1. దేవా, నన్ను కాపాడు. నా ప్రాణం మీద నీళ్ళు పొర్లి పారుతున్నాయి. [QBR]
2. లోతైన అగాధంలాంటి ఊబిలో నేను దిగబడిపోతున్నాను. నిలబడలేకుండా ఉన్నాను. లోతైన నీళ్ళలో నేను మునిగిపోయాను. వరదలు నన్ను ముంచెత్తుతున్నాయి. [QBR]
3. నేను కేకలు వేసి అలసిపోయాను, నా గొంతు ఎండిపోయింది. నా దేవుని కోసం కనిపెడుతూ ఉండగా నా కళ్ళు క్షీణించాయి. [QBR]
4. ఏ కారణం లేకుండా నా మీద పగబట్టిన వారు నా తలవెంట్రుకలకంటే ఎక్కువమంది ఉన్నారు. అకారణంగా నాకు శత్రువులై నన్ను చంపాలని చూసేవారు అనేకమంది. నేను దోచుకోని దాన్ని నేను తిరిగి ఇవ్వాల్సి వచ్చింది. [QBR]
5. దేవా, నా బుద్ధిహీనత నీకు తెలుసు. నా పాపాలు నీకు తెలియనివి కావు. [QBR]
6. దేవా, సేనల ప్రభువైన యెహోవా, నీ కోసం ఎదురు చూసే వారికి నా మూలంగా సిగ్గు కలగనీయవద్దు. ఇశ్రాయేలు దేవా, నిన్ను వెదికే వారు నా మూలంగా అవమానం పాలు కానీయకు. [QBR]
7. నీ కోసం నేను నిందలు పడ్డాను. నీ కోసమే నేను సిగ్గు పడాల్సి వచ్చింది. [QBR]
8. నా సోదరులకు నేను పరాయివాణ్ణి అయ్యాను. నా తల్లి కొడుకులకు పరదేశిని అయ్యాను. [QBR]
9. నీ ఇంటిని గూర్చిన ఆసక్తి నన్ను తినివేసింది. నిన్ను నిందించిన వారి నిందలు నా మీద పడ్డాయి. [QBR]
10. నేను ఉపవాసముండి ఏడ్చినపుడు నా ఆత్మకు అది నింద కారణమైంది. [QBR]
11. నేను గోనెపట్ట కట్టుకున్నప్పుడు వారు అపహాస్యం చేశారు. [QBR]
12. నగర ద్వారాల్లో కూర్చున్నవారు నన్ను గురించే మాట్లాడుకుంటున్నారు. తాగుబోతులు నన్ను గూర్చి పాటలు పాడతారు. [QBR]
13. యెహోవా, నీకే నేను ప్రార్థన చేస్తున్నాను. అనుకూల సమయంలో జవాబివ్వు. దేవా, నమ్మదగిన నీ రక్షణ సత్యాన్ని బట్టి నాకు జవాబు దయచెయ్యి. [QBR]
14. ఊబిలోనుండి నన్ను తప్పించు. నన్ను మునిగి పోనీయకు. నన్ను ద్వేషించే వారి చేతినుండి, లోతైన జలాల నుండి నన్ను తప్పించు. [QBR]
15. వరదలు నన్ను ముంచెయ్యనియ్యకు. అగాథం నన్ను మింగనియ్యకు. నన్ను గుంటలో పడనియ్యకు. [QBR]
16. యెహోవా, నీ నిబంధన కృపలోని మంచితనాన్ని బట్టి నాకు జవాబివ్వు. అధికమైన నీ కృపను బట్టి నావైపు తిరుగు. [QBR]
17. నీ సేవకుడి నుండి నీ ముఖం తిప్పుకోకు. నేను నిస్పృహలో ఉన్నాను, నాకు త్వరగా జవాబివ్వు. [QBR]
18. నా దగ్గరికి వచ్చి నన్ను విమోచించు. నా శత్రువులను చూసి నన్ను విడిపించు. [QBR]
19. నాకు నింద, సిగ్గు, అవమానం కలిగాయని నీకు తెలుసు. నా విరోధులంతా నీ ఎదుటే ఉన్నారు. [QBR]
20. నింద వలన నా హృదయం బద్దలైంది. నేను ఎంతో కృశించిపోయాను. నన్ను ఎవరైనా కనికరిస్తారేమో అని చూశాను గానీ ఎవరూ లేరు. ఓదార్చే వారి కోసం కనిపెట్టాను గాని ఎవరూ కనిపించ లేదు. [QBR]
21. వారు నాకు ఆహారంగా చేదు విషాన్ని పెట్టారు. నాకు దాహం అయినప్పుడు తాగడానికి పులిసిన ద్రాక్షరసం ఇచ్చారు. [QBR]
22. వారి సంపద [* సంపద భోజనం బల్ల ] వారికి ఉరి అవుతుంది గాక. క్షేమంగా ఉన్నామని అనుకున్నప్పుడు అది వారికి ఒక బోనుగా ఉంటుంది గాక. [QBR]
23. వారు చూడలేకపోయేలా వారి కళ్ళకు చీకటి కమ్ముతుంది గాక. వారి నడుములకు ఎడతెగని వణకు పుడుతుంది గాక. [QBR]
24. వారి మీద నీ ఉగ్రతను కుమ్మరించు. నీ కోపాగ్ని వారిని ఆవరిస్తుంది గాక. [QBR]
25. వారి నివాసం నిర్జనం అవుతుంది గాక. వారి గుడారాల్లో ఎవరూ నివాసం ఉండరు గాక. [QBR]
26. నువ్వు దెబ్బ కొట్టిన వాణ్ణి వారు బాధిస్తున్నారు. నువ్వు గాయపరచిన వారి వేదన గూర్చి వారు కబుర్లాడుతున్నారు. [QBR]
27. ఒకదాని తరవాత ఒకటిగా అపరాధాలు వారికి తగలనివ్వు. నీ నీతిగల విజయంలోకి వారిని చేరనివ్వకు. [QBR]
28. జీవగ్రంథంలో నుండి వారి పేరు చెరిపివెయ్యి. నీతిమంతుల జాబితాలో వారి పేర్లు రాయవద్దు. [QBR]
29. నేను బాధలో, వేదనలో మునిగి ఉన్నాను. దేవా, నీ రక్షణ నన్ను లేవనెత్తు గాక. [QBR]
30. దేవుని నామాన్ని గానాలతో స్తుతిస్తాను. కృతజ్ఞతలతో ఆయన్ని ఘనపరుస్తాను. [QBR]
31. ఎద్దు కంటే, కొమ్ములు డెక్కలు గల కోడె కంటే అది యెహోవాకు ఇష్టం. [QBR]
32. దీనులు అది చూసి సంతోషిస్తారు. దేవుని వెదికేవారలారా, మీ హృదయాలు తిరిగి బ్రతుకు గాక. [QBR]
33. అక్కరలో ఉన్నవారి ప్రార్థన యెహోవా ఆలకిస్తాడు. బంధకాల్లో ఉన్న తన వారిని ఆయన అలక్ష్యం చేయడు. [QBR]
34. భూమీ ఆకాశాలూ ఆయనను స్తుతిస్తాయి గాక. సముద్రాలు, వాటిలోని సమస్తం ఆయనను స్తుతిస్తాయి గాక. [QBR]
35. దేవుడు సీయోనును రక్షిస్తాడు. ఆయన యూదా పట్టణాలను తిరిగి కట్టిస్తాడు. ప్రజలు అక్కడ నివాసం ఉంటారు. అది వారి సొంతం అవుతుంది. [QBR]
36. ఆయన సేవకుల సంతానం దాన్ని వారసత్వంగా పొందుతారు. ఆయన నామాన్ని ప్రేమించేవారు అందులో నివసిస్తారు. [PE]