స్థలంలో నెరవేర్చాల్సిన విధులకూ వారు బాధ్యత వహించాలి. పరాయి వాడు ఎవడైనా పరిశుద్ధ స్థలాన్ని సమీపిస్తే వాడికి మరణ శిక్ష విధించాలి.
39. యెహోవా తమకు ఆదేశించినట్లు మోషే అహరోనులు లేవీ వంశంలో ఒక నెల వయసున్న మగ బిడ్డ నుండి అందర్నీ లెక్కించారు. వారు 22,000 మంది అయ్యారు. [PE][PS]
40. తరువాత యెహోవా మోషేతో ఇలా చెప్పాడు “ఇశ్రాయేలు ప్రజల్లో మొదటి సంతానం అయిన పురుషులను ఒక నెల, ఆ పై వయసున్న వారిందర్నీ లెక్క పెట్టు. వారి పేర్లు రాయి.
41. నేనే యెహోవాను. ఇశ్రాయేలు ప్రజల్లో మొదటి సంతానానికి బదులుగా నాకోసం లేవీ జాతి వారిని వేరు చెయ్యి. అలాగే ఇశ్రాయేలు ప్రజలకు చెందిన పశువుల్లో మొదటి సంతానానికి బదులుగా లేవీ జాతి వారి పశువులను నాకోసం తీసుకోవాలి.” [PE][PS]
42. యెహోవా తనకు ఆదేశించిన విధంగా మోషే ఇశ్రాయేలు ప్రజల్లో మొదటి సంతానాన్ని లెక్కపెట్టాడు.
43. ఒక నెల, ఆ పై వయసున్న మొదటి మగ సంతానాన్ని లెక్కించాడు. వారి సంఖ్య 22, 273 అయింది. [PE][PS]
44. తరువాత యెహోవా మోషేకి ఇలా ఆదేశించాడు.
45. “ఇశ్రాయేలు ప్రజల్లో మొదటి సంతానం అయిన 22, 273 మందిలో ప్రతివాడికి బదులుగా నువ్వు లేవీ జాతి వారిని వారి పశువులకి బదులుగా లేవీ జాతి వారి పశువులను తీసుకో. లేవీ జాతి వారు నా వారుగా ఉంటారు. నేనే యెహోవాను. [PE][PS]
46. ఇశ్రాయేలు ప్రజల్లో మొదటి పుట్టినవారు లేవీ జాతి వారి కంటే 273 మంది ఎక్కువ అయ్యారు. వారిని విడిపించడం కోసం ఒక్కొక్కరి దగ్గర ఐదేసి తులాల వెండి తీసుకో.
47. పరిశుద్ధ స్థలంలో ప్రమాణమైన తులం బరువులో అది ఉండాలి. ఒక తులం 20 చిన్నాలు.
48. ఎక్కువైన వారిని విడిపించడానికి సేకరించిన ఆ ధనాన్ని అహరోనుకూ అతని కొడుకులకూ ఇవ్వాలి.” [PE][PS]
49. కాబట్టి మోషే లేవీ జాతివారి కంటే ఎక్కువగా ఉన్న వారి దగ్గర ఆ విడుదల సొమ్మును సేకరించాడు.
50. ఇశ్రాయేలు ప్రజల పెద్ద కొడుకుల దగ్గర ఆ సొమ్మును సేకరించాడు. పరిశుద్ధ స్థలంలో చెలామణీ అయ్యే తులం ప్రకారం 1, 365 తులాలు సేకరించాడు.
51. మోషే తనకు యెహోవా ఆదేశించినట్లు ఆ విడుదల సొమ్మును అహరోనుకీ అతని కొడుకులకీ ఇచ్చాడు. [PE]