1. [QS]యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి. ఆయన నామాన్ని ప్రకటన చేయండి. జాతుల్లో ఆయన కార్యాలను తెలియచేయండి. [QE]
2. [QS]ఆయనను గూర్చి పాడండి. ఆయనను కీర్తించండి. ఆయన ఆశ్చర్య కార్యాలన్నిటిని గూర్చి సంభాషణ చేయండి. [QE]
3. [QS]ఆయన పరిశుద్ధ నామాన్నిబట్టి అతిశయించండి. యెహోవాను వెతికేవారు హృదయంలో సంతోషించుదురు గాక. [QE]
4. [QS]యెహోవాను వెదకండి. ఆయన బలాన్ని వెదకండి. ఆయన సన్నిధిని నిత్యం అన్వేషించండి. [QE]
5. [QS]ఆయన సేవకుడైన అబ్రాహాము వంశస్థులారా, ఆయన ఏర్పరచుకున్న యాకోబు సంతతివారలారా, ఆయన చేసిన ఆశ్చర్య కార్యాలను జ్ఞాపకం చేసుకోండి. [QE]
6. [QS]ఆయన చేసిన సూచక క్రియలను, ఆయన నోటి తీర్పులను జ్ఞాపకం చేసుకోండి. [QE]
7. [QS]ఆయన మన దేవుడైన యెహోవా. ఆయన తీర్పులు భూమి అంతటా అమలు అవుతున్నాయి. [QE]
8. [QS]తాను సెలవిచ్చిన మాటను వెయ్యి తరాల వరకూ ఆయన గుర్తుంచుకుంటాడు. అబ్రాహాముతో తాను చేసిన నిబంధనను, [QE]
9. [QS]ఇస్సాకుతో తాను చేసిన ప్రమాణాన్ని, నిత్యం ఆయన జ్ఞాపకం చేసుకుంటాడు. [QE]
10. [QS]వారి సంఖ్య కొద్దిగా ఉన్నప్పుడు, ఆ కొద్ది మంది ఆ దేశంలో పరదేశులుగా ఉన్నప్పుడు, [QE]
11. [QS]కొలిచిన వారసత్వంగా కనాను దేశం మీకిస్తానని ఆయన చెప్పాడు. [QE]
12. [QS]ఆ మాట యాకోబుకు శాసనంగాను ఇశ్రాయేలుకు నిత్య నిబంధనగాను స్థిరపరచాడు. [QE]
13. [QS]వారు జనం నుండి జనానికి, రాజ్యం నుండి రాజ్యానికి తిరుగులాడుతుండగా [QE]
14. [QS]వారిని హింసించడానికి ఆయన ఎవరినీ అనుమతించలేదు. ఆయన వారి కోసం రాజులను శిక్షించాడు. [QE]
15. [QS]నేను అభిషేకించిన వారిని తాకవద్దు, నా ప్రవక్తలకు హాని చేయవద్దు అని ఆయన చెప్పాడు. [QE]
16. [QS]దేశం మీదికి ఆయన కరువు రప్పించాడు. జీవనాధారమైన ధాన్యమంతా ధ్వంసం చేశాడు. [QE]
17. [QS]వారికంటే ముందుగా ఆయన ఒకణ్ణి పంపించాడు. వారు యోసేపును బానిసగా అమ్మేశారు. [QE]
18. [QS]వారు సంకెళ్లతో అతని కాళ్లు నొప్పించారు. ఇనుము అతని ప్రాణాన్ని బాధించింది. [QE]
19. [QS]అతడు చెప్పిన సంగతి నెరవేరేదాకా యెహోవా వాక్కు అతణ్ణి పరీక్షించాడు. [QE]
20. [QS]రాజు వర్తమానం పంపి అతణ్ణి విడిపించాడు. ప్రజల పాలకుడు అతణ్ణి విడుదల చేశాడు. [QE]
21. [QS]ఇష్టప్రకారం అతడు తన అధిపతులపై పెత్తనం చెయ్యడానికి, తన పెద్దలకు బుద్ధి చెప్పడానికి, [QE]
22. [QS]తన ఇంటికి యజమానిగా, తన ఆస్తి అంతటిపై అధికారిగా అతణ్ణి నియమించాడు. [QE]
23. [QS]ఇశ్రాయేలు ఈజిప్టులోకి వచ్చాడు. యాకోబు హాము దేశంలో పరదేశిగా ఉన్నాడు. [QE]
24. [QS]ఆయన తన ప్రజల సంతానాన్ని వృద్ధి చేశాడు. వారి విరోధులకంటే వారికి అధికబలం దయచేశాడు. [QE]
25. [QS]తన ప్రజలపై పగబట్టేలా తన సేవకుల పట్ల కుయుక్తిగా నడుచుకునేలా ఆయన వారి హృదయాలను మళ్ళించాడు. [QE]
26. [QS]ఆయన తన సేవకుడైన మోషేను, తాను ఏర్పరచుకున్న అహరోనును పంపించాడు. [QE]
27. [QS]వారు ఐగుప్తీయుల మధ్య ఆయన సూచక క్రియలను, హాము దేశంలో మహత్కార్యాలను జరిగించారు. [QE]
28. [QS]ఆయన అంధకారం పంపించి చీకటి కమ్మేలా చేశాడు. వారు ఆయన మాటను ఎదిరించలేదు. [QE]
29. [QS]ఆయన వారి జలాలను రక్తంగా మార్చాడు. వారి చేపలను చంపాడు. [QE]
30. [QS]వారి దేశంలో కప్పలు నిండిపోయాయి. అవి వారి రాజుల గదుల్లోకి వచ్చాయి. [QE]
31. [QS]ఆయన ఆజ్ఞ ఇయ్యగా జోరీగలు పుట్టాయి. వారి ప్రాంతాలన్నిటిలోకీ దోమలు వచ్చాయి. [QE]
32. [QS]ఆయన వారిమీద వడగండ్ల వాన కురిపించాడు. వారి దేశంలో అగ్నిజ్వాలలు పుట్టించాడు. [QE]
33. [QS]వారి ద్రాక్షతీగెలను, వారి అంజూరు చెట్లను పడగొట్టాడు. వారి ప్రాంతాల్లో వృక్షాలను విరగగొట్టాడు. [QE]
34. [QS]ఆయన ఆజ్ఞ ఇయ్యగా పెద్ద మిడతలు, లెక్కలేనన్ని చీడపురుగులు వచ్చాయి, [QE]
35. [QS]అవి వారి దేశంలోని కూరగాయల చెట్లన్నిటిని, వారి భూమి పంటలను తినివేశాయి. [QE]
36. [QS]వారి దేశంలోని జ్యేష్ఠులను, వారి ప్రథమ సంతానాన్ని ఆయన హతం చేశాడు. [QE]
37. [QS]అక్కడనుండి తన ప్రజలను వెండి బంగారాలతో ఆయన రప్పించాడు. వారి గోత్రాల్లో నిస్సత్తువ చేత తొట్రిల్లేవాడొక్కడైనా లేడు. [QE]
38. [QS]వారివలన ఐగుప్తీయులకు భయం వేసింది. వారు వెళ్లిపోయినప్పుడు ఐగుప్తీయులు సంతోషించారు. [QE]
39. [QS]వారికి నీడగా ఆయన మేఘాన్ని కల్పించాడు. రాత్రి వెలుగివ్వడానికి అగ్నిని కలగజేశాడు. [QE]
40. [QS]వారు మనవి చేయగా ఆయన పూరేళ్లను రప్పించాడు. ఆకాశంలోనుండి ఆహారాన్నిచ్చి వారిని తృప్తి పరిచాడు. [QE]
41. [QS]శిలను చీల్చగా నీళ్లు ఉబికి వచ్చాయి. ఎడారుల్లో అవి ఏరులై ప్రవహించాయి. [QE]
42. [QS]ఎందుకంటే ఆయన తన పరిశుద్ధ వాగ్దానాన్ని, తన సేవకుడైన అబ్రాహామును జ్ఞాపకం చేసుకుని, [QE]
43. [QS]తన ప్రజలను సంతోషంతోను, తాను ఏర్పరచుకున్న వారిని ఉత్సాహధ్వనితోను బయటికి రప్పించాడు. [QE]
44. [QS]అన్యజనుల భూములను ఆయన వారికప్పగించాడు. ఇతర జాతుల సౌభాగ్యాన్ని వారు స్వాధీనపరచుకున్నారు. [QE]
45. [QS]వారు తన కట్టడలను గైకొనేలా, తన ధర్మశాస్త్రవిధులను ఆచరించేలా చేయడానికి ఆయనిలా చేశాడు. యెహోవాను స్తుతించండి. [QE]